గాంధీ నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

గాంధీ నర్సింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌పై చర్య తీసుకోవాలి

Published Fri, Feb 22 2019 10:16 AM

Students Complaint on Gandhi Nursing College Hyderabad - Sakshi

గాంధీఆస్పత్రి : గాంధీ నర్సింగ్‌ కళాశాలలో విద్యార్థినులకు చెందిన రూ.6.50 లక్షల నిధుల్లో అవకతవకలు జరిగాయని, ఆడిట్‌లో కూడా ఈ విషయం స్పష్టమైందని తక్షణమే ప్రిన్సిపాల్‌పై చర్యలు చేపట్టి, తమకు డబ్బులు ఇప్పించాలని నర్సింగ్‌ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (డీఎంఈ) రమేష్‌రెడ్డి, గాం«ధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే.. గాంధీ ఆస్పత్రికి అనుసంధానంగా బోయిగూడలోని గాంధీ నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులు, ప్రిన్సిపాల్‌ మధ్య గత కొంతకాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలుమార్లు విద్యార్థినులు ఆందోళనలు చేపట్టారు.

ఈ నేపథ్యంలో జమాఖర్చులపై ఆడిట్‌ చేయాలని డీఎంఈ ఆదేశించారు.  బుధవారం రాత్రి ముగిసిన ఆడిట్‌లో విద్యార్థినులకు చెందిన సుమారు రూ. 6.50 లక్షలు గోల్‌మాల్‌ జరిగిందని ఆడిట్‌లో వెల్లడైందని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన డబ్బులను తిరిగి ఇప్పించాలని, అవకతవకలకు బాధ్యులైన ప్రిన్సిపాల్‌పై చర్యలు చేపట్టాలని కోరుతూ డీఎంఈ, సూపరింటెండెంట్‌లకు ఫిర్యా దు చేశారు.  ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఆడిట్‌ ముగిసినా పూర్తి నివేదిక తమకు అందలేదన్నారు. విచారణ అధికారిగా ఆర్‌ఎంఓ–1 జయకృష్ణ కొనసాగుతున్నారని, పూర్తి వివరాలు వెల్లడైన తర్వాతే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
Advertisement