అక్షరాలా పండుగే..

special stoty telugu mahasabalu - Sakshi

200 సినిమా హాళ్లలో స్లైడ్లు

శ్రీశైలం నుంచి వంట మనుషులు

ప్రత్యేకంగా రైలు..

1953లో సారస్వత పరిషత్‌ సభలు

దేవరకద్ర రూరల్‌:  అరవై నాలుగేళ్ల క్రితం రవాణా సౌకర్యాలు కూడా లేని పాలమూరు జిల్లా మారుమూల ప్రాంతంలో రాష్ట్రస్థాయి సాహిత్య సభలను దిగ్విజయంగా నిర్వహించారంటే ఆశ్చర్యం కలగక మానదు! ఇప్పటి జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 1953లో ఈ సభలు జరిగాయి. ఈ సభల కోసం ఉపరాష్ట్రపతినే ఆహ్వానించడం, అలంపూర్‌ సభలకు వచ్చే సాహిత్య ప్రముఖుల కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడం, 4 వేల మందికి పైగా హాజరైన అతిథులకు ఎలాంటి లోటు లేకుండా భోజన, వసతి కల్పించడం విశేషం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన గడియారం రామకృష్ణ శర్మ రాసిన శతపత్రం పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి. ఆ విశేషాలు ఇవీ...

వంటకాల్లో లడ్డూ, పులిహోర
సభలకు వచ్చే అతిథులకు చక్కని ఆతిథ్యం ఇవ్వడానికి శ్రీశైలం నుంచి 13 మంది వంట మనుషులను రప్పించారు. పూటకు 4 వేల మంది భోజనం చేస్తారని భావించగా.. 30 వేల మంది వరకు హాజరయ్యారు. అయినా ఎక్కడా లోటు లేకుండా భోజనాలు సమకూర్చారు. అది సంక్రాంతి సమయం కావడంతో ఆహూతులందరికీ లడ్డూ, పులిహోరా వడ్డించారు.

ప్రత్యేక రైలుకు రూ. 5వేలు
ఉపరాష్ట్రపతితో పాటు రాష్ట్ర మంత్రిమండలి సభ్యులు సభలకు హాజరయ్యారు. ఇందుకు రూ.5 వేలు చెల్లించి ప్రత్యేకంగా రైలు బుక్‌ చేశారు. నిజాం నవాబు ఉపయోగించే ప్రత్యేక బోగీలో ఉపరాష్ట్రపతి సర్వేపల్లితో పాటు మంత్రిమండలి సభ్యులు హాజరయ్యారు. అలంపూర్‌కు చేరిన సర్వేపల్లికి సాహితీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. ఈ రైల్లో వచ్చిన 700 మందిని ట్రక్కుల్లో అలంపూర్‌ చేర్చారు. అనంతరం సర్వేపల్లి సభలను లాంఛనంగా ప్రారంభించారు. దేవులపల్లి రామానుజరావు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సమావేశానికి గడియారం రామకృష్ణశర్మ స్వాగతం పలకగా సర్వేపల్లి తెలుగులో స్వాగత వచనాలు పలకడం విశేషం.

నాలుగు రోజులు అంగరంగవైభవంగా
1953 జనవరి 11, 12, 13, 14వ తేదీల్లో నాలుగు రోజుల పాటు ఆంధ్రసారస్వత పరిషత్‌ ఏడో వార్షికోత్సవ సభలను నిర్వహించారు. అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రామానుజరావు.. ఉపరాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఈ సభలకు హాజరయ్యేలా ఒప్పించారు. ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్టారావు పూర్తిగా సహకరించారు.  నెలరోజుల పాటు సమాచార శాఖకు సంబంధించి మినీ బస్సులు ఉపయోగించుకునేందుకు అనుమతి ఇచ్చారు.

200 సినిమా హాళ్ల ద్వారా ప్రచారం
ఈ సభల నిర్వహణ సమాచారం తెలిసేలా ఉమ్మడి రాష్ట్రంలోని రెండు వందల సినిమా హాళ్లలో స్లైడ్ల ద్వారా ప్రచారం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గోడపత్రికలు, కరపత్రాలను పంపిణీ చేశారు.

కాళోజీ ‘నా గొడవ’ ఆవిష్కరణ
ఈ సభల్లోనే ప్రజాకవి కాళోజీ రాసిన ‘నా గొడవ’ కవితా సంపుటిని ప్రముఖ కవి శ్రీశ్రీ ఆవిష్కరించారు. సాహిత్య చర్చలతో పాటు ప్రముఖుల రాకతో సభా ప్రాంగణాలు కళకళలాడాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top