తగ్గేది లేదు..

Teachers Unions And Women Teachers Supports Ti 16th Day TSRTC Strikes In Khammam  - Sakshi

సాక్షి, కొత్తగూడెంఅర్బన్‌: ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 16వ రోజైన ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉద్రిక్తతల నడుమ కొనసాగింది. సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మహిళా టీచర్లు నిరాహార దీక్షలు చేశారు. అనంతరం డిపోలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ డీఎం, జిల్లా రవాణా శాఖాధికారులకు కార్మికులు, అఖిలపక్ష నాయకులు పూలు ఇచ్చే నిరసన తెలిపారు. అంతకుముందు ప్రదర్శనగా డిపో వద్దకు చేరుకోగా జేఏసీ, అఖిలపక్ష నాయకులు లోపలికి రాకుండా పోలీసులు గేట్లు మూసేశారు. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు యెర్రా కామేష్, వామపక్ష నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

జిల్లా రవాణ శాఖ అధికారులు, ఆర్టీసీ డీఎం బయటకు వచ్చి సమ్మెలో పాల్గొనాలని  ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం గాంధీజీ శాంతియుత ఉద్యమం చేసినట్టుగానే తాము కూడా పూలు ఇచ్చి నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఎంత కష్టమైనా వెనక్కు తగ్గేది లేదని, పోరాడి హక్కులు సాధించుకుంటామని అన్నారు. ఆ తర్వాత డీఎం, రవాణా శాఖాధికారికి పూలు ఇచ్చి నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ 15 నిమిషాల పాటు అధికారులకు దండం పెడుతూ మోకాళ్లపై నిల్చున్నారు. అనంతరం డిపో గేటు ముందుకు జిల్లా రవాణా శాఖాధికారి రవీందర్, డిపో మేనేజర్‌ శ్రీహర్ష బయటకు రాగా, వారికి నాయకులు దండలు వేసి, పూలు ఇచ్చి నిరసన తెలిపారు.    
వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 

దిష్టిబొమ్మ దహనం... 
ఆర్టీసీ సమ్మెలో భాగంగా స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద వామపక్ష పా ర్టీల ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. దీంతో వన్‌టౌన్‌ పోలీసులు అక్కడి కి చేరుకొని కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం వామపక్ష పార్టీ నాయకులను అక్కడి నుంచి పంపించే క్రమంలో పోలీసులు తొసేశారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఉపాధ్యాయ సంఘాల దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. గత 16 రోజులుగా సమ్మె చేస్తుంటే న్యాయస్థానాలు స్పందిచినా.. సీఎం కేసీఆర్‌ మాట్లాడడం లేదని విమర్శించారు. ఆర్టీసీ సమ్మె మరింత ఉధృతంగా మారబోతుందని, అన్ని వర్గాల వారు మద్దతు పలకడం అభినందనీయమని అన్నారు.  
 
భద్రాచలం, మణుగూరులో నిరసన కార్యక్రమాలు.. 
ఆర్టీసీ సమ్మెలో భాగంగా జిల్లాలోని భద్రాచలం, మణుగూరు డిపోలలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో పాటుగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. విధులు నిర్వహిస్తున్న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు పూలు ఇచ్చి శాంతియుతంగా నిరసన తెలిపారు. శాంతియుత మార్గంలో సమ్మె కొనసాగించి న్యాయమైన డిమాండ్లను సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top