బారాబంకీ, మౌ జిల్లాల్లోనూ ఉద్రిక్తతలు | Muslim cleric arrested after violence over I love Mohammed poster in Bareilly | Sakshi
Sakshi News home page

బారాబంకీ, మౌ జిల్లాల్లోనూ ఉద్రిక్తతలు

Sep 28 2025 6:44 AM | Updated on Sep 28 2025 6:44 AM

Muslim cleric arrested after violence over I love Mohammed poster in Bareilly

పలువురిపై కేసులు, అరెస్ట్‌లు

భారీగా బలగాల మోహరింపు

బరేలీ/బారాబంకీ/వారణాసి: ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్‌ మహ్మద్‌’కార్యక్రమంపై తలెత్తిన వివాదం ముదిరింది. శుక్రవారం బరేలీలో ఆందోళనకారులు పోలీసులతో తలపడటం తెల్సిందే. ఈ నేపథ్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి ఇల్లిల్లూ సోదాలు జరిపి గొడవలకు కారణమైన వారిని అరెస్ట్‌ చేశారు. పొలీసులపై రాళ్లు రువ్వడం, దుకాణాలు, వాహనాలకు నిప్పుపెట్టిన ఘటనల్లో పాలుపంచుకున్న 500 మందిని గర్తించామని ఉన్నతాధికారులు తెలిపారు. 

ఇదంతా కుట్ర ప్రకారమే జరిగిందంటూ 8 మందిపై కేసులు నమోదు చేశారు. అయితే, పొరుగునున్న బారాబంకీలోని ఫైజుల్లాగంజ్‌లో ‘ఐ లవ్‌ మహ్మద్‌’అని ఉన్న బ్యానర్‌ను తొలగించారన్న వార్తలు రావడంతో శనివారం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్యానర్‌ చించినట్లు ఆరోపణలున్న ధన్ని అనే వాచ్‌మన్‌ ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. అక్కడికి సమీపంలోని మసీదు వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలో ఇదంతా రికార్డయ్యింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఫైజుల్లాగంజ్‌లో శాంతియుత వాతావరణం నెలకొందని ఎస్‌పీ అజయ్‌ సింగ్‌ చెప్పారు. 

అదేవిధంగా, మౌ జిల్లా నయీ బజార్‌ ప్రాంతంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు ‘ఐ లవ్‌ మహ్మద్‌’అని నినాదాలు చేస్తూ ఊరేగింపు చేపట్టారు. ఈ ఘటన వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. ఘటనపై దర్యాప్తు జరుగుతోందని మౌ ఎస్‌పీ ఇలమారన్‌ చెప్పారు. వారణాసిలోని సిగ్రాలో ఈ నెల 22వ తేదీన ‘ఐ లవ్‌ మహ్మద్‌’పోస్టర్లు, బ్యానర్లు చేబూని, నినాదాలతో ర్యాలీ చేపట్టిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతర వర్గాల ప్రజల్లో తమ ఆధిపత్యం ప్రదర్శించుకునేందుకు కొందరు ఈ కొత్త ఒరవడిని మొదలుపెట్టారని పోలీసులు అంటున్నారు.

మత పెద్ద రజా అరెస్ట్‌
బరేలీలో ఘర్షణలకు ప్రేరేపించారనే ఆరోపణలపై ఇత్తెహాద్‌–ఇ– మిల్లత్‌ పరిషత్‌ ప్రెసిడెంట్‌ మౌలానా తౌకీర్‌ రజాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘ఐ లవ్‌ మహ్మద్‌’కు మద్దతుగా రజా ర్యాలీకి పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారి తీసిందని, ప్రణాళిక ప్రకారం జరిగిన గొడవలకు ప్రధాన సూత్రధారి ఈయనేనని ఉన్నతాధికారులు తెలిపారు. రజా సహా 8 మందిని స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించింది. వీడియో ఫుటేజీలో గుర్తించిన మరో 36 మంది వ్యక్తులను నిర్బంధంలోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. 

నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించారనే ఆరోపణలపై రజా, మరో 25 మందితోపాటు గుర్తు తెలియని మరో 200 మందిపై ప్రేమ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఆందోళనకారులు ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ యూనిఫాంను చించివేశారన్నారు. బరేలీలో శనివారం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, స్కూళ్లు, దుకాణాలు యథావిథిగా పనిచేశాయని డీఐజీ అజయ్‌ కుమార్‌ సాహ్ని తెలిపారు. ఘర్షణలపై దర్యాప్తులో కొందరు రాజకీయ నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయన్నారు. శాంతియుత పరిస్థితులకు భంగం కలిగించాలని చూసే వారిపై గూండా చట్టం, జాతీయ భద్రతా చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. బరేలీ నగరంలో 8 వేల మందికిపైగా భద్రతా సిబ్బందిని మోహరించామని, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వీరు ఇక్కడే ఉంటారని పేర్కొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement