చూసీచూడనట్లు..

Telangana Election Police Checkpost Adilabad - Sakshi

జైనథ్‌(ఆదిలాబాద్‌): ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ– మహారాష్ట్ర సరిహద్దు గుండా అక్రమంగా నగదు, లిక్కర్, దేశీదారు, ఇతరాత్ర నిషేధిత మత్తు పదార్థాల రవాణాను నిరోధించడానికి ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాల వద్ద తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వైపు వచ్చే కార్లను మాత్రమే తనిఖీ చేస్తుండడంతో ‘సగం తనిఖీలే’ జరుగుతున్నాయి. లారీలు, భారీ కంటైనర్లు, ఇతర వాహనాలను పట్టించుకోవడం లేదు. అంతర్‌ జిల్లా తనిఖీ కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తనిఖీల కోసం ప్రత్యేకంగా నియమించిన ఎస్‌ఎస్‌ టీం సిబ్బంది కొరత ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో తనిఖీల ఉద్దేశం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు.
 
జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా గట్టి నిఘా కోసం మూడు అంతర్రాష్ట్రీయ, ఆరు జిల్లా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా, బేల మండలం శంకర్‌గూడ, బోథ్‌ మండల ఘన్‌పూర్‌ వద్ద అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వీటితో పాటు దేవాపూర్, రోల్‌మామడ, గుడిహత్నూర్, ఇచ్చోడ సిరికొండ ఎక్స్‌రోడ్, గంగాపూర్, ఇంద్రవెళ్లి వద్ద జిల్లా తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కో కేంద్రం వద్ద మూడు బృందాలు, మూడు షిఫ్టుల్లో పని చేస్తున్నాయి.

సరిపోని సిబ్బంది..
తనిఖీ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు చేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఒక్కొక్క షిఫ్టులో ఒక కెమెరామెన్, ఒక కానిస్టేబుల్, ఒక అధికారి మాత్రమే ఉండడంతో           తనిఖీలు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కేవలం కార్లను మాత్రమే ఆపి తనిఖీలు చేస్తున్నారు. లారీలు, కంటైనర్లు, ఇతర వాహనాలను దర్జాగా వెళ్లనిస్తున్నారు. ఏదైనా అనుమానం వస్తేగాని ఇతర వాహనాల జోలికి వెళ్లకపోవడంతో అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడే ఆస్కారం కనిపించడం లేదు. లారీలు, ఇతర వాహనాలను తనిఖీ చేస్తే కనీసం 15 నిమిషాల నుంచి అరగంట వరకు సమయం పట్టడం, తనిఖీల వల్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడం, సరిపడా సిబ్బంది కూడా లేకపోవడం వంటి కారణాలతో పూర్తిస్థాయి తనిఖీలు జరగడం లేదు.

అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రాల వద్ద..
జిల్లాలోని మూడు అంతర్రాష్ట్రీయ తనిఖీ కేంద్రా ల వద్ద పట్టుబడిన నగదు వివరాలు ఇలా ఉన్నా యి. బోథ్‌ మండలంలోని ఘన్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద రెండుసార్లు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఒకసారి రూ.2.45లక్షలు, మరోసారి రూ.3.22లక్షలను పట్టుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఈ మొత్తం రూ.5.67లక్షలను సీజన్‌ చేశారు. అలాగే జైనథ్‌ మండలం పిప్పర్‌వాడ టోల్‌ప్లాజా వద్ద ఇప్పటి వరకు రూ.10.14కోట్లు పట్టుబడ్డాయి. బేల మండలంలోని శంకర్‌గూడ తనిఖీ కేంద్రం వద్ద రూ.5.45లక్షల నగదు  పట్టుబడింది. కాగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.11.36కోట్ల నగదు, 1565 లీటర్ల మద్యం పట్టుబడింది.

ఈ నాలుగు రోజులైనా..
ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు సా ధారణంగా మద్యం, నగదు అక్రమరవాణా పెద్ద మొత్తంలో జరుగుతుందని పలువురి అభిప్రా యం. చివరి రోజుల్లోనే గ్రామాల్లో పంపిణీ కార్యక్రమం ఉంటుందని, ఈ రోజుల్లో గట్టి బందోబస్తుతో పాటు తనిఖీలు చేపడితే అక్రమ రవాణాను చాలా వరకు అరికట్టవచ్చని భావిస్తున్నారు. కేవలం కార్లలోనే కాకుండా ఇతర వాహనాల్లోనూ డబ్బు తరలించే అవకాశముంది. ఈ నేపథ్యంలో అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టాలని, లారీలు, కంటైనర్లను సైతం క్ష్ణు్ణంగాతనిఖీ చేయాలని పలువురు కోరుతున్నారు. 

అన్ని వాహనాలు తనిఖీ చేస్తాం..
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9 తనిఖీ కేంద్రాల్లో అన్నిరకాల వాహనాలను తనిఖీ చేసేలా ఆదేశిస్తాము. ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేపడతాం. ఎన్నికల్లో ఎలాంటి అక్రమ ర వా ణాకు ఆస్కారం లేకుండా ఉం డేందుకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నాం. ఈ కేంద్రాలతో పాటు రాత్రి వేళలో అదనపు తనిఖీ బృందాలను కూడా తిప్పు తున్నాము. – నర్సింహారెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top