సచివాలయం ఇక కూల్చివేతే! 

Telangana Government Will Demolish Old Secretariat Very Soon  - Sakshi

 సచివాలయ భవనాల కూల్చివేతకు ఏర్పాట్లు వేగిరం

నెలాఖరులోగా నేలమట్టం చేయాలని యోచన

పాత వాహనాల తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయ భవనాల కూల్చివేతకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయ భవనాలను కూల్చివేసి ఆధునిక హంగులతో కొత్త భవన సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా గత సోమవారం రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రభుత్వం వేగం పెంచింది. హైకోర్టు తీర్పు వచ్చిన రోజే డీ–బ్లాక్‌లోని ఐటీ శాఖ సర్వర్‌ను ప్రభుత్వం బీఆర్‌కేఆర్‌ భవన్‌కు తరలించడంతో పాటు మీడియా పాయింట్‌ను సైతం ఖాళీ చేయించి సచివాలయ ప్రధాన ప్రవేశ ద్వారం గేట్లకు తాళాలు వేయించిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడిగా సచివాలయంలో నిరుపయోగంగా ఉన్న వాహనాల తరలింపును బుధవారం ప్రారంభించింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశాల మేరకు నిరుపయోగంగా ఉన్న వాహనాలను క్రేన్ల సహాయంతో సైఫాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిజాం కళాశాల మైదానానికి తరలించారు. వందకు పైగా కార్లు, జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వీటిలో ఉన్నాయి. చాలా వాహనాలు శిథిలమైపోగా, కొన్ని వాహనాలు పనికొచ్చే స్థితిలో ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రవాణాశాఖ పరిశీలించి ధరలను ఖరారు చేశాక... బహిరంగ వేలం ద్వారా వీటిని విక్రయించే అవకాశముంది. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను కొనుగోలు చేయడంతో చాలా మంది అధికారులు తమ పాత వాహనాలను సచివాలయంలో నిరుపయోగంగా ఉంచారు. వీటిలో పనికి వచ్చే వాహనాలను గుర్తించి వేలం వేయనున్నారు. 

నెలాఖరులోగా... 
వివిధ శాఖల కార్యాలయాలను బీఆర్‌కేఆర్‌ భవన్‌తో పాటు నగరంలోని ఇతర ప్రభుత్వ భవనాలకు తరలించడంతో దాదాపు ఏడాదికాలంగా సచివాలయ భవనాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోవడంతో సచివాలయ భవనాల కూల్చివేతకు ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నెలాఖరులోగా భవనాలన్నింటినీ నేలమట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. శ్రావణ మాసంలో టెండర్లు నిర్వహించి కొత్త భవన సముదాయం నిర్మాణ పనులను ప్రారంభించే అవకాశాలున్నాయి.  
    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top