పన్నుల రాబడి పైపైకి  | Telangana Income Tax Is Increased | Sakshi
Sakshi News home page

పన్నుల రాబడి పైపైకి 

Jul 3 2018 2:01 AM | Updated on Jul 3 2018 5:02 AM

Telangana Income Tax Is Increased - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వానికి గత నాలుగేళ్లుగా పన్నుల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌తో కూడిన రాష్ట్ర స్వీయ పన్నుల రాబడి (స్టేట్‌ వోన్‌ ట్యాక్స్‌ రెవెన్యూ)తో సర్కారు ఖజానా గలగలలాడుతోంది. రాష్ట్ర స్వీయ పన్నుల రాబడి రూపంలో 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ. 35,146 కోట్ల పన్నుల రాబడి రాగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 56,520 కోట్లకు పెరిగింది. రాష్ట్రానికి వచ్చే మొత్తం పన్నుల ఆదాయంలో రాష్ట్ర స్వీయ పన్నుల రూపంలో వచ్చి న రాబడి 2014–15లో 74 శాతంగా ఉండగా 2015–16లో అది 87 శాతానికి పెరిగింది. వస్తు సేవల పన్ను, నోట్ల రద్దు అమలుతో 2016–17లో పన్నుల రాబడి స్వల్పంగా తగ్గి 84 శాతం నమోదవగా 2017–18లో 87 శాతానికి పెరిగింది. వాణిజ్య పన్నుల రూపంలో వసూలయ్యే మొత్తం ఎక్కువగా ఉంటోంది. వాణిజ్య పన్నుల రూపంలో 2014–15లో రూ. 22,949 కోట్లు, 2017–18లో రూ. 39,522 కోట్ల మేర పన్నులు వసూలయ్యాయి.

అలాగే 2014–15లో ఎక్సైజ్‌శాఖ నుంచి వచ్చిన ఆదాయం రూ. 3,091 కోట్లుగా నమోదైంది. 2017–18లో ఈ శాఖ ఆధ్వర్యంలో రూ. 9,429 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేస్తున్నాయని, పన్నుల రాబడి పెరుగుదల దీన్ని స్పష్టం చేస్తోందని అధికారులు చెబుతున్నారు. సంపాదనపరంగా ఉండే ఆదాయం పెరగడంతో ప్రజల వినియోగ సామర్థ్యం, కొనుగోలు శక్తి పెరిగిందని... వాణిజ్య పన్నుల వృద్ధి దీన్ని స్పష్టం చేస్తోందని అంటున్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆదాయం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ కొనుగోళ్లలో వృద్ధి నమోదవుతోందని విశ్లేషిస్తున్నారు. కాగా, ఆదాయ అభివృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) ఇటీవల వెల్లడించడం తెలిసిందే. 

రాష్ట్ర సొంత వనరుల నుంచి రాబడి (రూ. కోట్లలో) 
2014–15        35,146 
2015–16        39,975 
2016–17        48,408 
2017–18        56,520 
–––––––––––––– 
వాణిజ్య పన్నుల రాబడి (రూ. కోట్లలో) 
2014–15        22,949 
2015–16        30,879 
2016–17        35,078 
2017–18        39,522  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement