ఈ గట్టునుండాలా.. ఆగట్టుకెళ్లాలా...!

Telangana Election All Parties Leaders Change Of Parties Khammam - Sakshi

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎన్నికలంటే నోట్ల పండగగా మారిన పరిస్థితి.. ఓటు అంగట్లో సరుకుగా మారిన దుస్థితి. ఒకప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటును వినియోగించుకునే ఓటరును స్వార్థ ప్రయోజనాలతో కొంతమంది రాజకీయ నాయకులు ప్రలోభాలకు గురిచేయడంతో ఓటుకు నోట్ల బేరం పెరుగుతోంది. ప్రస్తుతం రాజకీయాలలో నైతిక విలువలు దిగజారుతున్న తరుణంలో ప్రధాన నేతలు అవకాశాన్ని బట్టి టికెట్లను సంపాదించుకుంటున్నా ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రం డోలాయమానంలో పడే పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్టానవర్గాల నిర్ణయాల మేరకు ప్రధాన నేతలు కలుస్తున్నా ద్వితీయశ్రేణి నాయకత్వంలో మాత్రం విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఒకవైపు ద్వితీయశ్రేణి నాయకత్వం పరిస్థితి ఇలా ఉంటే.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి స్వార్థ రాజకీయాలకు తెరతీసే కొంతమంది చోటామోటా నాయకులు ఏ గట్టునుంటే మంచిది... ఎంత గిట్టుబాటవుతుంది, ఉన్న నాయకుడిని నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందా.. లేదా ప్రత్యర్థి నాయకుని పంచన చేరితే ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయా అని లెక్కలు వేసుకునే పరిస్థితి ఉంది. అంతర్గతంగా మదనపడుతూనే ఎన్నికల సమయం తప్పితే ప్రధాన నాయకులు తమ మాట వినే పరిస్థితి ఉండదనే ఆలోచనతో బేరసారాలకు కూడా తెరతీస్తున్నారు.

పరోక్షంగా ప్రత్యర్థి ప్రధాన నాయకుడికి ఆ వర్గంలో ఉన్న ద్వితీయశ్రేణి నాయకత్వంతో సంకేతాలు కూడా పంపుతున్నారు. ఎన్నికలకు కేవలం 10 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఈ ఎన్నికల్లో తాము ఏమేరకు ఆర్థిక వనరులను సమకూర్చుకుంటామోననే ఆలోచనతో ప్రతి ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా  తర్జనబర్జన పడుతున్నారు.  స్థాయిని బట్టి రేటును ఫిక్స్‌ చేసుకునే పరిస్థితి ఉంది.
 
ఈసారి కొత్తగూడెం నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న విషయం విదితమే. తాము తప్పనిసరిగా పోటీ చేస్తామని నాయకులు కూడా అనివార్యంగా దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలో ఒక్కటికాక తప్పదని రాజీపడి ఎన్నికల ప్రచారంలో  పాల్గొంటున్నారు. మరోవైపు అధికారపక్షం కూడా తమదైన శైలిలో ప్రచారపర్వాన్ని ప్రారంభించింది. ఇంకోవైపు ప్రతిసారి టికెట్‌ కోసం ఆశించి భంగపడిన నేత సైతం మరోసారి ప్రజాబలాన్ని నమ్ముకునే ఎన్నికల బరిలో దిగారు.

 బరితో ఉన్న ముగ్గురు బలమైన అభ్యర్థులే అయినప్పటికీ కిందిస్థాయి కేడర్‌ కదలికలు మాత్రం ఎవరికీ అర్థంకాని పరిస్థితి ఉంది. వీళ్లు కాకుండా మరికొంతమంది ద్వితీయశ్రేణి నాయకత్వం ఇంకా తమ మద్దతు ఎవరికీ ప్రకటించకుండా తటస్థంగా ఉన్నారు. నలుగురు గుమిగూడే ప్రతి ప్రాంతంలోనూ డబ్బుల చర్చ, అభ్యర్థులు ఎవరు గెలుస్తారనే చర్చ తప్ప మరొకటి కన్పించడంలేదు. ఇదంతా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం ఎన్నికలంటే ఇలా కూడా ఉంటాయా అంటూ ముక్కున వేలు వేసుకునే పరిస్థితి ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top