రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తొలగిపోయాయని, ఇప్పుడు రాష్ర్టం వెలుగుజిలుగులతో నిండిపోయిందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు.
- కొత్త రాష్ట్రం భవిత అద్భుతంగా ఉంటుందన్న కేసీఆర్
- దేవాదాయ శాఖ ఉగాది వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి
- గత ఉగాదికి తీవ్ర విద్యుత్ సమస్య.. ఇప్పుడు వెలుగుజిలుగులు
- మిగులు కరెంటు దిశగా సాగుతున్న రాష్ట్రం
- కొత్త పారిశ్రామిక విధానంతో భారీగా పెట్టుబడుల రాక
- హైదరాబాద్ ముంగిట క్యూ కట్టనున్న ప్రపంచం
- పేదల సంక్షేమం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
- దైవబలం తోడుగా ముందుకుసాగుతామన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: గత ఉగాది నాటికి తీవ్ర స్థాయిలో ఉన్న విద్యుత్ సమస్యలు తొమ్మిది నెలలుగా రాష్ర్ట ప్రభుత్వం తీసుకున్న చర్యలతో తొలగిపోయాయని, ఇప్పుడు రాష్ర్టం వెలుగుజిలుగులతో నిండిపోయిందని సీఎం కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. భగవంతుడు ప్రసాదించిన సకల శక్తులను సమీకరించుకుని మిగులు కరెంటు సాధించుకునే దిశగా రాష్ర్టం సాగుతోందన్నారు. సంక్షేమం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను ప్రాధాన్యాంశాలుగా ప్రభుత్వం గుర్తించిందని, రాష్ర్టం ఇక పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శనివారం రవీంద్రభారతిలో దేవాదాయ శాఖ నిర్వహించిన మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పంచాంగకర్త యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. 60 సంవత్సరాల తెలుగు పంచాంగ కాలచక్రంలో మన్మథనామ సంవత్సరం 29వదని, దేశంలో తెలంగాణ కూడా 29వ రాష్ట్రంగా ఏర్పడిందని, కొత్త రాష్ట్రం భవిత అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దశాబ్దంన్నర కాలం ఉద్యమాలతో ముందుకు సాగి, అవమానాలను అధిగమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుని తెలుగు సంవత్సరాదిని తెలంగాణలో గర్వంగా నిర్వహించుకుంటున్నామని, భవిష్యత్తులో రాష్ట్రం సంతోషంగా ముందుకు సాగుతుందని వ్యాఖ్యానించారు.
పేదల సంక్షేమమే సర్కారు లక్ష్యం
పేదలు కడుపునిండా తిన్నప్పుడే నిజమైన పండుగ అని, తాము క్షేమంగా ఉంటామన్న భావన ప్రజల్లో వచ్చినప్పుడు అది నిజమైన రాష్ట్రమని, అందుకే పేదల సంక్షేమం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం వివరించారు. ఆర్థికవేత్తలకు గిట్టకపోయినా పేదల సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే నిర్ణయాలను రాష్ర్టంలో అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. హాస్టళ్లలో సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన గతంలో ఎవరూ చేయలేదని, ఇప్పుడు అమలు చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చూడబోతున్నారని పేర్కొన్నారు.
రాష్ర్టంలో 65 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ ప్రాంతాన్ని విత్తనాభివృద్ధి భాండాగారంగా అభివృద్ధి చేయబోతున్నామన్నారు. గొంతెండిపోయి కరువు, ఫ్లోరైడ్‌తో అల్లాడుతున్న మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు మేలు చేసేందుకు మరో వారం రోజుల్లో పాలమూరు, నక్కలగండి ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కృష్ణ, గోదావరి జలాల్లో చట్టబద్ధంగా రావాల్సిన వాటా తెలంగాణకు దక్కలేదని, అందుకోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఆర్థిక మంత్రికి భయం అక్కర్లేదు..
‘నాది కర్కాటక రాశి. ఆదాయం 5, వ్యయం 5గా ఉంటుందని సిద్ధాంతి చెప్పారు. నాకేం ఢోకాలేదు. అక్కడికక్కడికి సున్నకు సున్నాగా ఉంటుంది. మా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌కు భయం అక్కర్లేదు, ఏం బాకీపడకుండా చూస్త’ అని ఆదాయ వ్యయాల ఫలితాలపై ముఖ్యమంత్రి చమత్కరించారు. అలాగే పంచాంగ శ్రవణంలో వానల విషయంలో సిద్ధాంతి అయోమయంలో ఉంచారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘వానలు పడ్తయో, పడయో ఆయన ఎటూ తేల్చలేదు. కానీ అంతిమంగా తేల్చిందేమంటే ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వచ్ఛమైన మనసుతో ముందుకు సాగితే దైవబలం తోడవుతుందన్నారు’ అని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో గోదావరి పుష్కరాలు నిర్వహించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
విమర్శలు లేకుండా..
సాధారణంగా రవీంద్రభారతి వేదిక మీదుగా ప్రసంగించే సమయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం భిన్నంగా ఉంటుంది. చతురోక్తులు, ఆంధ్ర ప్రాంత నేతలపై వ్యంగ్యాస్త్రాలతో సాగడం ఇటీవల పలు సందర్భాల్లో కనిపించింది. కానీ ఉగాది వేడుకలో ఉపన్యాసం మాత్రం అందుకు భిన్నంగా సాగింది. ఎక్కడా పొరుగు రాష్ట్ర నేతలు, ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయలేదు. చమక్కులు, చలోక్తులు కూడా లేకుండా సీఎం మాట్లాడారు.
పెట్టుబడులకు ప్రపంచం క్యూ కడుతుంది..
ఈ ఏడాది పారిశ్రామిక రంగం అద్భుతంగా ఎదుగుతుందని పంచాంగ శ్రవణం లో సిద్ధాంతి చెప్పారని, అది నిజమవుతుంద ని సీఎం అన్నారు. ‘ప్రపంచంలో ఎక్కడా లేని పారిశ్రామిక విధానం రూపొందించాం. ఇది తమాషాకు చెబుతున్న మాటకాదు, ఇలాంటిది ప్రపంచంలోనే లేదు. త్వరలోనే దాన్ని ప్రకటించబోతున్నం. ఇటీవల నేను సింగపూర్ వెళ్లిన సందర్భంలో దీని ప్రస్తావన వచ్చినప్పుడు.. రాష్ర్టం రూపొందించిన కొత్త విధానంలో 50 శాతం అమలు చేసినా ప్రపంచమంతా హైదరాబాద్‌కు క్యూ కడుతుందని అక్కడి వారన్నారు. వనరులను సరిగా సద్వినియోగం చేసుకోగలిగితే తెలంగాణ అద్భుతంగా వర్ధిల్లుతుంది, పెట్టుబడుల వరదతో రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టమవడమే కాకుండా యువతకు అద్భుత ఉపాధి అవకాశాలు లభిస్తాయి’ అని కేసీఆర్ అన్నారు.