విద్యార్థుల త్యాగాలను పట్టించుకోని సర్కారు | Students sacrifices to care for the government | Sakshi
Sakshi News home page

విద్యార్థుల త్యాగాలను పట్టించుకోని సర్కారు

Jul 2 2015 12:12 AM | Updated on Mar 29 2019 9:31 PM

తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపిన విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం

నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపిన విద్యార్థులు, నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అవివేకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బండారు గార్డెన్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ కోసం ఎదురొడ్డి పోరాడిన నిరుద్యోగ యువతను సంవత్సరం నుంచి కేసీఆర్ తన మాయమాటాలతో మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు.  నిరుద్యోగ యువత బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడిందన్న విషయాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దలు మరిచిపోయి నిచాతినీచంగా వ్యవహరిస్తున్నారన్నారు. నిరుద్యోగులంతా ఉద్యోగాల నోటిఫికేషన్ లేకపోవడంతో తీవ్ర నిస్పృహలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 కొంత మంది మంత్రులు ఓయూ విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనలేదని మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. విద్యార్థులు అనేక త్యాగాలు చేశారని వారినే ఈ రోజు అవమానించడం సరైందికాదన్నారు. డీఎస్సీ లేదని సంబంధిత విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం దారుణమైన విషయమన్నారు. ఏ నాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని, ఉద్యమంలో మొహం చాటేసిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. జనాభాలో సగభాగమైన మహిళలకు మంత్రి పదవులు ఇవ్వని ఘన చరిత్ర భారతదేశంలో కేసీఆర్‌కే దక్కిందన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, ఇళ్లు ఇస్తామని చెప్పి ఇంత వరకు అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపులేదని, సీఎం సొంత జిల్లా అయిన మెదక్‌లోనే ఎక్కువ రైతుఆత్మహత్యలు జరిగాయని ఆందోళన వ్యక్తం .
 
 తెలంగాణ విముక్తి ఉత్సవాలు జరుపకుండా మజ్లిస్ పార్టీతో కలిసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం అండగా ఉంటుందన్నారు. హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, స్కిల్ డెవలప్‌మెంట్, ఎరువుల కర్మాగారం, 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం పరిశోధనా కేంద్రం నెలకొల్పుతున్నట్లు వివరించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు పి. విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులందరూ కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగ ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు.
 
   బీజేవైఎం జిల్లా నాయకులు సాగర్ల లింగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్‌రావు, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, శ్రీరామోజు షణ్ముఖ, బీజేవైఎం జాతీయ కార్యదర్శి బి.మహిపాల్‌రెడ్డి, వి.నరేందర్‌రావు, గుండగోని భరత్‌కుమార్‌గౌడ్, టి.రవికుమార్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, బాకి పాపయ్య, దర్శనం వేణు, పల్లెబోయిన శ్యాంసుందర్, కె.గోవర్దన్‌రెడ్డి, కళ్యాణ్ నాయక్, లింగస్వామి, బొజ్జ నాగరాజు, మొరిశెట్టి నాగేశ్వర్‌రావు, పెరిక మునికుమార్, ఎస్.రంగారెడ్డి, యశ్వంత్, జనార్ధన్, నర్సింహ, ఆచారి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement