చేతులు జోడించి చెప్తున్నాం..

students request to village people construct to toilets - Sakshi

మరుగుదొడ్డి కట్టుకోండి..

ప్రాణాలను కాపాడండి..

బహిర్భూమికి వచ్చినవారికి

విద్యార్థుల విన్నపం

నిజామాబాద్‌, మద్నూర్‌(జుక్కల్‌): ‘మరుగుదొడ్డి కట్టుకోండి.. మా ప్రాణాలు కాపాడండి’.. అంటూ విద్యార్థులు బహిర్భూమికి వచ్చినవారికి విన్నవించారు. ‘చేతులు జోడించి చెప్తున్నాం.. ఆరు బయట మలవిసర్జన చేయకండి’.. అంటూ బహిర్భూమికి వచ్చినవారికి విద్యార్థులు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. మద్నూర్‌లోని బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఎంపీడీవో నాగరాజు కలిసి ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. గురుకుల పాఠశాల గ్రామానికి దగ్గర ఉంది. దీంతో గ్రామస్తులు రోజూ పాఠశాల చుట్టూ బహిర్భూమికి వస్తుంటారు. విద్యార్థులు ముక్కుముసుకోవాల్సిందే. వారు నిత్యం దుర్గంధంతో అవస్థలు పడుతున్నారు. బహిర్భూమికి వచ్చినవారికి పలుమార్లు సముదాయించినా ఫలితం లేదు.

దీంతో శుక్రవారం విద్యార్థులు ఇందుకు పూనుకున్నారు. 200 మంది విద్యార్థులు, సిబ్బంది వేకువజామున పాఠశాల చుట్టూ వరుసగా నిలబడి బహిర్భూమి కోసం వచ్చినవారికి చేతులు జోడించి నమస్కరించి విన్నవించారు. ప్రభుత్వం రూ.12 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్నా ఇంట్లో మరుగుదొడ్లు ఎందుకు నిర్మించుకోవడం లేదని విద్యార్థులు ప్రశ్నించారు. కొందరు త్వరలో నిర్మించుకుంటామని హామీ ఇవ్వగా మరికొందరు విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. మరో మూడు రోజులపాటు ఈ కార్యక్రమం చేపడతామని విద్యార్థులు చెప్పారు. దీనిపై గ్రామస్తులు ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయాపడుతున్నారు.

                                                 వేకువజామున పాఠశాల చుట్టూ నిలబడిన విద్యార్థులు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top