పదిలం బిడ్డా! మన బడి.. మారలేదమ్మా!

Special Story on Old Government Schools - Sakshi

విరిగిన బెంచీలు, తలుపులు, కిటికీలు... పగుళ్లు ఏర్పడిన గోడలు... వానొస్తే నీళ్లు నిండే గదులు... ఎలుక బొక్కలు... ఇదీ కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధి బాలానగర్‌ మండలంలోని రాజీవ్‌గాంధీ ప్రాథమిక పాఠశాల దుస్థితి. ఈ బడిని చూస్తే ‘అసలు ఇది పాఠశాలా.. పశువుల పాకా?’ అనే సందేహం కలుగుతుంది. సర్కార్‌ పాఠశాలల దీనావస్థకు నిదర్శనంగా నిలుస్తున్నఈ బడిలో నాలుగేళ్ల క్రితం 400 మంది విద్యార్థులు ఉండగా... సౌకర్యాల లేమితో ఆ సంఖ్య 108కి పడిపోయింది. దీనిపై ‘సాక్షి’ గతంలో కథనాలు సైతం ప్రచురించింది. స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాఠశాలను సందర్శించిపరిస్థితిని తెలుసుకున్నారు. నూతన భవన నిర్మాణానికిరూ.60 లక్షలు మంజూరు చేశారు. కానీ ఆ తర్వాత నిధులులేవని చెప్పడంతో బడి బతుకు మారలేదు.విద్యార్థులకు వ్యథ తప్పడం లేదు. 

ఇది సర్కారు ఏలుబడి..

ఇదో ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల.. ఇక్కడ చదువుతున్నది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. ఇక్కడ పిల్లలకు ఉపాధ్యాయులు పుస్తకాల్లోని పాఠాల కంటే ‘స్వీయ రక్షణ’ పాఠాలే చెప్పాల్సి వస్తోంది. తల్లిదండ్రులు సైతం ప్రతి రోజు ‘పదిలం బిడ్డా’ అంటూ జాగ్రత్తలు చెప్పి పంపిస్తున్నారు. వాన కురిస్తే కారిపోయే శ్లాబులు, పగుళ్లతో పడిపోవటానికి సిద్ధంగా ఉన్న గోడలు.. వాటికి ఎలుకలు పెట్టిన కన్నాలు.. ఎలుకలను తినేందుకు వచ్చే పాముల మధ్య విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది. పగిలిపోయిన గచ్చు.. ఊడిపోయిన కిటీకీలు.. విరిగిపోయిన తలుపు మధ్య ‘నేల’బారు చదువులతో భయం గుప్పిట బతకాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఇది ఏ మారుమూల తండాలోనిదో కాదు.. 

మహానగరంలో అంతర్భాగమైన బాలానగర్‌ మండలం రాజీవ్‌గాంధీనగర్‌ ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల. ఈ స్కూలు దుస్థితిపై మూడేళ్ల క్రితం (2016, సెప్టెంబర్‌ 18) ‘వామ్మో.. వానొచ్చింది’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. అయినా అధికారుల్లోగాని, నాయకుల్లోగాని స్పందన లేదు. ఈ ఏడాది జూలైలో మరోసారి ‘పాఠశాలా.. పశువుల దొడ్డా..?’ పేరుతో మరో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్కూలును పరిశీలించి ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.60 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం నిధులు లేవంటూ చేతులెత్తేయడంతో బడి పరిస్థితి అలాగే మిగిలిపోయింది. ఇక్కడ చినుకులు పడితే సెలవు.. గాలి వీస్తే సెలవు పరిపాటి. ఇక చదువులు సాగే దెప్పుడు? అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.తరగతులు జరుగుతుండగా జరగరాని దుర్ఘటన జరిగితే అందుకు బాధ్యులు ఎవరంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.    – ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top