‘నా భార్యను అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారు’

Tahsildar Vijaya Reddy Husband On Her death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డి తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆమె భర్త సుభాష్‌రెడ్డి  కన్నీరు మున్నీరవుతున్నారు. తన భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన రోదిస్తున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. హత్య చేసిన వాళ్ల వెనకాల భూ కబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు.  ప్రభుత్వం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. 

తన ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఆఫీస్‌లో ఒత్తిడిని ఇంట్లో కనిపించనిచ్చేది కాదని గుర్తుచేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ నుంచి బదిలీ కోసం చాలా ప్రయత్నించిందని.. అలా జరిగి ఉంటే ఆమె బతికి ఉండేదని అన్నారు. కాగా,  విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్‌ అనే రైతు ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉన్నారు. విజయరెడ్డి మృతితో రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆందోళనలకు పిలుపునిచ్చారు. విజయారెడ్డి హత్యపై పోలీసులు దార్యప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

విజయారెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు
తహసీల్దార్‌ విజయారెడ్డి  ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణంతో భర్త సుభాష్‌రెడ్డి, అత్త, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి ఎక్కడ అని అడుగుతున్న చిన్నారులకు.. అర్దరాత్రి దాటిన తరువాత  కుటుంబ సభ్యులు విజయారెడ్డి మరణవార్తను చెప్పారు. పిల్లలు ఎక్కడ భయభ్రాంతులకు గురవుతారనో భయంతో.. కుటుంబ సభ్యులు వారిని తల్లి మృతదేహానికి దూరంగా ఉంచారు. 

ఆర్టీసీ జేఏసీ నివాళి..
విజయారెడ్డి మృతదేహానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌గా విజయారెడ్డికి మంచి పేరు ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై ఇలాంటి దాడులు జరగడం బాధకరమని తెలిపారు.

నేడు అంత్యక్రియలు..
ఎమ్మార్వో విజయారెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు నాగోల్‌ శ్మశాన వాటికలో  కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. 

చదవండి : 

మహిళా తహసీల్దార్‌ సజీవ దహనం 
డాడీ.. మమ్మీకి ఏమైంది? 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top