రెండో విడత షురూ..

Telangana Government Sheep Distribution Scheme Phase 2 Started - Sakshi

గద్వాల వ్యవసాయం : గొర్రెల పెంపంకం అభివృద్ధి పథకంలో భాగంగా అందించే రెండో విడత గొర్రెల పంపిణీ మొదలైంది. జిల్లా పశుసంవర్దకశాఖ అధికారులు ఇప్పటికే జాబితా ‘ఏ’ కింద మొదటి విడతను పూర్తి చేసి జాబితా ‘బీ’ కింద ఉన్న లబ్ధిదారులకు జూలై చివరివారం నుంచే పంపిణీ ప్రక్రియ ఆరభించారు. కొత్తగా సహకార సంఘాలు ఏర్పాటు చేసుకొని గొర్రెలు కావాలని ఈ ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సైతం పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు నివేదించారు.  

రాయితీ ఇలా..
పెంపకందారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది జూన్‌ 20న ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీంతో కురుమ యాదవులు  గ్రామాల వారీగా సహకార సంఘాలు ఏర్పాటు చేశారు. డిప్‌ ద్వార మొదటి విడత, రెండో విడత లబ్దిదారులను ఎంపిక చేశారు. మొదటివిడత లబ్దిదారులకు (లిస్ట్‌–ఏ) 2017–18లో, రెండో విడత లబ్ధిదారులకు (లిస్ట్‌–బి) 2018–19 ఆర్థిక సంవత్సరాల్లో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో యూనిట్‌లో ఒక పొట్టేలు, 20 గొర్రెలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. ఒక్కో యూనిట్‌కు రూ.1.25లక్షలు ఖర్చు అవుతుండగా ఇందులో లబ్దిదారుడు 25శాతం చెల్లిస్తే 75శాతం ప్రభుత్వం రాయితీగా అందిస్తుంది.

శరవేగంగా రెండో విడత పంపిణీ  
రెండో విడత కింద (2018–19) ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పంపిణీ షురూ చేశారు. జూలై చివరివారం నుంచే ప్రక్రియ ప్రారంభంకాగా ఆగస్టు 15న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేతుల మీదుగా కొన్ని యూనిట్లు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 487 యూనిట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో పంపిణీ చేసిన గొర్రెలను ఏపీలోని అనంతపురం, తాడిపత్రి, కదిరి ప్రాంతాల నుంచి తీసుకొచ్చారు. రెండో విడత గొర్రెలను ఏపీలోని కడప, మహారాష్ట్రలోని నాందేడ్, కర్ణాటకలోని హుమనాబాద్‌ల నుంచి తీసుకొస్తున్నారు. పశుసంవర్దకశాఖ అధికారులు అక్కడి వెళ్లి గొర్రెల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి లక్ష్యం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.    

35,000 మందితో ప్రతిపాదనలు
గత ఏడాది పథకాన్ని ప్రారంభించగా గొర్రెలను కావాలనుకునే పెంపకందారుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. అందరి సమక్షంలో డిప్‌ వేసి లిస్ట్‌ ఏ, బీగా విభజించారు. అయితే జిల్లాలో చాలామంది కురువ కులస్థులు తమను మాదాసి, మాదారి కురువలుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ పలుచోట్ల డిప్‌ కార్యక్రమాన్ని బహిష్కరించారు. సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్నప్పటికీ డిప్‌కు దూరంగా ఉన్నారు. ఇలా సుమారు 35వేల మంది ఉన్నారు. అయితే రెండో విడతలో తమకు గొర్రెల యూనిట్లను అందించాలని, అధికారులు రెండో విడతకు తోడు అదనంగా 35వేల యూనిట్ల మంజూరుకు ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు నివేదించారు.  

అందరికీ న్యాయం
మొదటివిడత గొర్రెల పంపిణీ లక్ష్యాన్ని పూర్తిచేశాం. రెండో విడతలోనూ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప, నాందేడ్, హుమనాబాద్‌ ప్రాంతాల నుంచి గొర్రెలను కొనుగోలు చేస్తున్నాం. అయితే రెండోవిడతలో మరో 35వేల యూనిట్లు అదనంగా మంజూరు చేయాలని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాం.
– డాక్టర్‌ ఆదిత్య కేశవసాయి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

జిల్లాలో గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలు     : 182
సహకార సంఘాల్లోని సభ్యులు                            : 35,300 మంది  
మొదటి విడత పంపిణీ లక్ష్యం                             : 10,872 యూనిట్లు
ఇప్పటివరకు చేసింది                                       : 10,520 యూనిట్లు
రెండో విడత పంపిణీ లక్ష్యం                                : 10,782
ఇప్పటి వరకు చేసింది                                      : 487 యూనిట్లు 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top