‘ఇంగ్లిష్‌’ బోధించలేం!

Teachers Not Interested To Teach In English In Kasturba Schools - Sakshi

కేజీబీవీల్లో చెప్పలేమని చేతులెత్తేసిన ఉపాధ్యాయులు

నల్లగొండ : కస్తూర్బా విద్యాలయాల్లో తాము ఇంగ్లిష్‌ మీడియం చెప్పలేమని టీచర్లు చేతులెత్తేశారు. దీంతో ఈ ఏడాది కస్తూర్బా పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేనట్లే. ప్రభుత్వం కార్మికుల, ఇతర అనాథ పిల్లలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మధ్యలో బడి మానేసిన పిల్లల కోసం ప్రభుత్వం కస్తూర్బా బాలికల విద్యాలయాలను ప్రారంభించింది. అవన్నీ తెలుగు మీడియంలోనే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే కేజీ టు పీజీ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలను తీసుకొస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే కస్తూర్బా పాఠశాలల్లో తెలుగు మీడియం నడుస్తున్నప్పటికీ కార్పొరేట్‌ తరహాలో విద్యాబోధన జరగడంతో పాటు నాణ్యమైన భోజన వసతి కల్పిస్తున్నారు. మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నారు. పేద విద్యార్థులకు ఇవి ఎంతగానో 

దోహదపడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కస్తూర్బాలను ఇంగ్లిష్‌ మీడియంలోకి మార్చాలన్న ఉద్దేశంతో రెండేళ్లుగా ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు ఆయా జిల్లాల కస్తూర్బాల నుంచి ప్రతి పాదనలు కోరుతోంది. అదే తరహాలో ఈ సంవత్సరం కూడా ఎవరైతే కస్తూర్బా పాఠశాలలు ఇంగ్లిష్‌ మీడియంలో బో«ధిస్తామని ముందుకు వస్తారో ఆయా పాఠశాలలు ప్రతిపాదనలు పంపాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖకు లేఖలు రాశారు. దీంతో కొన్ని జిల్లాలు ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తామని ప్రతిపాదనలు పంపాయి. కానీ నల్లగొండ జిల్లా నుంచి బోధించేందుకు టీచర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో జిల్లా విద్యాశాఖ ప్రతిపాదనలు పంపలేదు. దీంతో ఈ సంవత్సరం ఇంగ్లిష్‌ మీడియంలో బోధించేందుకు జిల్లా నుంచి ఒక్క పాఠశాల కూడా ముందుకు రాకపోవడంతో విద్యార్థినులకు నష్టం జరిగే అవకాశం ఉంది.

జిల్లాలో 27 కేజీబీవీలు
జిల్లాలో మొత్తం 27 కస్తూర్భాగాందీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. అందులో 5పాఠశాలలు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన సాగిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో మాత్రమే ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు కొనసాగుతున్నాయి. పాత పాఠశాలలన్నీ తెలుగు మాద్యమంలోనే నిర్వహిస్తున్నారు.

ముందుకు రాని ఉపాధ్యాయులు
జిల్లాలో 22 కస్తూర్బా తెలుగు మీడియం పాఠశాలల్లోని అధ్యాపక బృందాలు ఇంగ్లిష్‌ మీడియంలో బోధన చేసేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. విద్యాశాఖ ఉన్నతాధికారులు మాత్రం తెలుగు మీడియం పాఠశాలలను  ఇంగ్లిష్‌ మీడియంగా మార్చేందుకు సుముఖంగా ఉన్నారు. అందుకు అవసరమైన అన్ని వసతులు సమకూర్చుతామని చెప్పినా బోధకులే ముందుకు రాకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేసే పరిస్థితి లేదు. దీంతో జిల్లా విద్యాశాఖ కూడా వారిని ఏమీ అనలేకపోవడంతో రాష్ట్ర విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపలేదు.

ఉపాధ్యాయులు విల్లింగ్‌లో లేకపోవడంతో ప్రతిపాదనలు పంపలేదు
జిల్లాలో 27 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. 5 ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ప్రారంభించింది.  ఈ సంవత్సరం కూడా ప్రతిపాదనలు పంపాలని కోరింది. కానీ అధ్యాపకులు ఎవరూ ఇంగ్లిష్‌లో బోధన చేసేందుకు విల్లింగ్‌లో లేకపోవడం వల్ల ప్రతిపాదనలు పంపలేదు.  కస్తూర్బాలో నూటికి నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌ ఉంది. పిల్లలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలల్లో ఇంగ్లిష్‌ బోధన చేస్తే ఎన్‌రోల్‌మెంట్‌ పెరుగుతుందని ప్రభుత్వ ఉద్దేశం. 5వేల మంది విద్యార్థినులు ఉండాల్సి ఉండగా 83 మంది అధికంగానే ఉన్నారు. కొత్త మండలాల్లో ఇంగ్లిష్‌ బోధన జరుగుతుంది. 
– అరుణ శ్రీ, సెక్టోరియల్‌ అధికారి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top