21 నుంచి జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు 

Telangana Inter admissions to begin on May 21 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, మోడల్‌ స్కూల్స్, గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు తెలంగాణ ఇంటర్మీడియెట్‌ బోర్డు షెడ్యూల్‌ జారీ చేసింది. ఈ నెల 21 నుంచి మొదటి దశ ప్రవేశాలు చేపట్టనున్నట్లు తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ఫారాల పంపిణీ, ప్రవేశాలు చేపట్టేందుకు కాలేజీలకు అనుమతినిచ్చింది. మొదటి దశ ప్రవేశాలను వచ్చే నెల 30 నాటికి పూర్తి చేయాలని పేర్కొంది. జూన్‌ 1వ తేదీ నుంచే తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌ మార్కుల మెమోల ఆధారంగా ఈ ప్రొవిజనల్‌ ప్రవేశాలను చేపట్టాలని వెల్లడించింది. ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు, ఒరిజనల్‌ ఎస్సెస్సీ మెమోలు వచ్చాక ఆయా ప్రవేశాలను కన్‌ఫర్మ్‌ చేయాలని వివరించింది. రెండో దశ ప్రవేశాల షెడ్యూల్‌ను తరువాత జారీ చేస్తామని తెలిపింది.  జూనియర్‌ కాలేజీల ప్రిన్పిపల్స్‌ రూల్‌ రిజర్వేజన్‌ ఆధారంగా సీట్లను కేటాయించాలని బోర్డు సూచించింది.

షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలు:
- విద్యార్థుల గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌, సబ్జెక్టుల వారీ గ్రేడ్‌ల ఆధారంగానే ప్రవేశాలు
- ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదు. అలా చేస్తే ఆయా కాలేజీలపై కఠిన చర్యలు
- ఏ కాలేజీలో చేరినా విద్యార్థుల ఆధార్‌ నంబరు నమోదు తప్పనిసరి
- కాలేజీలో మంజూరైన సీట్ల మేరకే ప్రవేశాలు, ప్రతి సెక్షన్‌ 88 సీట్లకు మించకూడదు
- బోర్డు రద్దు చేసిన కాంబినేషన్లలో ప్రవేశాలు చేపట్టకూడదు.
- బోర్డు అనుమతులు వచ్చాకే అదనపు సెక్షన్లలో ప్రవేశాలు
- ఈ నిబంధలను అతిక్రమిస్తే జరిమానాతో పాటు కాలేజీ అనుబంధ గుర్తింపు రద్దు
- కాలేజీలో కోర్సుల వారీగా మంజూరైన సీట్లు, భర్తీ అయిన సీట్ల వివరాలను కాలేజీ గేటు వద్దే ప్రదర్శించాలి
- ఈ ప్రవేశాలకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయకూడదు
- జోగినిల పిల్లలకు రికార్డుల్లో తండ్రి పేరు స్థానంలో తల్లి పేరునే రాయాలి
- అనుబంధ గుర్తింపు కలిగిన కాలేజీల వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (tsbie.cgg.gov.in) పొందవచ్చు. తల్లిదండ్రులు అందులో గుర్తింపు కలిగిన కాలేజీల్లోనే తమ పిల్లలను చేర్చాలి. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top