కాలేజీల నిర్వాకం... స్కాలర్‌షిప్‌లకు గండం | students suffering with college managements | Sakshi
Sakshi News home page

కాలేజీల నిర్వాకం... స్కాలర్‌షిప్‌లకు గండం

Aug 14 2017 2:24 AM | Updated on Sep 17 2017 5:29 PM

కాలేజీల నిర్వాకం... స్కాలర్‌షిప్‌లకు గండం

కాలేజీల నిర్వాకం... స్కాలర్‌షిప్‌లకు గండం

కాలేజీల నిర్లక్ష్యంతో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి దూరమయ్యే ప్రమాదం నెలకొంది.

మరో 15 రోజుల్లో ముగియనున్న దరఖాస్తుల గడువు
ఇప్పటికీ ఈ–పాస్‌లో నమోదు చేసుకోని వేల కాలేజీలు
లక్షల మంది ఫీజులు, ఉపకార వేతనాలకు దూరమయ్యే ప్రమాదం
గతేడాది 13.67 లక్షల దరఖాస్తులు.. ఈ సారి వచ్చినవి 4.37 లక్షలే


రాష్ట్రంలోని మొత్తం కాలేజీలు    7,010
‘ఈ–పాస్‌’లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నవి    4,462
వర్సిటీలు, బోర్డులు ధ్రువీకరించినవి    2,873
‘ఈ–పాస్‌’లో రిజిస్ట్రేషన్‌ చేసుకోనివి    2,548


సాక్షి, హైదరాబాద్‌
కాలేజీల నిర్లక్ష్యంతో లక్షలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి దూరమయ్యే ప్రమాదం నెలకొంది. ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో ఇప్పటికీ వేల సంఖ్యలో కాలేజీలు నమోదు చేసుకోకపోవడంతో అందులో చదివేవారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రస్తుతం ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ నెల 30తో దరఖాస్తు గడువు ముగియనుంది. కానీ ఇప్పటికీ 2,548 కాలేజీలు ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. దీంతో ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అన్ని కేటగిరీలకు చెందిన కాలేజీలు 7,010 ఉన్నాయి. ఇవన్నీ ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటేనే. దరఖాస్తు సమయంలో విద్యార్థులకు కాలేజీ వివరాలు అగుపిస్తాయి. కానీ ఇప్పటివరకు కేవలం 4,462 కాలేజీలు మాత్రమే ఈ–పాస్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి.

వసతుల్లేవ్‌.. రెన్యూవల్‌ రాదు..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. ఏటా కాలేజీలో మౌలిక వసతులు, స్థితిగతులను పకగా పరిశీలించి పథకాన్ని వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి కాలేజీ సంబంధిత యూనివర్సిటీ/బోర్డు నుంచి అనుమతి పత్రాన్ని తీసుకోవాల్సి ఉంది. అలా అనుమతి పొందిన తర్వాతే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం వర్తింపునకు సంబంధించి ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో ఆమోదం లభిస్తుంది. ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలు కళాశాల యాజమాన్యాల్లో వణుకు పుట్టిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మెజారిటీ కాలేజీల్లో అనేక లొసుగులున్నాయి. ముఖ్యంగా బోధన సిబ్బందిని నిర్దేశిత సంఖ్యలో నిర్వహించడంలేదు.

మౌలిక వసతులు కూడా సరిగ్గా లేవు. ఉన్నతాధికారుల తనిఖీల్లో ఈ లొసుగులన్నీ అనేక సందర్భాల్లో బయటపడ్డాయి. దీంతో పలు కాలేజీల గుర్తింపును సంబంధిత యూనివర్సిటీలు/బోర్డులు రెన్యూవల్‌ చేయడం లేదు. వాస్తవానికి విద్యాసంవత్సరం ప్రారంభం నాటికే కాలేజీలు గుర్తింపు పత్రాన్ని పొందాలి. కానీ కాలేజీల్లో సరైన వసతులు లేనందున వాటి ఫైళ్లన్నీ ఉన్నతాధికారుల వద్ద పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. కొన్ని జూనియర్‌ కాలేజీలు షిఫ్టింగ్‌(మార్పు) కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించాకే అనుమతి ఇవ్వాలని నిర్ణయించిన అధికారులు ఆ కాలేజీలకు సంబంధించిన ఫైళ్లను పక్కనబెట్టారు. దీంతో సదరు కాలేజీలు ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో నమోదు కావడం లేదు. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి కేవలం 2,873 కాలేజీలు మాత్రమే అర్హత సాధించడంతో అధికారులు వాటి వివరాలను మాత్రమే ఈ–పాస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు.

రిజిస్ట్రేషన్‌కూ వెనుకడుగు
విద్యార్థి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే అతడు చదివే కాలేజీ వివరాలు ఈ–పాస్‌లో కనిపించాలి. అందుకు ప్రతి కాలేజీ ఈ–పాస్‌లో ముందుగానే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇలా నమోదు చేసుకోకుంటే వాటిల్లో చదివే విద్యార్థులు ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోలేరు. ఇప్పటిదాకా మొత్తం 7010 కాలేజీల్లో.. కేవలం 4,462 కాలేజీలు మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి.

ఈ కాలేజీలకు కూడా సంబంధిత యూనివర్సిటీ/బోర్డులు ధ్రువీకరణ వస్తేనే విద్యార్థులకు ఫీజులు, ఉపకారవేతనాలు వస్తాయి. మరోవైపు 2,548 కాలేజీలు కనీసం రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకోలేదు. మరో పక్షం రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోకుంటే ఆయా కాలేజీల విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. గతేడాది 13.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2017–18 విద్యా సంవత్సరంలో 13.5 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ ఇప్పటివరకు కేవలం 4.37 లక్షల దరఖాస్తులే రావడంతో అధికారులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement