‘ఎంసెట్’ విద్యార్థుల్లో ఆనందం | Supreme Court puts EAMCET back on track | Sakshi
Sakshi News home page

‘ఎంసెట్’ విద్యార్థుల్లో ఆనందం

Aug 12 2014 2:05 AM | Updated on Jul 11 2019 5:01 PM

ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్థానికత అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

ఆదిలాబాద్ టౌన్ : ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్థానికత అంశంపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ నెల 31లోగా కౌన్సెలింగ్ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కౌన్సెలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలే నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ తీర్పు వెలువడటంతో ఎంసెట్ పరీక్ష రాసి ర్యాంకులు వచ్చిన విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎంసెట్ పరీక్ష మే లో జరిగింది. రెండు నెలలు గడిచినా కౌన్సెలింగ్ జరగకపోవడంతో విద్యార్థులు ఇంతకాలం ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే.

 14 నుంచి కౌన్సెలింగ్
 ఈ నెల 14 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ నెల 23 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన, ఆ తర్వాత సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గడువు కోరగా, గడువు పెంచేదిలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు ఫీజురీయింబర్స్‌మెంట్, స్థానికతపై ఆయా ప్రభుత్వాలు తేల్చుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

 జిల్లాలో...
 జిల్లాలో 3 వేలకు పైగా విద్యార్థులు ఎంసెట్ పరీక్ష  రాశారు. ఆదిలాబాద్‌లోని మావలలో ఏఎంఎఆర్ కళాశాల, మంచిర్యాలలో ఐజా ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఒక్కో కళాశాలలో 350కి పైగా సీట్లు భర్తీ కానున్నాయి. అదేవిధంగా ఆదిలాబాద్ పట్టణంలో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(రిమ్స్) వైద్య కళాశాల ఉంది. ఈ కళాశాలలో ఎంబీబీఎస్‌కు సంబంధించి వంద సీట్లు భర్తీ కానున్నాయి. కోర్టు తీర్పు వెలువడటంతో విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

 సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లా విద్యార్థులకు మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనే విషయం స్పష్టమవుతోంది. తెలంగాణ ప్రభుత్వమే విద్యార్థుల ఫీజులను భరిస్తామని ప్రకటించింది. ఏదేమైనా ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుండడంతో మెడికల్, ఇంజనీరింగ్ విద్యార్థుల చదువులు ముందుకు సాగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement