జిల్లా స్థాయిలో అన్ని శాఖలను వేధిస్తోన్న సిబ్బంది కొరత

Staff Shortage In Key Govt Departments In Suryapet District - Sakshi

ప్రభుత్వ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం

జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇదే పరిస్థితి

ఉన్న ఉద్యోగులపై తప్పని పనిభారం

సాక్షి, సూర్యాపేట:  జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. కలెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న 64 ప్రధాన శాఖల్లో సుమారు 2వేల మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం 625 మందితో కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సకాలంలో ఏ పనీ జరగడం లేదు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలుకు నోచుకోకపోగా, విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై పని భారం తప్పడంలేదు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం ఒక అధికారి, అటెండర్‌ మాత్రమే ఉన్నా వీరిని యాదాద్రి భువ నగిరి జిల్లాకు ఇన్‌చార్జ్‌గా ని యమించారు. దీంతో ఏడాది కాలంగా కార్యాలయ తాళం తీ యడం లేదు. జిల్లాస్థాయి ప్ర భుత్వ కార్యాలయాల్లో సిబ్బం ది కొరతకు ఇది నిదర్శనం. 

సర్కారు పథకాలు సకాలంలో ప్రజలకు అందించాలంటే ప్రభుత్వ కార్యాలయాల్లో సరిపడా ఉద్యోగులు ఉండాలి. చిన్న జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయవచ్చని భావించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉద్యోగులను మూడు జిల్లాలకు పంచడమే కాకుండా ఇతర జిల్లాల నుంచి కొంత మంది ఎంప్లాయీస్‌ను సూర్యాపేట జిల్లాకు ఆర్డర్‌టు సర్వ్‌ పేరుతో పంపింది. అయితే తగినంతమందిని కేటాయించకపోవడంతో జిల్లా స్థాయిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఉద్యోగుల కొరత పట్టిపీడిస్తోంది. ఒకటి రెండు శాఖల్లో ఉద్యోగుల కొరత ఉంటేనే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అలాంటిది అన్ని శాఖల్లో అలాంటి పరిస్థితే ఉండడంతో సకాలంలో పనులు జరగడంలేదు. జిల్లా ఏర్పడి మూడేళ్లు కావొస్తున్నా ఉద్యోగుల సమస్య మాత్రం తీరడం లేదు. 

శాఖల్లో పరిస్థితి.. 

జిల్లా  సమీకృత కలెక్టరేట్‌తో పాటు జిల్లా కేంద్రలో ఉన్న  64 ప్రధాన శాఖల్లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు ఉండాలి. కానీ కేవలం 625 మందితో నెట్టుకురావాల్సిన దుస్థితి నెలకొంది. సమీకృత కలెక్టరేట్‌లో ఉన్న జిల్లా కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత స్పష్టంగా కనబడుతోంది. అన్ని శాఖల్లో ప్రధాన్యత కలిగిన జిల్లా రెవెన్యూ కార్యాలయంలో వివిధ సెక్షన్లలో కలిపి 54 మంది ఉద్యోగులు అవసరం ఉండగా  30 మంది మాత్రమే ఉన్నారు.  జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయలంలో 15 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా 8 మంది ఉద్యోగుల మాత్రమే ఉన్నారు. జిల్లా ఆహార తనిఖీ కార్యాలయంలో కనీసం ఆరుగురు ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక అధికారి, అటెండర్‌ మాత్రమే ఉన్నా వీరు కూడా ఇతర మరో జిల్లాలకు ఇన్‌చార్జ్‌గా నియమించడంతో గత సంవత్సరం నుంచి కార్యాలయ తాళం తీయడం లేదు. ఇక జిల్లా కార్మిక శాఖలో 12  మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక జిల్లా అధికారి, ఒక డివిజన్‌ అధికారి,  ఒక జూనియర్‌ అసిస్టెంట్, ఒక అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి కలిపి మొత్తం నలుగురు మాత్రమే ఉన్నారు.  అదే విదం గా గ్రామ పంచాయతీ కార్యాలయం, ముఖ్య ప్రణాళిక అధికారి కార్యాలయం, సివిల్‌ సప్లయ్, పౌరసంబంధాలశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, సహకారశాఖ, భూ కొలతలు, పంచాయతీరాజ్‌ ఇలా అన్ని శాఖల్లో ఉద్యోగుల కొరత వేధిస్తోంది. 

సక్రమంగా అమలు కాని ప్రభుత్వ పథకాలు 
ఉద్యోగుల కొరత వల్ల ప్రభుత్వ పథకాలు స క్రమంగా అమలు కావడం లేదు. చిన్న జిల్లాలు ఏర్పడినా ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగక తప్పడం లేదు. ఇదిలా ఉంటే ఉద్యోగులకు పని ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా అధికారులతో పాటు సీనియర్‌ అసిస్టెంట్‌లపై అధికభారం పడుతోందని ఆయా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు  నేరుగా బయటకు చెప్పకున్నా  తమలో తమే బాధపడుతున్న సందర్భాలూ ఉన్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top