విజయవాడ రామవరప్పాడు వద్ద ఏర్పాటు చేసిన క్యాసినో బరి
అధికార టీడీపీ–జనసేన ప్రజాప్రతినిధులు, నేతల పర్యవేక్షణ
రూ.వందల కోట్ల ముడుపులు వసూలు చేసి జూదాలకు పచ్చజెండా
పండుగను సైతం ఆదాయ వనరుగా మార్చుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు
కనీవిని ఎరుగని స్థాయిలో పేకాట, గుండాట, ఇతర జూద క్రీడలు..
క్యాసినోలు.. గోవా నుంచి క్లబ్ డాన్సర్లను రప్పించిన నిర్వాహకులు
స్టేడియం తరహాలో సిట్టింగ్, ఏసీ గదులు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, క్యారవాన్లు, బౌన్సర్లతో హంగామా.. ఐపీఎల్‌ను తలపించేలా పందేల బరులు
బరుల వద్ద రెట్టింపు ధరలకు మద్యం.. యథేచ్ఛగా అశ్లీల నృత్యాలు
కన్నెత్తి చూడని పోలీస్ యంత్రాగం.. కోర్టు ఆదేశాలు బేఖాతర్
సంక్రాంతి సంబరాలంటూ ఎల్లో మీడియా మభ్యపుచ్చే యత్నాలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: కోర్టు తీర్పులను లెక్క చేయకుండా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, టీడీపీ, జనసేన నేతలు బరులు పంచుకుని విచ్చలవిడి జూద క్రీడలకు తెర తీశారు. ఇప్పటికే ఊరూరా బెల్టు షాపులు, కుటీర పరిశ్రమలా మద్యం తయారీ, సహజ వనరుల దోపిడీతో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. సంక్రాంతి పండుగనూ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ముడుపులు తీసుకుని కోడి పందేల బరుల వద్ద క్యాసినోలు, జూద క్రీడలకు పచ్చజెండా ఊపారు. దీంతో మూడు రోజుల్లో రూ.వేల కోట్లు చేతులు మారాయి! టీడీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల తరహాలో జూదాల జాతర సాగుతోంది. అన్ని బరుల వద్దా పేకాట, గుండాట, కోతముక్క నంబర్ల ఆటలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
బరుల వద్దే బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేస్తున్నారు. గత మూడు రోజులుగా ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో సుమారు రూ.5 వేల కోట్ల మేర పందేలు జరిగినట్లు అంచనా. పెద అమిరం వద్ద బరిలో క్యాసినో ఏర్పాటు చేసి గోవా నుంచి క్లబ్ డ్యాన్సర్లను ప్రత్యేక అతిథుల కోసం రప్పించినట్లు తెలిసింది. ఇంత విచ్చలవిడిగా జూద క్రీడలు సాగుతుంటే సంక్రాంతి సంబరాలు అంటూ ఎల్లో మీడియా మభ్యపుచ్చేందుకు యత్నించడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటయ్యాయి. ఎప్పటి మాదిరిగానే అత్యధిక బరులు పశ్చిమ గోదావరి జిల్లాలో సిద్ధం కాగా ఆ తర్వాత తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఏర్పాటయ్యాయి. భీమవరం, ఉండి, దెందులూరు, రావులపాలెంలో బరులు గోవా, శ్రీలంక క్యాసినోలను తలదన్నేలా ఏర్పాటయ్యాయి. గన్నవరం, నూజివీడు మధ్య మీర్జాపురం, బిళ్లనపల్లి గ్రామాల సమీపంలో ఏర్పాటైన పందేల బరి హైలైట్‌గా నిలిచింది. అక్కడికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు రావడంతో ప్రత్యేకంగా వీవీఐపీ గ్లాస్ గ్యాలరీలు ఏర్పాటు చేసి క్యారవాన్లు, బౌన్సర్లను రంగంలోకి దించారు.
ఏసీ గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు, రాత్రయితే ఫ్లడ్ లైట్లతో పందేల బరులు ఎగ్జిబిషన్లను తలపిస్తున్నాయి. ఈ గ్యాలరీల్లో ప్రవేశం రుసుం కింద రూ.2 వేలు చొప్పున వసూలు చేశారు. అతిథులకు సకల మర్యాదలు చేస్తున్నారు. స్థానిక వంటలు రుచి చూపించేందుకు వంట మాస్టర్లను రప్పించారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి మండలం తూర్పుపాలెంలో బరులను దగ్గరుండి పర్యవేక్షించారు. గురు, శుక్రవారం కోడి పందేలను వీక్షించారు. హోంమంత్రి అనిత ప్రాతినిథ్యం వహిస్తున్న పాయకరావుపేటతోపాటు యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల్లో కోడి పందేలు భారీగా జరిగాయి.
రాజమహేంద్రవరం రమేష్ జాక్‌పాట్..!
రెండు రోజుల్లో రూ.2.50 కోట్లు..
తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య బరిలో నిర్వహించిన కోడి పందెంలో ఏకంగా రూ.1.53 కోట్ల భారీ పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్ సేతువ జాతి పుంజు, రాజమహేంద్రవరంవాసి రమేష్ డేగ జాతి కోడి పుంజుల మధ్య పందెం జరగ్గా డేగ జాతి పుంజు గెలిచింది. దీంతో రమేష్ పందెంలో రూ.1.53 కోట్లు నెగ్గారు. శుక్రవారం కనుమ రోజు నిర్వహించిన మరో పందెంలో రమేష్ రూ.90 లక్షలు గెలుచుకోవడం విశేషం.
ఇన్నోవా కారు, బుల్లెట్లు..
రావులపాలెంలో పందెంలో గెలుపొందిన గ్రూపు రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను సొంతం చేసుకుంది. ఏడు పోటీలకు ఆ గ్రూపు 6 పందేలలో గెలిచింది. మురమళ్లలో ఇన్నోవా కారు, బుల్లెట్ ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఏలూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో స్థానిక ప్రజాప్రతినిధి ఏర్పాటు చేసిన బరిలో సర్వ హంగులు కల్పించారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరం బరి వద్ద బిరియానీ పాయింట్లు, కోడి పకోడి సెంటర్లు, ఆహార పదార్థాల స్టాల్స్ ఏర్పాటు చేశారు.
మూడు రోజులుగా రూ.5 వేల కోట్ల జూదం..!
చిన్న బరుల్లో పందేలు రూ.వేల నుంచి మొదలై రూ.లక్షల వరకూ వెళుతున్నాయి. పెద్ద బరుల్లో రూ.లక్షల్లో మొదలై రూ.కోట్లకు చేరుకుంటున్నాయి. భీమవరం, ఉండి ప్రాంతాల్లోని 14 పెద్ద బరుల్లో రూ.వందల కోట్ల మేర పందేలు జరిగినట్లు తెలుస్తోంది. మూడు రోజులుగా రూ.200 కోట్ల వరకూ పందేలు జరిగి ఉంటాయని చెబుతున్నారు. ఒక్కో బరిలో రోజుకు 25 నుంచి 30 వరకు ప్రధాన పందేలు జరగ్గా, కనీస పందెం రూ.50 లక్షల నుంచి మొదలై రూ.కోటి వరకూ వెళ్లాయి. తాడేపల్లిగూడెం బెల్ట్‌లోనే రూ.250 కోట్ల మేర పందేలు జరిగినట్లు చెబుతున్నారు. 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు పందేలు జరిగినట్లు అంచనా.
భీమవరంలో భలే గిరాకీ..
భోగి పండుగ రోజు మొదలైన పందేలు సంక్రాంతి రోజు పతాక స్థాయికి చేరి ఇంకా కొనసాగుతున్నాయి. ఈ పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడా బాబులతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర చోట్ల నుంచి జూదరులు తరలివచ్చారు. దీంతో హోటళ్లు, వాహనాల అద్దెలు, తాత్కాలిక వసతులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. భీమవరంలోని పెద్ద హోటళ్లలో రూమ్ కోసం ఒక రోజుకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ఇచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
బౌన్సర్లు.. ‘జబర్దస్త్’ వినోదం
⇒ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుండాట, పేకాట, కోతాట, క్యాసినోల నిర్వాహకులు పగలు రాత్రి తేడా లేకుండా జూదాలు నిర్వహిస్తూ పందెంరాయుళ్లు బరి నుంచి బయటకు రాకుండా సకల సదుపాయాలు కల్పించారు. ఈసారి మినీ ఏటీఎంలు వెలిశాయి. జబర్దస్త్ నటులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బరుల వద్ద మాడుగుల హల్వా, సంగం డెయిరీ అవుట్ లెట్, ఐస్ బర్గ్ లాంటి ఐస్‌క్రీం స్టాల్స్ కనిపించాయి. పెద అమిరం బరి వద్ద డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, సినీ ప్రముఖులు పందేలు తిలకించారు.
⇒ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రికార్డింగ్ డ్యాన్సులతో హోరెత్తుతోంది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో భారీగా పందేలు నిర్వహించారు. కాకినాడ, అమలాపురం ఎంపీలు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్, గంటి హరీష్ మాధుర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, సినీ నటి హేమ తదితరులు పందేలను వీక్షించారు. తూర్పు గోదావరి జిల్లాలో కడియం – వీరవరం రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో క్యాసినో నిర్వహించారు.
⇒ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో బరుల వద్ద భారీ పందేలు జరిగాయి. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరులో బరి వద్ద రేగిన వివాదం కేతనకొండలో రెండు సామాజిక వర్గాల మద్య ఘర్షణకు దారి తీయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
⇒ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి శిబిరంలో టీడీపీ నేతలు ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేసి పేకాట, క్యాసినో నిర్వహించారు. రూ.10 వేలు కట్టిన వారిని మాత్రమే ఎంట్రీ బ్యాండ్‌తో లోపలికి అనుమతించారు. పెనమలూరు నియోజకవర్గం ఆకునూరు, ఉప్పులూరు గ్రామాల్లో క్యాసినో తరహా జూద క్రీడలు సాగాయి. ఎంట్రీ టికెట్ రూ.లక్ష చొప్పున బరుల నిర్వాహకులు వసూలు చేశారు. కాకినాడ జిల్లాలో బరులకు వెళ్లే దారిలో రెండు కి.మీ. మేర ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి సెల్‌ఫోన్లతో వెళ్లకుండా ఆంక్షలు పెట్టారు.
⇒ పిఠాపురం మండలం కందరాడలో జనసేన నేత ఆధ్వర్యంలో సినీ సెట్టింగ్ మాదిరిగా ఏర్పాట్లు చేసి కోడిపందేలు, గుండాట నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కోడిపందేల విజేతలకు రెండు కార్లు, ఒక బైక్ బహుమతిగా అందించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీగా పందేలు జరిగాయి. పూతలపట్టు మండలం బండపల్లిలో పేకాటలో డబ్బులు పోగొట్టుకున్నట్లు ఓ బాధితుడు ఫిర్యాదు చేశాడు.
⇒ శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజుల వ్యవధిలో రూ.12.26 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రణస్థలం మండల పరిధిలో కోడి పందేలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సోదరుల కనుసన్నల్లో పందేలు సాగాయి. అచ్యుతాపురం మండలంలో బెల్టు షాపులకు వేలం నిర్వహించారు. సబ్బవరం మండలం అమృతపురం, మొగలిపురం గ్రామాల్లో టీడీపీ, జనసేన కూటమి నేతల ప్రత్యక్ష పర్యవేక్షణలో కోడిపందేలు, గుండాట నిర్వహించారు. టీడీపీ ఇన్‌చార్జి గండి బాబ్జీ స్వగ్రామమైన మొగలిపురంలో పందేల వద్ద గొడవ జరిగింది. సుజాతనగర్‌కు చెందిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ఓ నిర్వాహకుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకుని రాత్రంతా విద్యుత్ స్తంభాలకు కట్టేశారు. ఇంత జరిగినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గమనార్హం.
అధికార పార్టీ కనుసన్నల్లోనే..
కోడి పందాల బరులన్నీ స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఏర్పాటయ్యాయి. వారి సూచనల మేరకే పోలీసులు బరులకు అనుమతి ఇచి్చనట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ముందే ఎమ్మెల్యే వద్దకు వెళ్లి ముడుపుల బేరం కుదుర్చుకున్నాక పోలీసు అధికారుల వద్దకు వెళుతున్నారు. అక్కడ కూడా లంచాలు ఇచ్చాక తూతూమంత్రంగా కేసులు పెట్టేందుకు కొంతమందిని నిర్వాహకులే పోలీసులకు అప్పగిస్తున్నారు. వారిని పోలీసులు ముందే బైండోవర్ చేసి కొన్నిచోట్ల దాడి చేసి అరెస్టు చేసినట్లు చూపుతున్నారు. ఇందుకోసం స్టేషన్‌కి రూ.10 నుంచి రూ.15 లక్షలు ఇచి్చనట్లు నిర్వాహకులు చెబుతున్నారు.


