భైంసాలో ఇరువర్గాల మధ్య రాళ్లదాడి

Stone Pelting Between Two Groups in Bhainsa Nirmal - Sakshi

భైంసాటౌన్‌(ముథోల్‌): పట్టణంలో ఆదివా రం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్లితే.. పట్టణంలోని కోర్వాగల్లి ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఒక వర్గానికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా, మరో వర్గానికి చెందిన వ్యక్తితో స్వల్ప వాగ్వా దం జరిగింది. ఇది కాస్తా పెద్ద ఎత్తున ఇరు వర్గాల మధ్యన ఘర్షణకు దారి తీసింది. ఈ ఘర్షణతో ఒక్కసారిగా పట్టణంలో భయానక వాతావరణం నెలకొంది. ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లదాడికి పాల్పడ్డారు. కాగా, ఉదయం కూడా ఘర్షణలు తగ్గుముఖం పట్టలేదు. 


144 సెక్షన్‌ అమలు..
కోర్వాగల్లి ప్రాంతంలో చెలరేగిన అల్లర్లు సద్దుమణగలేదు. దీంతో భైంసాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. కాగా, ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 11 మంది గాయాలపాలయ్యారు. భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావుతో సహా పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. సీఐ శ్రీనివాస్‌ తలకు గాయమైంది. 11 ఇళ్లు, 24 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, 2 ఆటోలు దగ్ధమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల బలగాలు భారీగా రంగంలోకి దిగాయి. ఐజీ నాగిరెడ్డి, డీఐడీ ప్రమోద్‌రెడ్డితో పాటు, జిల్లా ఎస్పీ శశిధర్‌రాజు, మరో ముగ్గురు ఎస్పీలు, వెయ్యిమంది పోలీసులు భైంసా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి పరిస్థితిని సమీక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top