ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. టీచర్లే విధులను విస్మరిస్తున్నారు.
నిజామాబాద్‌అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. టీచర్లే విధులను విస్మరిస్తున్నారు. వారి ఇష్టారాజ్యం కారణంగా పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందకుండా పోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 2 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా రెండున్నర లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన టీచర్లే గైర్హాజరవుతున్నారు. విధులకు ఎగనామం పెడుతున్న ఉపాధ్యాయు లు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఎల్‌ఐసీ పాలసీలు, ఫైనాన్స్ తదితర సొంత వ్యాపకాలపైనే దృష్టి పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలతో తలమునకలవుతున్న వారు పాఠశాలల వైపు
కన్నెత్తి చూడడం లేదు. స్థానిక విద్యాధికారులను మచ్చిక చేసుకొని తమ పనులు కానిచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల బోధన్ డిప్యూటీ డీఈఓ జుక్కల్ మండలంలోని బాబుల్‌గావ్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయగా ఒక టీచర్ నెలల తరబడి గైర్హాజరు కావటం బయటపడింది. జుక్కల్, మద్నూరు ప్రాంతాల్లో చాలా మంది టీచర్లు ఈ దారిలోనే నడుస్తున్నారు. ఇదిలా ఉండగా పాఠశాలకు డుమ్మా కొట్టి ఇటీవల పలువుర్లు టీచర్లు పేకాటలో పట్టుబడం చర్చనీయాంశంగా మారింది.
గైర్హాజరైతే చర్యలు తప్పవు : డీఈఓ శ్రీనివాసచారి
పాఠశాలలకు ఉపాధ్యాయులు ఎలాంటి అనుమతి లేకుండా గైర్హాజరయితే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటాం, విద్యాబోధన సమయంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటే చర్యలు తప్పవు.