చైనా వెళ్లొచ్చా.. అయితే ఇప్పుడు కాదులే 

Telangana Assembly Council Meeting Debate Over Covid - Sakshi

మండలి సమావేశాల్లో కోవిడ్‌ చర్చపై నవ్వులు పూయించిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు  

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలో శనివారం కరోనా వైరస్‌పై ఆసక్తికర చర్చజరిగింది. స్వల్పకాలిక చర్చలో భాగంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం కరోనా వైరస్‌పై మాట్లాడుతూ సభలో నవ్వులు పూయించారు. ఆయన స్థానంలో నిలబడి ‘నేను చైనా వెళ్లొచ్చాను’అనగానే పక్కనే ఉన్న సహచర ఎమ్మెల్సీలు ‘ఎప్పుడూ?’అంటూ ఉలిక్కిపడ్డారు. అయితే వెంటనే ఆయన ‘‘ఇప్పుడే కాదులే మూడు, నాలుగేళ్ల క్రితం వెళ్లొచ్చాను. నిన్న, మొన్న మీతోటే ఉన్న కదా’అని సమాధానం ఇవ్వడంతో సభ్యులంతా గొల్లున నవ్వారు. ‘చైనాకు పోయుంటే సక్కగా హాస్పిటల్‌కే పోయేటోడిని’అని మల్లేశం బదులిచ్చారు. తాతల కాలంలో గత్తరొచ్చి పెద్దసంఖ్యలో చనిపోయినట్టు విన్నామే తప్పించి, ఈ విధమైన జబ్బు గురించి ఎన్నడూ వినలేదు. చూడలేదన్నారు. బడ్జెట్‌ సమావేశాలను కూడా వాయిదా వేస్తారనే అనుమానమొచ్చిందన్నారు.

అనంతరం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌ మాట్లాడుతూ..ముస్లిం మహిళలు బురఖా ధరించడం వల్ల వారికి కోవిడ్‌ సోకే అవకాశం లేదని, ఇప్పుడు హిందూ మహిళలు, విద్యార్థినులు కూడా ముఖం కనిపించకుండా చున్నీతో కవర్‌ చేసుకుంటున్నందున వారికి కూడా అది రాదన్నారు. వారికి గూండాలు, పోకిరీల బెడద కూడా ఈ రకంగా తీరిందన్నారు. తాను పాతబస్తీలో ఒక బట్టలషాపులో వస్త్రాలను పరిశీలిస్తుండగా, ఆ దుకాణం యజమాని తనవద్దకొచ్చి దగ్గుతూ ‘కరోనా అంటే ఏమిటి’? అని తనను ప్రశ్నించగానే ఏదో ఫోన్‌ వచ్చినట్టుగా ‘హలో.. హలో’అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయానని ఫారుఖ్‌హుస్సేన్‌ వ్యాఖ్యానించగానే కౌన్సిల్‌లో నవ్వులు విరిశాయి. సభలో రామచంద్రరావు, చిన్నపరెడ్డి, జీవన్‌రెడ్డి ఇతర సభ్యులు జోరుగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటే ఒక్కముక్క కూడా అర్థం కావడం లేదని, రాబోయే రోజుల్లో అందరూ తెలుగు,ఉర్దూలకు దూరమయ్యేట్టు కనిపిస్తోందన్నారు. ఇంతలో కొందరు సభ్యులు ఫారుఖ్‌హుస్సేన్‌ను ఉద్దేశించి ‘కరోనాను తెలుగులో ఏమంటారు?’అంటూ ప్రశ్నించడంతో తడుముకోవడం ఆయన వంతైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top