బాలురే టాప్‌

Telangana EAMCET 2018 Results Declared - Sakshi

ఎంసెట్‌ ఇంజనీరింగ్‌లో టాప్‌–10లో అంతావారే.. 

అగ్రికల్చర్‌ టాప్‌–10లోనూ ఐదుగురు బాలురు 

రెండు విభాగాల్లో కలిపి టాప్‌–10లో ఐదుగురు ఏపీ విద్యార్థులు 

ఎంసెట్‌ ఫలితాలు, ర్యాంకులను విడుదల చేసిన కడియం 

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌–18లో బాలురు సత్తా చాటారు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌–10 ర్యాంకులన్నీ బాలురకే లభించగా.. అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగంలో టాప్‌–10లో ఐదు ర్యాంకులు సాధించారు. ఈ రెండు కేటగిరీల్లో కలిపి ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు టాప్‌–10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులను సాధించారు. ఈనెల 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన ఎంసెట్‌–18 ఫలితాలు, ర్యాంకులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శనివారం సచివాలయంలో విడుదల చేశారు. ఎంసెట్‌ మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీతో కలిపి కంబైన్డ్‌ స్కోర్‌ను ఖరారు చేసి.. ర్యాంకులను కేటాయించారు. 

టాపర్లు వీరే.. 
ఇంజనీరింగ్‌లో రంగారెడ్డి జిల్లా కావూరిహిల్స్‌కు చెందిన అయ్యపు వెంకటఫణి వంశీనాథ్‌ 95.7245 కంబైన్డ్‌ స్కోర్‌తో మొదటి ర్యాంకు సాధించాడు. కావూరిహిల్స్‌కే చెందిన గట్టు మైత్రేయ 95.6955 కంబైన్డ్‌ స్కోర్‌తో రెండో ర్యాంకు పొందాడు. ఇక అగ్రికల్చర్‌/ఫార్మసీ కేటగిరీలో 93.3832 కంబైన్డ్‌ స్కోర్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన పెరిగెల నమ్రత మొదటి ర్యాంకు.. 92.2744 కంబైన్డ్‌ స్కోర్‌తో హైదరాబాద్‌లోని లాలాగూడకు చెందిన వై.సంజీవకుమార్‌రెడ్డి రెండో ర్యాంకు సాధించారు. 

అగ్రికల్చర్‌లో ఎక్కువ శాతం అర్హులు 
తెలంగాణ ఎంసెట్‌కు మొత్తంగా 2,21,064 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్‌ విభాగంలో 1,36,305 మంది పరీక్షకు హాజరుకాగా.. 1,06,646 మంది (78.24 శాతం) అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగంలో 66,858 మంది పరీక్ష రాయగా.. 60,651 మంది (90.72 శాతం) అర్హత సాధించారు. 

ఇంటర్‌లో ఫెయిలైన 18 వేల మందికి ర్యాంకుల్లేవు 
ఎంసెట్‌లో అర్హత సాధించినా ఇంటర్‌లో ఫెయిలైన 18 వేల మందికిపైగా విద్యార్థులకు ఎంసెట్‌ కమిటీ ర్యాంకులను కేటాయించలేదు. ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షకు 1,36,305 మంది హాజరుకాగా.. 1,06,646 మంది అర్హత సాధించారు. వీరిలో 14,453 మంది విద్యార్థులు ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో.. ర్యాంకులను కేటాయించలేదు. ఇక అగ్రికల్చర్‌/ఫార్మసీ విభాగంలో 66,858 మంది పరీక్ష రాయగా.. 60,651 మంది అర్హత సాధించారు. వీరిలో 4,480 మంది ఇంటర్‌లో ఫెయిల్‌ కావడంతో ర్యాంకులు కేటాయించలేదు. ఇక సీబీఎస్‌ఈ ఫలితాలు రాకపోవడంతో మరో 7,549 మంది విద్యార్థుల ర్యాంకులను ప్రకటించలేదు. ఇందులో ఇంజనీరింగ్‌ విభాగంవారు 4,171 మంది, అగ్రికల్చర్‌/ఫార్మసీవారు 3,378 మంది ఉన్నారు. 

ఒక్కరికీ రాని ఫుల్‌ మార్కులు 
160 మార్కులకు నిర్వహించిన ఎంసెట్‌ పరీక్షల్లో ఒక్క విద్యార్థికి కూడా పూర్తి మార్కుల లభించలేదు. ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌ మార్కులు 152.8616 మాత్రమేకాగా.. రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి 150.8789 మార్కులు వచ్చాయి. ఇక అగ్రికల్చర్, ఫార్మసీలో 145.8842 మార్కులే టాప్‌. అవీ ఒక విద్యార్థికే వచ్చాయి. ఈసారి ఆన్‌లైన్‌లో పలు దఫాలుగా పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విధానంలో ప్రశ్నపత్రాల స్థాయి వేర్వేరుగా ఉంటుంది కాబట్టి నార్మలైజేషన్‌ ప్రక్రియ చేపట్టారు. దీంతో విద్యార్థులకు కచ్చితమైన (రౌండప్‌) మార్కులు రాలేదని అధికారులు వెల్లడించారు. ఇక సబ్జెక్టుల వారీగా చూసినా కూడా ఎవరికీ పూర్తి మార్కులురాకపోవడం గమనార్హం. గణితం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా ఏ సబ్జెక్టులోనూ గరిష్ట మార్కులు రాలేదు.  

ఇంటర్‌ సబ్జెక్టుల్లో ‘ఫుల్‌’మార్కులు.. 
ఇంటర్మీడియట్‌ రెండేళ్లు కలిపి.. ఎంపీసీలోని మూడు ప్రధాన సబ్జెక్టుల్లో 581 మంది పూర్తిగా 600 మార్కులకు 600 మార్కులు సాధించారు. బైపీసీలోనూ 124 మంది విద్యార్థులు 600 మార్కులు పొందారు.

జూలై 16 నుంచి తరగతులు: కడియం 
రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ తరగతులను జూలై 16వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 25వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు షెడ్యూలు ఖరారు చేసినట్లు వెల్లడించారు. జూన్‌ 8వ తేదీ నాటికి మొదటిదశ అడ్మిషన్లు పూర్తి అవుతాయని, జూలై మొదటి వారంలో రెండోదశ కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తామని వెల్లడించారు. సచివాలయంలో శనివారం ఎంసెట్‌ ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడారు. సాధారణంగా ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని, ఈసారి షెడ్యూలును 15 రోజులు ముందుకు జరిపి, జూలై 16వ తేదీ నుంచే తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ప్రభుత్వం నాలుగేళ్లుగా విద్యారంగంలో చేపడుతున్న చర్యల వల్ల ఇంజనీరింగ్‌ విద్యలో నాణ్యత పెరిగిందన్నారు. బయోమెట్రిక్, సీసీ కెమెరాలు, ల్యాబ్‌ పరికరాలు, 75 శాతం తప్పనిసరి హాజరు ఉండాలన్న నిబంధనలతో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రమాణాలు పెరిగాయని చెప్పారు. ఈసారి ఇంటర్నల్‌ స్లైడింగ్‌కు అధికారికంగా అనుమతినిస్తున్నామని, వీరికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందన్నారు. విద్యార్థులు ఎంసెట్‌ ర్యాంకు కార్డులను ఈ నెల 22 నుంచి సంబంధిత వెబ్‌సైట్‌ నుంచి (http://eamcet. tsche.ac.in) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్, జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్‌ రెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ యాదయ్య పాల్గొన్నారు. 


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top