పదిళ్లకో బెల్టు షాపు..

Special Story On Belt Shops In Telangana - Sakshi

300 ఇళ్లు.. 30 బెల్ట్‌ షాపులు

14 వీధులు.. వీధికి రెండు దుకాణాలు

మద్యం మత్తులో చిత్తవుతున్న కూలీలు

లిక్కర్‌కు బానిసలై అఘాయిత్యాలు

రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్మంతా మద్యం పాలు

జగిత్యాల జిల్లా కోరుట్ల శివారులోని అల్లమయ్యగుట్టలో పరిస్థితి ఇదీ!

ఈయన పేరు మల్లేశం. భార్య పేరు సాయమ్మ. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. రోజువారీ కూలీనే వీరి జీవనాధారం. వీరి ఇంటి పక్కనే బెల్ట్‌షాప్‌ ఉంది. మల్లేశం ప్రతిరోజూ తాగుడుకు రూ.250 నుంచి రూ.300 దాకా ఖర్చు చేయడం మొదలెట్టాడు. మెల్లమెల్లగా కూలీకి వెళ్లడమే మానేశాడు. సాయమ్మ ఒక్కతే కూలీకి వెళ్లి భర్త, పిల్లలను సాకాల్సిన దుస్థితి. తాగుడు మానేయాలని భర్తతో సాయమ్మ తరచూ గొడవపడేది. పది రోజుల కింద ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పట్టపగలే తాగిన మత్తులో ఉన్న మల్లేశం.. సాయమ్మను కత్తితో పొడిచి చంపాడు. తర్వాత తాను పొడుచుకుని ఆసుపత్రి పాలయ్యాడు!

కోరుట్ల : ఇలాంటి అఘాయిత్యాలు ఒకట్రెండు కాదు.. పది రోజులకో నేరం.. నెలకో ఘోరం అక్కడ కామన్‌గా మారిపోయాయి. మద్యం ఏరులై పారుతుండటంతో ఆ మత్తులో చిక్కి కూలీలు చిత్తయిపోతున్నారు. ఇదెక్కడో అడవుల్లోని తండాలోనో,  మారుమూల ఊరిలోనో జరుగుతున్న తంతు కాదు.. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని అల్లమయ్యగుట్టలో లిక్కర్‌ సృష్టిస్తున్న బీభత్సం!

పది ఇళ్లకో బెల్ట్‌ షాపు: అల్లమయ్యగుట్ట కాలనీలో సుమారు 300 ఇళ్లు ఉండగా.. బెల్టు షాపులు 30 ఉన్నాయి. జనాభా 1,200 నుంచి 1,500 వరకు ఉంటుంది. కాలనీలో ఉన్నవారంతా రోజువారీ కూలీలే. ఉదయం లేచింది.. మొదలు సాయంత్రం వరకు అంతా పనిచేసి రాత్రి వేళ ఇంటికి చేరుకుంటారు. కాయకష్టం మరిచిపోవడానికి కూలీలు మద్యానికి అలవాటు పడ్డారు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకున్న కొందరు బెల్ట్‌షాపులు ఇబ్బడిముబ్బడిగా తెరిచారు. గల్లీకో బెల్ట్‌షాపులు ఏర్పాటయ్యాయి. చిన్నచిన్న కిరాణా షాపుల్లో.. టేలల్లో.. ఇళ్లలో ఎక్కడపడితే అక్కడ 24 గంటలు మద్యం(చీప్‌ లిక్కర్‌) అందుబాటులో ఉంటుంది. అది తాగి కూలీలు మత్తులో విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్నారు. తాగి గొడవలు పడటం.. పొద్దంతా కష్టించి సంపాదించిన డబ్బులు మద్యానికి ఖర్చు చేస్తుండటంతో కాలనీవాసుల బతుకులు చితికిపోతున్నాయి.

మూడొంతుల కూలి మద్యానికే..
అల్లమయ్యగుట్ట కాలనీవాసులు రోజువారీ సంపాదించే కూలి డబ్బులో మూడొంతులు మద్యం కొనుగోలుకే వెచ్చిస్తున్నారు. ఒక్కో బెల్ట్‌ షాపుకు మద్యం అమ్మకాలతో రోజుకు కనీసం రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఆదాయం ఉంటోంది. ఈ లెక్కన 30 బెల్ట్‌ షాపులకు కాలనీ వాసులు కూలీనాలి చేసి సంపాదించిన డబ్బుల్లోంచి ప్రతీరోజు రూ.60 వేల దాకా చేరుతోంది. ఇలా కాలనీవాసులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా.. అనేక నేరాలు జరుగుతున్నాయి.

‘మామూళ్ల’.. మత్తు!
అల్లమయ్యగుట్ట కాలనీలో సగానికిపైగా జనం మద్యం మత్తులో మునిగి తేలుతుండగా.. అడ్డగోలుగా వెలిసిన బెల్ట్‌ షాపులను నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మాముళ్ల మత్తులో జోగుతోంది. ఈ కాలనీని ఆనుకుని ఉన్న వేములవాడ ప్రధాన రహదారి వెంట దాదాపు నాలుగు బెల్ట్‌షాపులు ఉన్నాయి. కాలనీలో సుమారు 14 వీధులు ఉండగా వీధికి రెండు చొప్పున బెల్ట్‌షాపులు వెలిశాయి. వీటన్నింటికీ కోరుట్లలోని వైన్‌ షాపుల నుంచి మద్యం సరాఫరా అవుతోంది. ఈ విషయం తెలిసినా వైన్‌ షాపుల నుంచి నెలవారీ మాముళ్లు అందుతుండటంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలనీకి చెందిన యువకులే అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించిన దాఖలాలు లేవు.

ఆడోళ్లకు భద్రత లేదు
మా కాలనీలో ఎక్కడపడితే అక్కడ మందు దొరుకుతంది. మొగోళ్లు పనులు బంద్‌ చేసి చీప్‌ లిక్కర్‌ తాగుతున్నరు. పొద్దస్తమానం తాగడంతో ఆడోళ్లు పరేషాన్‌ అవుతున్నరు. ఎప్పుడు ఆడోళ్ల మీద ఏం ఘోరం జరుగుతుందోనని భయపడుతున్నం.
– ఎల్లవ్వ, అల్లమయ్యగుట్ట కాలనీ

24 గంటలు మందు..  
కాలనీలో అంతా కూలీనాలి చేసుకునేటోళ్లమే. పెళ్లాం.. మెగుడు కలిసి పనిచేస్తే వచ్చేది రూ.500. అందులో తాగుడుకే సగం డబ్బులు పోతున్నయ్‌. కాలనీలో ఎక్కడపడితే అక్కడ లిక్కర్‌ అమ్ముతున్నరు.
- వీరభద్ర నగేశ్, అల్లమయ్యగుట్ట కాలనీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top