టేక్‌ అవేకు ఓకే! 

Telangana Government Issues Lockdown 4 New Guidelines - Sakshi

రెస్టారెంట్లు పార్సిల్‌ సేవలు అందించవచ్చు

పెళ్లికి 50 మంది.. అంత్యక్రియలకు 20 మంది

బైక్‌పై ఇక ఇద్దరు కలసి ప్రయాణించవచ్చు

స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్‌ సంస్థలకు నో పర్మిషన్‌

లాక్‌డౌన్‌ కొత్త మార్గదర్శకాలు విడుదల 

రాష్ట్రంలో మే 31 వరకులాక్‌డౌన్‌ పొడిగింపు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగించటంతో పాటు పలు కొత్త సడలింపులిస్తూ కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు. 

రాష్ట్రవ్యాప్తంగా అనుమతి వీటికే.. 
జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో బస్సులు, ఇతర ప్రయాణికుల వాహనాలను అనుమతిస్తారు.  
టేక్‌ అవే (పార్సిల్‌ తీసుకునిపోవడం)/హోం డెలివరీ సేవలందించడానికి రెస్టారెంట్లను అనుమతిస్తారు. మా స్కులు, గ్లౌజు లు, భౌతికదూరం, క్రమం తప్పకుండా డిస్‌ఇఫెక్టాంట్‌ (క్రి మినివారిణి)తో శుభ్రపరచడం వంటివి తప్పనిసరి.  
ముందుజాగ్రత్త చర్యలతో బార్బర్‌ షాపులు, స్పాలు, సెలూన్స్‌ను అనుమతిస్తారు.  
ట్యాక్సీలు, క్యాబ్‌లు, ఆటో రిక్షాలకు అనుమతి. క్యాబ్‌లు, ట్యాక్సీల్లో డ్రైవర్‌ మినహా గరిష్టంగా మరో ముగ్గురు, ఆటో రిక్షాల్లో డ్రైవర్‌ మినహా గరిష్టంగా ఇద్దరు ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. వీరు తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలి. డ్రైవర్లు, ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ద్విచక్ర వాహనాల పిలియన్‌ రైడర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో ద్విచక్రవాహనంపై ఇద్దరు కలసి ప్రయాణించవచ్చు. 
అన్ని షాపులను తెరిచేందుకు అనుమతి. అయితే, జీహెచ్‌ఎంసీ పరిధిలో పక్కపక్కనే ఉండే రెండు దుకాణాలు ఒకేరోజు తెరవకుండా ఉండే విధంగా ఒకరోజు మారి ఒకరోజు దుకాణాలు తెరవాలి. ఏ దుకాణం ఏ రోజు తెరవాలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోస్టర్‌ను ఖరారు చేస్తారు.  
ఈ–కామర్స్‌ ద్వారా అన్ని రకాల సరుకుల క్రయవిక్రయాలకు అనుమతి  ఊ భౌతికదూరం పాటిస్తూ పెళ్లిళ్లు, సంబంధిత సామూహిక కార్యక్రమాలను 50 మంది అతిథులతో నిర్వహించుకోవచ్చు.  
భౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియలు, సంబంధిత సామూహిక కార్యక్రమాలకు 20 మందికి అనుమతి.  

రాష్ట్రవ్యాప్తంగా నిషేధం వీటిపైనే.. 
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు... మెట్రో రైల్‌ సర్వీసులు 
అంతర్రాష్ట్ర బస్సులు, ఇతర ప్రయాణికుల వాహనాల అంతర్రాష్ట్ర కదలికలు 
చిక్కుకుపోయిన వ్యక్తుల కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక రైళ్లు మినహా మిగిలిన ప్రయాణికుల రైళ్లపై నిషేధం 
అన్ని పాఠశాలలు, కళాశాలలు, విద్యా/కోచింగ్‌/ట్రైనింగ్‌ సంస్థలు తదితరాలు 
హోటళ్లు, లాడ్జీలు వంటి ఆతిథ్య సేవలు. అయితే వైద్య, పోలీసు, ప్రభుత్వ ఉద్యోగులు, చిక్కుకుపోయిన వ్యక్తులకు సేవలందించే వాటికి మినహాయింపు  
బార్లు, పబ్బులు, సినిమా హాళ్లు, థియేటర్లు, షాపింగ్‌ మాల్స్, జిమ్స్, స్విమ్మింగ్‌ పూల్స్, క్రీడా సముదాయాలు, అమ్యూజ్‌మెంట్‌ అండ్‌ జూపార్క్స్, మ్యూజియంలు, ఆడిటోరియంలు 
సామాజిక, రాజకీయ, క్రీడల, వినోద, విద్య, సాంస్కృతిక తదితర రంగాలకు సంబంధించిన అన్ని సామూహిక కార్యక్రమాలు... ళీ అన్ని మతపర స్థలాలు, మతపర సామూహిక కార్యక్రమాలు.  

కర్ఫ్యూ యథాతథం... 
రాత్రిపూట కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది. 
అన్ని రకాల సరుకుల వాహనాలకు అంతర్రాష్ట్ర రవాణా అనుమతి. ఖాళీ ట్రక్కులతో సహా.. 
అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు, నిర్మాణ రంగం కార్యకలాపాలకు అనుమతి 
అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా పనిచేయవచ్చు. అయితే, కార్యాలయాల నిర్వహణ కు జారీ చేసిన ప్రామాణిక విధానాలు  తప్పనిసరిగా అమలు చేయాలి. 
 అన్ని దుకాణాలు, సముదాయాలు, కార్యాలయాలు తప్పనిసరిగా క్రమం తప్పకుండా పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలి. కరోనా వ్యాప్తి చెందకుండా సమూహాలను నివారించాలి. భౌతిక దూరం ఉండేలా చూడాలి.  
నిబంధనల ప్రకారం కచ్చితమైన చుట్టుకొలతలతో కంటైన్మెంట్‌ జోన్లను గుర్తిస్తారు. వీటి నుంచి ఏ ఒక్క వ్యక్తి బయటకి వెళ్లేందుకు, బయట నుంచి లోపలికి వచ్చేందుకు అనుమతించరు. అత్యవసర వైద్య సేవలు, నిత్యావసర వస్తువులు, సేవల నిర్వహణ అవసరాల విషయంలో మినహాయింపు.  
65 ఏళ్లకు పైబడిన వయసు కలిగిన వ్యక్తులు, ఇతర అనారోగ్య సమస్యలు కలిగిన వారు, గర్భిణీలు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇళ్ల వద్దే ఉండాలి. అత్యవసర వైద్యం, నిత్యావసరాల కోసమే బయటకి రావాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top