కుయ్‌.. కుయ్‌ సేవలు నై..

Telangana Government 108 Ambulance Vehicles Not Work - Sakshi

పేదల సంజీవనికి పెద్ద తిప్పలొచ్చింది. డీజిల్, ఇతరత్రా సమస్యలతో 108 వాహనాల నిర్వహణ గాలిలో దీపంలా మారింది. జిల్లాలో వారం రోజులుగా వాహనాలు రోడ్డెక్కకపోవడంతో అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులు, అత్యవసర వైద్యం కోసం ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్కో దశలో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నవారికి సరైన సమయానికి వైద్యం అందక కన్నుమూసే పరిస్థితులు నెలకొన్నాయి. సమస్య వచ్చినప్పుడు ఫోన్‌ చేసిన ఐదు నిమిషాల్లోనే ప్రమాద స్థలానికి కుయ్‌.. కుయ్‌మంటూ శబ్దం చేస్తూ పేదల ముంగిట్లో్ల వాలే 108 సేవలకు డీజిల్‌ కష్టాల వల్ల క్షతగాత్రుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది.

ఖమ్మంవైద్యవిభాగం: ప్రాణాపాయ స్థితిలో తక్షణ వైద్య సేవలు అందించే 108 వాహనాల సేవలు డీజిల్‌ కారణంగా వారం రోజులుగా నిలిచిపోయాయి. బంక్‌ యజమానులకు రూ.లక్షల్లో బకాయిలు ఉండడంతో వారు 108 వాహనాలకు డీజిల్‌ పోయడం నిలిపివేశారు. దీంతో సేవలకు అంతరాయం కలుగుతోంది. జిల్లాలో 14 వాహనాలు అత్యవసర సేవలు అందిస్తుండగా.. అందులో 11 వాహనాలు పూర్తిగా షెడ్లకే పరిమితమయ్యాయి. కొన్ని నెలలుగా పేరుకుపోయిన బకాయిలకు సంబంధించిన నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. జిల్లాలోని మధిర, సత్తుపల్లి, కల్లూరు వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని బంక్‌ యజమానులకు నచ్చజెప్పి అక్కడి వాహనాలను పైటెట్లు నెట్టుకొస్తున్నారు. వారంలోపు వాటి బకాయిలు చెల్లించని పక్షంలో అవి కూడా షెడ్లకే పరిమితమవుతాయని అక్కడి వాహనాల పైలెట్లు చెబుతున్నారు.

రూ.12లక్షల బకాయిలు 
సాధారణంగా 108 వాహనాలకు సంబంధించి అధికారులు బంక్‌ యజమానులతో ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. మధిర, సత్తుపల్లి, కల్లూరు, కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వాహనాలకు ఆయా ప్రాంతాల్లో బంక్‌ యజమానులతో ఒప్పందం ఉంటుంది. ప్రతి నెల వాహనాల్లో పోయించిన డీజిల్‌కు అయ్యే ఖర్చు బంక్‌ యజమానులకు చెల్లిస్తుంటారు. అయితే జిల్లాలోని 14 వాహనాలకు సంబంధించి మూడు, నాలుగు నెలలుగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.12లక్షల బకాయిలు బంక్‌ యజమానులకు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు మంజూరు కాకపోవడంతో బంక్‌ యజమానులు క్రమక్రమంగా డీజిల్‌ పోయడం నిలిపివేస్తున్నారు. ప్రస్తుతం మూడు వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి. రేపో మాపో అవి కూడా మూలనపడనున్నాయి. 108 వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేకపోవడంతో అత్యవసర సేవలు నిలిచిపోనున్నాయి. రోడ్డు ప్రమాద బాధితులు, ఇతరత్రా అత్యవసర పరిస్థితుల్లో ప్రమాదాలకు గురైన వారు 108 వాహనాలు లేక మార్గమధ్యలోనే ప్రాణాలు వదలాల్సిన దుస్థితి ఏర్పడింది.
  
మొబైల్‌ సేవలు ఎప్పుడో? 

రాష్ట్ర ప్రభుత్వం టూ వీలర్‌ ద్వారా 108 సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. అందుకుగాను జిల్లాకు రెండు 108 మొబైల్‌ వాహనాలను సమకూర్చింది. అయితే అవి జిల్లాకు చేరి నెలలు గడుస్తున్నా ఇంతవరకు సేవలు ప్రారంభించలేదు. 108 వాహనం కంటే అతి త్వరగా మారుమూల ప్రాంతాలకు అత్యవసర సేవలు అందించేందుకు మొబైల్‌ 108 సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటిని అందుబాటులోకి తెస్తే కొంతమేర సేవలు విస్తృతమవుతాయి. ఒకపక్క ఉన్న వాహనాలు మూలనపడి ఉండగా.. వచ్చిన వాహనాలను వినియోగంలోకి తేకపోవడంతో అత్యవసర సేవలు జిల్లాలో కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా బకాయిలు చెల్లించి.. 108 వాహనాలతోపాటు ఉన్న మొబైల్‌ వాహనాలు వినియోగంలోకి తెచ్చి.. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

పరిష్కారమవుతుంది.. 
రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుంది. బకాయిలు చెల్లించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. డీజిల్‌ సమస్య తీరనుంది. ప్రస్తుతం బంక్‌ యజమానులను ఒప్పించి డీజిల్‌ పోయించే ఏర్పాట్లు చేస్తున్నాం. మొబైల్‌ వాహనాలు కూడా ఈ వారంలోనే రోడ్డెక్కుతాయి. త్వరలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి.  – లక్ష్మణ్, 108 జిల్లా కోఆర్డినేటర్‌

వైఎస్‌ ప్రవేశపెట్టిన సేవలకు ఈ దుస్థితి 
దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని 2008లో రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలను ప్రారంభించారు. అదే సమయంలో జిల్లాలో కూడా సేవలను అందుబాటులోకి తెచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు 108 వాహనంలో తరలించడంతో వారు తమ బిడ్డతో సహా క్షేమంగా ఇంటికెళ్లేవారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను కాపాడేందుకు సైతం ఫోన్‌ చేసిన 5 నిమిషాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని.. వారికి ప్రథమ చికిత్స చేసి.. ప్రాణాపాయం నుంచి కాపాడడం నుంచి గుండెనొప్పి, పురుగు మందులు తాగి ఆత్మహత్యలకు పాల్పడిన వారిని కూడా సకాలంలో ఆస్పత్రికి చేర్చి వారికి ప్రాణదానం చేస్తోంది 108 వాహనం. కొన్నేళ్లుగా 108 సేవల కారణంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రజలంతా మహానేత ప్రవేశపెట్టిన 108 పథకానికి జేజేలు పలికారు. కానీ.. నేడు పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. డీజిల్‌ కష్టాలతో సేవలు నిలిచిపోవడంతో క్షతగాత్రులు ఇబ్బంది పడుతున్నారు. వైఎస్సార్‌ సేవలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top