ఎస్‌ఐ రాత పరీక్ష వాయిదా పడేనా?

SI Written Test will be postpone - Sakshi

సమయం తక్కువ ఉందంటున్న అభ్యర్థులు

వాయిదా వేయాలని కానిస్టేబుళ్లు, హోంగార్డుల వినతి

ప్రిపరేషన్‌ కోసం విధులకు గైర్హాజరవుతున్న సిబ్బంది

ఏప్రిల్‌ 1లోపు అంతా రిపోర్టు చేయాలని ఉన్నతాధికారుల ఆదేశాలు

20, 21 తేదీల్లో ఎస్‌ఐ రాత పరీక్షలు

సిబ్బంది కొరతతో సెలవుల ప్రసక్తే లేదంటున్న డీజీపీ కార్యాలయం 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఏప్రిల్‌ 20, 21 తేదీల్లో నిర్వహించబోయే సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ రాత పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటిదాకా సాధారణ నిరుద్యోగులు మాత్రమే ఈ విషయంపై పలుమార్లు డీజీపీకి వినతిపత్రాలు సమర్పించారు. ఇపుడు ఇదే విషయంపై సొంత డిపార్ట్‌మెంట్‌లోనే తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే డిపార్ట్‌మెంట్‌లో ఉన్న పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఎస్‌.ఐ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. శారీరక పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్న వీరంతా ఏప్రిల్‌ 20న నిర్వహించబోయే రాతపరీక్షలో మంచి మార్కులు సాధించి ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. కానీ ఇదే సమయంలో ఎన్నికలు రావడం, వెంటనే విధులకు రావాలని డీజీపీ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పరీక్ష రాసే అభ్యర్థులు ఆందోళనలో పడ్డారు. 

తక్కువ సమయం ఉందంటున్నా.. 
తెలంగాణలో ఎన్నికలు రావడం, ఇదే సమయంలో ఎస్‌.ఐ అభ్యర్థులకు రాతపరీక్షలు నిర్వహిస్తుండటం సమస్యకు కారణమవుతోంది. వాస్తవానికి తెలంగాణ 33 జిల్లాల్లో పలు బెటాలియన్లు, పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తోన్న హోంగార్డులు, కానిస్టేబుళ్లలో 30 ఏళ్లలోపు వారు వేలల్లో ఉన్నారు. వీరంతా ఎస్‌.ఐ ఉద్యోగానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. అసలే వారాంతపు సెలవులు కూడా దొరకని ఉద్యోగం కావడంతో పగలంతా కష్టపడి, ఏరాత్రికో ఇంటికి చేరుకుని దొరికిన సమయంలో చదువుకుంటున్నారు. అయితే, తమ భవిష్యత్తుకు ఇదే ఆఖరు అవకాశమనుకున్న ఇంకొందరు పంచాయతీ ఎన్నికల తరువాత నుంచి విధులకు హాజరుకావడం లేదు. వీరికి ఇప్పటికే ఉన్నతాధికారులు పలుమార్లు నోటీసులు పంపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరికీ సెలవులు ఇవ్వడంలేదని, సిబ్బంది తక్కువగా ఉన్న కారణంగా వెంటనే రిపోర్టు చేయాలని చెబుతున్నారు. ఇదే విషయమై వారి తల్లిదండ్రులకు ఫోన్లో కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు. ఏప్రిల్‌ 1వ తేదీలోగా విధుల్లో చేరాలంటూ వారందరికీ నోటీసుల్లో స్పష్టంచేశారు. 

సొంత డిపార్ట్‌మెంటే కరుణించకపోతే ఎలా? 
డిపార్ట్‌మెంట్‌లో చాలామంది హోంగార్డులు, కానిస్టేబుళ్లు ఈసారి ఎలాగైనా ఎస్‌.ఐ పోస్టు సాధించాలన్న కసితో చదువుతున్నారు. అలాంటిది ప్రిపరేషన్‌ కోసం సెలవులు ఇవ్వకపోతే ఎలా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పీజీలు, పీహెచ్‌డీ చేసిన వారు కూడా కానిస్టేబుళ్లు, హోంగార్డులుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగమన్న భరోసాతో జీతం తక్కువైనా పనిచేస్తున్నారు. లేకలేక వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు సొంత డిపార్ట్‌మెంట్‌ నుంచి సహకారం లేకపోవడం వారిని తీవ్ర వేదనకు గురిచేస్తోంది. మరోవైపు ఏప్రిల్‌ 14 ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌డ్‌ (ఏఆర్‌) కానిస్టేబుళ్లకు పదోన్నతికి సంబంధించిన శిక్షణ కూడా కొనసాగనుంది. ఈ నేపథ్యంలో తమకు చదువుకునేందుకు సమయం లేదని ఏప్రిల్‌ 11న ఎన్నికలు అప్పటివరకు బందోబస్తు, 14న పదోన్నతి శిక్షణ, 20, 21న ఎస్‌.ఐ రాతపరీక్షలు ఉండటంతో తమకు తక్కువ సమయం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి కూడా పరీక్షను కనీసం నెలరోజులపాటు వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. వయోపరిమితి దాటిపోతున్న నేపథ్యంలో ఎస్‌.ఐ కావాలని కలలు కంటున్న సిబ్బంది ఆకాంక్షలకు అనుగుణంగా పరీక్షను వాయిదా వేయాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డును కోరుతున్నారు. 

వాయిదాకు బోర్డు ససేమిరా.. 
ఈ నేపథ్యంలో పోలీసు నియామక బోర్డు మాత్రం పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదని తేల్చిచెబుతోంది. ఇప్పటికే శారీరక పరీక్షలను దాదాపుగా పూర్తి చేసిన బోర్డు 2.16 లక్షల మందికి ఫలితాలను ప్రకటించింది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి జాప్యం ఉండదని ఇప్పటికే పలుమార్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top