‘స్వచ్ఛ’ ర్యాంకు మెరుగయ్యేనా..?

Swachh Bharat Program Adilabad municipality - Sakshi

మంచిర్యాలటౌన్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకు సాధనపై అధికారులు దృష్టి సారించడం లేదు. ఎన్నికల విధులతో మున్సిపల్‌ అధికారులు బిజీగా ఉండడంతో ‘స్వచ్ఛ’తలో అడుగు ముందుకు పడడం లేదు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీల్లో స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ఏ మేరకు కొనసాగుతుందో తెలుసుకునేందుకు 2017 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్‌ను ప్రారంభించింది. ఏటా జనవరిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ బృందం సభ్యులు పరిశుభ్రతను పరిశీలించి స్వచ్ఛతపై వివరాలు సేకరించిన అనంతరం మార్కులను బట్టి ర్యాంకు కేటాయిస్తారు. ఈ బృందం కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాల సేకరణతోపాటు స్థానికుల నుంచి వివరాలు సేకరించి కేంద్రానికి పంపిస్తారు. ఆ వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌ ర్యాంక్‌లను ప్రకటిస్తుంది.

ఈ ఏడాది జనవరిలో ఆశించిన ర్యాంకుల సాధనలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి. ఈ ఏడాది ఆగస్టులో కొత్తగా మున్సిపాలిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసినా అవి స్వచ్ఛ సర్వేక్షన్‌ పోటీలో లేవు. వచ్చే జనవరిలో పాత ఏడు మున్సిపాలిటీల్లోనే మరోసారి సర్వేకు బృందాలు రానున్నాయి. దీంతో మున్సిపల్‌ కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్ధేశం చేశారు. 2018లో సౌత్‌జోన్‌లో ఉమ్మడి జిల్లాలోని భైంసా, నిర్మల్, మంచిర్యాల కొంత మెరుగైన ర్యాంకులు సాధించాయి. ఈసారి ఎన్నికల హడావుడిలో అధికారులు నిమగ్నం కావడంతో స్వచ్ఛతపై పెద్దగా పట్టించుకోలేదు. 2019 జనవరిలో ప్రకటించే ర్యాంకులు ఏవిధంగా ఉండబోతాయోనని అధికారుల్లో కొంత ఆందోళన నెలకొంది

వారం రోజులే..
దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 పోటీల్లో 4,231 నగరాలు, పట్టణాలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని పట్టణాలు మెరుగైన ర్యాంకుల సాధనకు గత రెండు నెలలుగా పట్టణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో అధికారులు స్వచ్ఛ సర్వేక్షణ్‌పై దృష్టి సారించినా.. ఎన్నికల విధులతో ఆశించిన మేర సమయం కేటాయించలేకపోయారు. జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వరకు మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షన్‌ థర్డ్‌పార్టీ క్యూసీఐ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయి. స్వయంగా స్వచ్ఛతను పరిశీలించి ప్రజల అభిప్రాయాలను నమోదు చేసుకుంటారు.

ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్‌ టాయిలెట్లు, పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చిలు, ఆర్టీసీ బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, చెత్త సేకరించే విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుధ్య సిబ్బంది, సేకరించిన చెత్త నిల్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్‌ వంటి వివరాలను మదింపు చేస్తారు. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజల నుంచి వివరాలు రాబడుతారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందంలోని అధికారులు ప్రతి మున్సిపాలిటీని నాలుగు విభాగాలుగా విభజించి మార్కులు కేటాయిస్తారు. సర్వీస్‌ లెవల్‌ బెంచ్‌ మార్కుకు 1,250 మార్కులు, థర్డ్‌ పార్టీ అసెసర్ల పరిశీలన ద్వారా 1,250 మార్కులు, సిటిజన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ద్వారా 1,250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్, గ్యార్బేజీ, ఫ్రీసిటి, కెపాసిటీ బిల్డింగ్‌ ద్వారా 1,250 మార్కులు కేటాయించి, ర్యాంకులను ప్రకటిస్తారు.

గతంలో ర్యాంకులు అంతంతే..
సౌత్‌జోన్‌లో ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను మూడింటిలోనే కొంత మెరుగైన ర్యాంకులు వచ్చాయి. భైంసాకు 2,329 మార్కులు రాగా 18వ ర్యాంకు వచ్చింది. మంచిర్యాలకు 2,286 మార్కులకు గాను 23వ ర్యాంకు, నిర్మల్‌కు 2,199 మార్కులకు గాను 34వ ర్యాంకు వచ్చింది. ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి 2,423 మార్కులు రాగా 133వ ర్యాంకు వచ్చింది. ఇక మందమర్రికి 1,647 మార్కులు రాగా, 284వ ర్యాంకు పొందింది. కాగజ్‌నగర్‌కు 1,542 మార్కులు రాగా, 394వ ర్యాంకు పొందింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి 1,450మార్కులు రాగా, 516 ర్యాంకు వచ్చింది.
 
ప్రజల్లో చైతన్యం తేవాలి
సౌత్‌జోన్‌తోపాటు జాతీయ స్థాయిలో పలు మున్సిపాలిటీలతో పోటీ పడి మంచి మార్కులు, ర్యాంకు సాధించుకోవాలంటే ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం తేవాలి. పారిశుధ్య సిబ్బంది మున్సిపాలిటీల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి, పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలి. బహిరంగ మలమూత్ర విసర్జనను వందశాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించేలా చూడడంతోపాటు పారిశుధ్య కార్మికులు బాధ్యతగా తీసుకుని చెత్తను ప్రతిరోజు తీసుకెళ్లేలా చూడాలి. మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త సేకరణకు రెండు చెత్త బుట్టలను ప్రజలకు అందించారు. వాటిని ప్రజలు సక్రమంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి. చెత్తను తరలించి శివారు ప్రాంతాల్లో ఇష్టానుసారంగా వేస్తున్నారు. ఇలాంటి వాటిపై మున్సిపల్‌ సానిటరీ విభాగం పూర్తిగా దృష్టిసారించి చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించి రీసైక్లింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకంపై నిషేధం ఉన్నా ప్రజలు బట్ట సంచులను వినియోగించడం లేదు. మున్సిపల్‌ అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడంతో స్వచ్ఛతపై ఎలాంటి కార్యక్రమాలు ప్రారంభించలేదు.

పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం 
ఆదిలాబాద్‌రూరల్‌: స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమం కింద మంచి మార్కులు, ర్యాంకు సాధించేందుకు పట్టణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. మంచి మార్కులు సాధించాలంటే ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్లాస్టిక్‌ వాడకం నిషేధించడంతోపాటు బహిరంగా ప్రదేశాల్లో మల, మూత్ర విసర్జన చేయకూడదు. మరుగుదొడ్లు నిర్మించుకున్నారు కానీ వాడడం లేదు. తప్పనిసరిగా వాటిని వినియోగించుకోవాలి. అంతేకాకుండా వ్యర్థ పదార్థాల నుంచి వర్మీ కంపోస్టు వంటి ఎరువులు తయారు చేస్తున్నాం.  – మారుతి ప్రసాద్, మున్సిపల్‌ కమిషనర్, ఆదిలాబాద్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top