బీఎస్‌ఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు

Published Sun, Jun 15 2014 3:27 AM

బీఎస్‌ఎఫ్ జవాన్‌కు కన్నీటి వీడ్కోలు - Sakshi

మధిర: బీఎస్‌ఎఫ్ జవాన్ చింతల అంజయ్య(38) మృతదేహం స్వగ్రామమైన మధిర మండలంలోని నక్కలగరుబుకు శనివారం చేరుకుంది. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున ఢిల్లీలో విధి నిర్వహణలో ఉండగా గుండెపోటుతో ఆయన మృతిచెందారు. అంజయ్య 18 సంవత్సరాలుగా ఆర్మీలో పనిచేస్తున్నారు.

ఆయన ఇటీవలే జమ్మూకాశ్మీర్ నుంచి ఉద్యోగోన్నతిపై ఢిల్లీకి వచ్చారు. మృతదేహాన్ని ఢిల్లీ నుంచి బెంగుళూరుకు విమానంలో, అక్కడి నుంచి ఆర్మీ బస్సులో (ఆర్మీ) సిబ్బంది శనివారం నక్కలగరుబు తీసుకొచ్చారు. అంజయ్యకు భార్య, కుమారుడు ప్రణీత్, కుమార్తె సౌజన్య ఉన్నారు. మృతదేహాన్ని మధిర టౌన్ ఎస్‌ఐ గూడ అశోక్‌రెడ్డి, పోలీసు సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియల సమయంలో సైనిక సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు.
 
నక్కలగరుబులో విషాదం

అంజయ్య మృతితో ఆయన స్వగ్రామం నక్కలగరుబులో విషాదం నెలకొంది. స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి మృతదేహాన్ని సందర్శించారు. తమ గ్రామంలోని వారితోపాటు చుట్టుపక్కల గ్రామాల్లోని అందరికీ అంజయ్య సుపరిచితుడని స్థానికులు చెప్పారు.
 
నాయకుల సంతాపం
అంజయ్య మృతదేహాన్ని వైఎస్‌ఆర్ సీపీ మధిర మండల అధ్యక్షుడు యన్నం కోటేశ్వరరావు, ఆత్కూరు ఎంపీటీసీ సభ్యురాలు యన్నం రజిని, సీపీఎం నాయకుడు లింగాల కమల్‌రాజ్, రైతు సంఘం నాయకుడు చిత్తారు నాగేశ్వరరావు తదితరులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన కుటుంబీకులకు సానుభూతి తెలిపారు.

Advertisement
Advertisement