
కొట్టె బ్రదర్స్ తయారు చేసిన మినీట్రాక్టర్
సాక్షి, దామరచర్ల (మిర్యాలగూడ) : నాన్నకు ప్రేమతో ఏకంగా మినీ ట్రాక్టర్స్‌నే తయారు చేసి బహుమతిగా ఇచ్చారు కొట్టె బ్రదర్స్. తమ తండ్రి వ్యవసాయ పనుల్లో పడుతున్న కష్టాలను చూడలేక, సాగుకు అయ్యే ఖర్చును తగ్గించి, తమ తోడ్పాటును అందించేందుకు ఆరునెలలు శ్రమించి మినీ ట్రాక్టర్‌ను తయారు చేశారు. దామరచర్ల మండలం వాడపల్లికి చెందిన కొట్ట సైదులు, మంగమ్మల పెద్ద కుమారుడు ప్రవీణ్ కుమార్ హైదరాబాద్‌లో డిప్లొమా (ఈ.ఈ.ఈ)చదువుతున్నాడు. చిన్న కుమారుడు ప్రశాంత్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వీరికి గ్రామంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దుక్కిదున్నేందుకు తండ్రి ఎద్దుల అరకను వినియోగించేవాడు.
దీంతో చాలా సమయం పట్టేది. ఇంటి నుంచి మందు కట్టలు, ఇతర వ్యవసాయ సామగ్రి పొలానికి చేర్చేందుకు తల్లిదండ్రులు చాలా కష్టపడేవారు. తల్లిదండ్రుల కష్టాలను చూసిన కుమారులు వ్యవసాయ పనులకు ఉపయోగపడేలా ఏదైనా యంత్రాన్ని తయారు చేయాలనుకున్నారు. ఆరునెలల పాటు శ్రమించి మినీ ట్రాక్టర్ రూపొందించారు. తొలుత ట్రాక్టర్ ప్రధాన విడి భాగాలను సేకరించారు. అప్పీ ఆటో ఇంజన్‌ను సెకండ్‌హ్యాండ్‌లో కొనుగోలు చేశారు.
ఇంజన్ పనితీరుపై వివిధ ప్రయోగాలు చేసి, వాటిని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తరువాత ప్రధాన విడిభాగాలు బ్యాటరీ, గేర్ బాక్స్, సెల్ఫ్ బాక్స్ లాంటి వాటిని విడిగా సేకరించారు. వీటన్నింటితో మినీ ట్రాక్టర్‌ను తయారీ చేశారు. దీనిని పొలంలో దుక్కిదున్ని ట్రయల్ వేశారు. ఇది సక్సెస్ కావడంతో ట్రాక్టర్‌కు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. ఈ ట్రాక్టర్‌కు కేబీఎస్ 7.5 (కొట్టే బ్రదర్స్ 7.5) పేరును పెట్టారు. దీనికి అయిన ఖర్చు రూ.1.30లక్షలు. గ్రామస్తులు ఈ యువకుల ప్రతిభను మెచ్చుకొని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఎన్నో ప్రయోజనాలు
వీరు తయారు చేసిన మినీ ట్రాక్టర్‌కు 5లీటర్ల కెపాసిటీ గల ఇంజన్ ఉంది. ఒక లీటర్ డీజిల్‌తో ఎకరం పొలం దున్నవచ్చు. పత్తి సాగుకు గాను గుంటక, గొర్రు కొట్టవచ్చు. దీనికి ప్రత్యేకంగా çతయారు చేసిన పరికరం ద్వారా మందు పిచికారీ చేయవచ్చు, దీంతో సమయం కలిసి రావడంతో పాటు ఖర్చు కూడా గణనీయంగా తగ్గుతుందని వారు చెబుతున్నారు. ట్రాక్టర్ వెనుక భాగాన ట్రాలీ కూడా తగిలించవచ్చని, ఆరు క్వింటాళ్ల బరువు వరకు తీసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంటుందని పేర్కొన్నారు. దీనిని ఉపయోగించుకొని మినీ వాటర్ ట్యాంకర్‌ను కూడా రవాణా చేస్తున్నారు.
నాన్న పడుతున్న కష్టం చూడలేకే
వ్యవసాయ పనుల్లో నాన్న పడుతున్న కష్టం చూడలేకే ఇద్దరం కలిసి మినీ ట్రాక్టర్‌ను రూపొందించాం. దీనితో మా తల్లిదండ్రులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. భవిష్యత్‌లో రైతుల అవసరాలకు మరిన్ని ఆవిష్కరణలు చేస్తాం. – ప్రశాంత్