వై'రష్‌ 'ఎన్నికల వేళ స్వైన్‌ఫ్లూ కలకలం

Swine Flu Virus in Hyderabad - Sakshi

సభలు, సమావేశాలకు హాజరయ్యే వారికి సోకే చాన్స్‌

ప్రచారంలో పాల్గొనే నేతలకు పొంచి ఉన్న ముప్పు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు  

సాక్షి, హైదరాబాద్‌: ఓవైపు వేసవి, ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తుంటే మరోవైపు రాజధానిలో స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) వైరస్‌పై కలకలం రేగుతోంది. సాధారణంగా చలి వాతావరణంలో బలపడే ఈ వైరస్‌ భగ్గుమంటున్న ఎండల్లోనూ విజృంభిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వైరస్‌ రూపాంతరం చెందడమే కాకుండా మరింత బలపడుతోంది. అసలే ఎన్నికల సీజన్‌.. నగరంలో అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు రోజంతా ప్రచారంలో బిజీగా తిరుతుంటారు. సభలు, సమావేశాలు, ర్యాలీల పేరుతో ఎక్కువ సమయం జన సమూహంలోనే గడుపుతుంటారు. ఫ్లూ సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వైరస్‌ వాతావరణంలోకి ప్రవేశించి ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది.

ఈ విషయంలో సాధారణ ప్రజలే కాకుండా రాజకీయ పార్టీల అభ్యర్థులు సైతం ఆరోగ్యంపట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జనబాహుళ్యంలోకి వెళ్లే సమయంలో ముక్కుకు మాస్క్‌ ధరించడం, బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్‌ బారినపడకుండా జాగ్రత్తపడవచ్చని చెబుతున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది కేవలం రెండు మాసాల్లోనే 573 కేసులు నమోదు కాగా, వారిలో 29 మంది మృతి చెందారు. ఒక్క నగరంలోని గాంధీ జనరల్‌ ఆస్పత్రిలోనే ఈ ఏడాది ఇప్పటివరకు 61 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వారిలో ఇప్పటికే 14 మంది మృతి చెందడం గమనార్హం. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రస్తుతం గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో స్వైన్‌ ఫ్లూ వైరస్‌ బారినపడిన ఏడుగురికి చికిత్స అందిస్తుండగా వైరస్‌ సోకి ఉండొచ్చన్న అనుమానంతో మరో నలుగురికి సైతం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

ఒకరికి సోకితే అందరినీ చుట్టేస్తుంది...
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జనసమూహంలో ఎక్కువగా తిరుగుతుంటారు. నేతల్లో చాలా మంది బీపీ, షుగర్‌తో బాధపడుతుంటారు. వారిలో కొంత మందికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వారు ఉదయం నిద్రలేచింది మొదలు అర్ధరాత్రి వరకు జనం మధ్యే గడుపాల్సి వస్తుంది. బరిలో నిలిచిన అభ్యర్థితోపాటు కుటుంబ సభ్యులంతా జనసమూహంలో ఎక్కువసేపు గడపాల్సి వస్తుంది. స్వైన్‌ఫ్లూ కారక వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించే అవకాశం ఉంది. ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకిందంటే చాలు అందరికీ చుట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో ఏ వైరస్‌ సోకిందో గుర్తించడం కూడా కష్టమే. నిజానికి సాధారణ ఫ్లూ, స్వైన్‌ఫ్లూ లక్షణాలు చూడటానికి ఒకేలా కనిపిస్తాయి. స్వైన్‌ ఫ్లూలో దగ్గు, జలుబు, ముక్కు కారడం, దిబ్బడగా ఉండటం, 101–102 డిగ్రీల జ్వరం, ఒళ్లు నొప్పులు, బాగా నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, కొందరిలో వాంతులు, విరోచనాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వేంటనే వైద్యులను సంప్రదించాలి.

షేక్‌హ్యాండ్‌ఇవ్వకపోవడమే మంచిది...
నేతలు షేక్‌హ్యాండ్‌ ఇవ్వడం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ సోకే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకుండానే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఉత్తమం. దుమ్ము, ధూళి రూపంలో రకరకాల ఇన్‌ఫెక్షన్లు, బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సాధ్యమైనంత వరకు బయట తిరిగే సమయంలో ముక్కుకు మాస్క్‌ ధరించాలి. బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ చేతులు, కాళ్లు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ఈ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.– డాక్టర్‌ రాజన్న,చిన్న పిల్లల వైద్య నిపుణుడు   

ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 573 కేసులు నమోదు కాగా, 29 మంది మరణించారు.  
నగరంలోని గాంధీ జనరల్‌ ఆస్పత్రిలో ఇప్పటివరకు 61 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో 14 మంది మృతి చెందారు.   
ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఏడుగురికి, వైరస్‌ సోకిందని భావిస్తున్న మరో నలుగురికి చికిత్స అందిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top