విద్యార్థులే గురువులుగా..!  

Students As Teachers In Children's Day - Sakshi

పాఠశాలల్లో బాలల దినోత్సవం

పాఠాలు బోధించిన చిన్నారులు

రోజు స్కూల్‌కు వస్తున్నాం. ఇంటికి వెళ్తున్నాం. మా గురువులు మాకు పాఠాలు బోధించేందుకు ఎంత శ్రమ పడుతున్నారో మేం బోధన చేస్తే అర్థమయింది. పాఠాలు చెప్పడం ఎంత కష్టమో.. క్రమశిక్షణ అంటే ఏమిటో తెలిసింది. విద్యార్థులందరూ ఒకేచోట ఉన్నప్పడు వారిని ఎలా క్రమశిక్షణలో పెట్టాలో బోధపడింది’ అని అన్నారు విద్యార్థులు. రోజు గురువులు చెప్పే పాఠాలు విన్న విద్యార్థులు బుధవారం టీచర్స్‌ డే సందర్భంగా వారు పాఠాలు చెప్పడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు.

కాల్వశ్రీరాంపూర్‌: మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో బుధవారం బాలల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. దేశ సౌభాగ్యానికి, సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. అనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులే గురువులుగా మారి పాఠాలు బోధించారు. ఎవరి నైపుణ్యం మేరకు వారు బోధన చేసి గురువులతో శభాష్‌ అనిపించుకున్నారు. తమకు రోజు పాఠాలు చెప్పే గురువులు ఎలా కష్టపడుతున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు.

ఇంగ్లిషు, సాంఘీకం బోధించా...
తొమ్మిదో తరగతి ఇంగ్లిషు, సాంఘిక శాస్త్రం పాఠాలు చెప్పా. మాకు పాఠాలు చెప్పడానికి ప్రతిరోజు మా టీచర్లు ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. పాఠాలు చెప్పడం అంటే నేర్పడం కాదు.. మనం కూడా నేర్చుకోవాలన్న విషయం అర్థమయింది.
-వంశీ, 10వతరగతి

టీచరవుతా...
భవిష్యత్తులో టీచరవుతా. తోటి విద్యార్థులకు పాఠాలు చెప్పాలంటే ముందుగా మనం నేర్చుకోవాలి. పుస్తకాలే కాకుండా సమాజంలో నిత్యం జరిగే అనేక విషయాలపై అవగాహన పెంచుకోవాలి. విద్యార్థులు అడిగే కొన్ని ప్రశ్నలకు జవాబులు పుస్తకాల్లో దొరకవు. మన చుట్టూ ఉన్న సమాజంపై అవగాహన కలిగి ఉంటేనే చెప్పగలం.                       
-అభిత, 10వతరగతి

సన్నద్ధమయ్యా..
8వతరగతి ఫిజికల్‌ సైన్స్‌ బోధించా. మాకు సార్లు చెప్పినప్పుడు మా దృష్టి మరోవైపు వెళ్లేది. పాఠం చెప్పడానికి రెండు రోజులు సన్నద్ధమయ్యా. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడం ఎంత కష్టమో అనుభవపూర్వకంగా తెలుసుకున్నా.
-సౌమ్య, 9వతరగతి

స్నేహితులే చెప్పినట్టు ఉంది..
తోటి స్నేహితులే పాఠాలు చెప్పినట్టు ఉంది. రోజు కలిసి తిరుగుతాం. కలిసి పాఠాలు చెప్పుబున్నట్లు అనిపించింది. ఎలా చెప్తారో అనుకున్నా. బాగానే బోధించారు. మాకు అర్థమయ్యేందుకు మా గురువులు ఎంత కష్టపడుతున్నారో ఇప్పుడు అర్థమయింది.
-రాకేశ్, 8వతరగతి

శభాష్‌ అనిపించుకున్నారు
ప్రతి క్లాసులో ఎవరికి వారు బాగానే బోధించారు. ముందుగా వారికి కొన్ని విషయాలపై అవగాహన కల్పించాం. బాగా అర్థం చేసుకున్నారు. అందుకు తగ్గట్టుగా తరగతి గదుల్లో వారు ఎంచుకున్న సబ్జెక్టును విద్యార్థులకు బోధించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎలా ఆరాటపడతారో స్వయంగా తెలుసుకున్నారు. శభాష్‌ అనిపించుకున్నారు.
-రమేశ్, హెచ్‌ఎం 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top