బీసీ గురుకులాల్లో కొలువులు

Telangana Government To Fill Posts In BC Gurukulam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) బోధనేతర కొలువుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన గురుకుల పాఠశాలలకు బోధనేతర కోటాలో జూనియర్‌ అసిస్టెంట్ల నియామకాలకు ఆమోదం తెలి పింది. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ద్వారా భర్తీ చేయనుంది. 2017–18 విద్యా సంవత్సరంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ ద్వారా కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభం కాగా ప్రాధాన్యతా క్రమంలో ప్రభుత్వం మంజూరు చేసిన టీజీటీ, పీజీటీ పోస్టులను ఇటీవల టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా భర్తీ చేశారు.

ఇప్పటివరకు బోధనా సిబ్బంది భర్తీ మాత్రమే జరిగింది. తాజాగా ఈ పాఠశాలలకు బోధనేతర సిబ్బందిని సైతం భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొలుత జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చింది. ఒక్కో గురుకుల పాఠశాలకు ఓ జూనియర్‌ అసిస్టెంట్‌ చొప్పున కొత్తగా ఏర్పాటైన 119 గురుకులాలు, అంతకు ముందు ఉన్న 20 గురుకులాలకు ఈ పోస్టులు మంజూరయ్యాయి. వారంలోగా ఈ పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది.

కలెక్టర్లకు నియామక బాధ్యతలు..
బీసీ గురుకుల పాఠశాలల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు జిల్లా కేడర్‌ కావడంతో వాటి నియామక బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. అర్హత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, జాబితా రూపకల్పన మాత్రం గురుకుల నియామకాల బోర్డు పర్యవేక్షిస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఒకేసారి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఫలితాల మెరిట్, రోస్టర్‌ పాయింట్ల ఆధారంగా జాబితా తయారు చేస్తారు. వీటిని జిల్లా కలెక్టర్లకు సమర్పించిన తర్వాత అక్కడ ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. అనంతరం అర్హుల జాబితా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని గురుకుల బోర్డు వర్గాలు చెబుతున్నాయి. 

ఇతర పోస్టుల భర్తీకి అవకాశం..
జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ తర్వాత ఇతర కేడర్‌లలో పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైన 119 గురుకులాల్లో టీజీటీ, పీజీటీ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీంతో వీటిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ యంత్రాంగం గురుకుల బోర్డుకు సమర్పించినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top