
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాలను నామినేషన్ల దాఖలు సమయంలో సమర్పించే ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ప్రాంతీయ అదనపు డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల ఖాతాలను తెలపకపోయినా, నకిలీ ఖాతాలతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినట్లు పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎలక్ట్రానిక్ మీడియాకు వర్తించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలు యథాతథంగా సామాజిక మాధ్యమానికీ వర్తిస్తాయన్నారు. ఎన్నికల నియమావళిపట్ల విలేకరులు, జిల్లా ప్రజా సంబంధాల అధికారులకు అవగాహన కల్పించేందుకు బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో ఎన్నికల్లో మీడియా పాత్రపై టీవీకే రెడ్డి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం విలేకరుల ప్రశ్నలకు రజత్‌కుమార్, టీవీకే రెడ్డి బదులిచ్చారు.
అలా చేస్తే కఠినచర్యలే... : సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నికల ప్రచారం కోసం అభ్యర్థులు చేసే ఖర్చును ఎన్నికల ఖర్చు కింద లెక్కిస్తామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ప్రచార సరుకు (కంటెంట్), షార్ట్ ఫిల్మ్స్ అభివృద్ధికి చేసే ఖర్చు ఎన్నికల ఖర్చు పరిధిలోకి వస్తుందన్నారు. అయితే రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చులపై పరిమితులు లేనందున, పార్టీలకు సంబంధించిన సామాజిక మాధ్యమాల ఖాతాల నిర్వహణ ఖర్చులను లెక్కలోకి తీసుకోబోమన్నారు. కానీ అభ్యర్థులతోపాటు రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వహించే ప్రచారాలకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందన్నారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తే జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
తప్పుడు, అశ్లీల, అభ్యంతరకరమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేస్తే సైబర్ క్రైం చట్టాల కింద పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ పార్టీల తరఫున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల వార్తలను కచ్చితమైన సమాచారంతో ప్రచురించేలా చూడటంలో జిల్లా పౌర సంబంధాల అధికారులు చొరవ చూపాలని సూచించారు. చెల్లింపు వార్తలపట్ల ఎన్నికల సంఘం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎన్నికల ప్రధాన అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు మజీద్, సీఈఓ కార్యాలయ జేడీ సత్యవాణి పాల్గొన్నారు.