సినిమా షూటింగ్‌లకు సింగిల్‌ విండో 

Telangana Government Decided For Single Window System Cinema Shooting - Sakshi

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కింద ఐ అండ్‌ పీఆర్‌ చర్యలు

అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణకు ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతి

రెడ్‌ జోన్‌లో నో షూటింగ్‌..ఎల్లో, గ్రీన్‌ జోన్లలో చిత్రీకరణకు ఓకే

పగలు 8 గంటల పాటే షూటింగ్‌.. దానికి రూ. 50 వేల ఫీజు ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ దర్శనీయ, విహార, చారిత్రక ప్రాంతాల్లో సినిమా, టీవీ, ఇతర కార్యక్రమాల చిత్రీకరణకు సింగిల్‌ విండో ద్వారా అనుమతినివ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖలు, వాటి అనుబంధ విభాగాల్లోని ఆయా ప్రదేశాలు, ప్రాంతాల్లో షూటింగ్‌కు ఎక్కడెక్కడ అనుమతినివ్వవచ్చన్న దానిపై సమాచార, పౌరసంబంధాల శాఖ (ఐ అండ్‌ పీఆర్‌) సమాచారాన్ని సేకరిస్తోంది. ఐ అండ్‌ పీఆర్‌ ద్వారా సింగిల్‌ విండో విధానం ద్వారా ఈ అనుమతులకు సంబంధించి ఆన్‌లైన్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో భాగంగా నీటి పారుదల, రోడ్లు, భవనాలు, అటవీ, పర్యావరణ.. ఇలా అన్ని శాఖల నుంచి ఏయే ప్రాంతాల్లో ఫిలిం, టీవీ, ఇతర కార్యకమాల చిత్రీకరణకు అనుమతినిచ్చే అవకాశముందన్న దానిపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆస్తులు, భవనాలు, సుందర ప్రదేశాలు, ఇతర ఆవాసాలకు షూటింగ్‌ సందర్భంగా ఏ నష్టమూ జరగకుండా చూడటం.. ప్లాస్టిక్, ఇతర కాలుష్యం వెదజల్లకుండా, పరిసరాల పరిశుభ్రత పాడుచేయకుండా చిత్రీకరణ బృందాలు జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంటారు.

తొలుత వివిధ శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి షూటింగ్‌కు అనుమతించే ప్రాంతాలు ఏమిటన్న వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. ఈ సమాచారం ప్రాతిపదికన అనుమతికి ఔత్సాహికులు, చిత్ర, టీవీ బృందాలు ఆన్‌లైన్‌లో దర ఖాస్తు చేసుకోవాలి. అన్నీ సజావుగా ఉంటే ఆన్‌లైన్‌లోనే రుసుము చెల్లించి అనుమతులు పొందేం దుకు వీలుంటుందని అధికారులు వెల్లడించారు.

మూడు జోన్లుగా ‘అటవీ’ విభజన 
అటవీశాఖకు సంబంధించి రెడ్, ఎల్లో, గ్రీన్‌ జోన్ల కింద రాష్ట్రంలోని అటవీ ప్రాంతాన్ని విభజించారు. రెడ్‌ జోన్‌ పరిధిలోని పులులు ఇతర అభయారాణ్యాలు, జాతీయపార్కుల్లో షూటింగ్‌లకు అనుమతినివ్వరు. ఎల్లో జోన్‌లోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లు, వాటి పరిధిలోని పార్కుల్లో పరిమితంగా ఆయా అంశాల ప్రాతిపదికన అనుమతిస్తారు. సంబంధిత అటవీ అధికారుల పర్యవేక్షణలోనే, నియమ, నిబంధనలకు లోబడి షూటింగ్‌ చేయాల్సి ఉంటుంది.

గ్రీన్‌జోన్‌ పరిధిలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కు, దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్‌ అకాడమీ, ఇతర జూ పార్కులు, అర్బన్‌ పార్కులు వంటి వాటిలో షూటింగ్‌కు అనుమతినిస్తారు. జిల్లాల వారీగా ఎల్లో, గ్రీన్‌ జోన్ల వివరాలను మ్యాప్‌ల రూపంలో పొందుపర్చడం ద్వారా ఎక్కడెక్కడ షూటింగ్‌ జరుపుకునేందుకు అవకాశం ఉంటుందో తెలియజేయాలనే ఆలోచనతో అటవీశాఖ ఉంది.

అనుమతులకు నిబంధనలివే... 
►పగటి పూట మాత్రమే షూటింగ్‌ 
►అది కూడా 8 గంటల పాటు చిత్రీకరణకు అనుమతి 
►అడవులు, పార్కుల్లో ప్లాస్టిక్‌ వస్తువులను ఉపయోగించొద్దు 
►పర్యావరణానికి, పరిసరాలకు ఎలాంటి నష్టం కలిగించొద్దు 
►8 గంటలకు రూ. 50 వేల ఫీజు ప్రతిపాదన.. 
►ఆయా సందర్భాలు, పరిస్థితులను బట్టి ఈ ఫీజు మారొచ్చు 
►కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేయించుకుని, నియమాలు పాటిస్తే తిరిగిస్తారు 
►లేనిపక్షంలో పరిసరాల క్లీనింగ్, ఇతరత్రా ఖర్చులను అందులోంచి మినహాయిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top