జన సేవలో..

SI john wilson and 13 dead in naxalite attacks in 1991 - Sakshi

ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న జాన్‌ విల్సన్‌

దేశంలోనే మొట్టమొదటి మందుపాతర సంఘటన

రామవరం మందు పాతర పేలుడు ఘటనకు 26 ఏళ్లు

బస్సు పేల్చివేతతో ఎస్సై, సీఐతోపాటు 13 మంది మృతి

హుస్నాబాద్‌:చట్టాన్ని పరిరక్షించడంలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించి జనం హృదయాల్లో గూడుకుట్టుకున్నాడు ఎస్సై జాన్‌ విల్సన్‌. పోలీస్‌ అధికారైనా సామాన్యుల గుండెల్లో ఆరాధ్యనీయుడిగా నిలిచాడు. నేటికీ ఆయనను స్మరించుకోని వారెవరూ లేరంటే అతియోశక్తి కాదు. నక్సలైట్ల మందుపాతరకు సీఐ యాదగిరి, ఎస్సై జాన్‌విల్సన్‌తోపాటు మరో 13 మంది అసువులుబాసి డిసెంబర్‌ 19కి 26 ఏళ్ళు నిండుతాయి. ఎస్సై జాన్‌ విల్సన్‌ తన పెళ్లి శుభలేఖలు ఇచ్చేందుకు వచ్చి 1991, డిసెంబర్‌ 19న రామవరంలో నక్సలైట్ల మందుపాతరకు బలయ్యాడు.

ఆ రోజు ఏమైందంటే..
చల్లని సాయంత్రం, చుట్టూ పచ్చని చెట్లు.. గూటికి చేరిన పక్షుల సందడి.. ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ సమయంలో ఒక్కసారిగా బాంబ్‌ బ్లాస్టింగ్‌ జరగడంతో ఆ ప్రాంతం నెత్తురోడింది. ఆ ప్రదేశం మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో భయానకంగా తయారైంది. ఈ సంఘటనలో హుస్నాబాద్‌ సీఐ యాదగిరి, ఎస్సై జాన్‌ విల్సన్‌తోపాటు 13 మంది ప్రాణాలు వదిలారు. ఓ బస్సు దహనం కేసు దర్యాప్తునకు అక్కన్నపేట మండలం రామవరానికి తెల్లవారు జామున ఇన్‌చార్జి సీఐ యాదగిరి, ఎస్సై జాన్‌ విల్సన్, సీఆర్పీఎఫ్‌ ఎస్సై కాశ్మీరీలాల్, హుజూరాబాద్‌ ఆర్టీసీ డిపో కంట్రోలర్‌ వెంకట్‌రెడ్డి, స్టేషన్‌ మేనేజర్‌ రంగనాథస్వామి, డ్రైవర్‌ ఎల్లయ్య, కండక్టర్లు దుర్గారెడ్డి, దుర్గయ్య, కానిస్టేబుళ్లు తుక్కయ్య, శంకర్, రజాక్, దేవరాజ్, రామచంద్రం, ప్రభాకర్, సీఆర్పీఎఫ్‌ జవాన్లు అబ్రహం, హోషియార్‌ సింగ్, కె. రాజన్, కేజే జోసఫ్, ఎం.ఎం. మండల, జె. రంగయ్య, గౌరవెల్లి గ్రామ సేవకులు రాజయ్య, వెంకటమల్లు, మాజీ మిలిటెంట్లు పొన్నాల ఎల్లయ్య, చౌదరి రమేష్‌తో కలిసి ఆర్టీసీ బస్‌లో వెళ్లారు. ఆర్టీసీ బస్సు దహనం కేసుకు సంబంధించి పంచనామా చేసుకొని తిరిగి వస్తుండగా రామవరం శివార్‌ బోటి వద్ద నక్సల్స్‌ మందుపాతర పేల్చారు.

ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే  మృతి చెందారు. ఇది దేశంలోనే మొదటి సారిగా అతిపెద్ద మందుపాతర ఈ ప్రాంతంలో పేల్చడం  సంచలనం సృష్టించింది. మందుపాతర పేలుడు ధాటికి బస్సు ముక్కలు, ముక్కలైంది. అందులో ప్రయాణిస్తున్న పైన పేర్కొన్న 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనకు పాల్పడినట్లు పేర్కొంటూ అప్పటి పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి ప్రసాద్, హుస్నాబాద్‌ దళ కమాండర్‌ భూపతి అలియాస్‌ కొడముంజ ఎల్లయ్య, దుస్స గౌరీశంకర్‌ అలియాస్‌ ప్రభాకర్, సుధాకర్‌తోపాటు మరో 38 మంది దళ సభ్యులు, మిలిటెంట్లపై కేసు నమోదు చేశారు.

పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు వచ్చి మృత్యువాత పడిన విల్సన్‌..
హుస్నాబాద్‌లో పీపుల్స్‌వార్‌ ప్రాబల్యం కొనసాగుతున్న సమయంలో 1990లో జాన్‌ విల్సన్‌ హుస్నాబాద్‌ ఎస్సైగా బదిలీపై వచ్చాడు. వారం రోజుల్లో పెల్లి ఉండగా, సంఘటనకు ముందు రోజు నుంచే సెలవు పెట్టాడు. పెళ్లి కార్డులు ఇచ్చేందుకు హుస్నాబాద్‌కు వచ్చాడు. అదే రోజు రాత్రి రామవరంలో బస్సు దహనం సంఘటన చోటుచేసుకుంది. పంచనామా నిర్వహించేందుకు ఇన్‌చార్జి సీఐ యాదగిరితో కలిసి జాన్‌ విల్సన్‌ వెళ్లి తిరిగి వస్తుండగా మందుపాతర పెలడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.  

జనం మనసు దోచుకున్న జాన్‌ విల్సన్‌
ఏడాదిన్నరపాటు హుస్నాబాద్‌ ఎస్సైగా పని చేసిన జాన్‌ విల్సన్‌ అతి తక్కువ కాలంలోనే పేదల పక్షపాతిగా పేరు సంపాదించుకున్నాడు. పోలీసులంటే భయపడే రోజుల్లో సామాన్యుల సాదకబాధకాలను గ్రహించి ఎంతో మంది పేదలకు సహాయ సహకారాలు అందించాడు. న్యాయం కోసం సామాన్యుడు ఠాణా మెట్లు నిర్భయంగా ఎక్కవచ్చని నిరూపించాడు. అప్పటికే జనం జాన్‌ విల్సన్‌ను గుండెల్లో పెట్టుకొన్నారు. పెళ్లితో ఓ ఇంటివాడవబోతున్నాడని, కొత్త జంటను చూడాలని జనం ఎదురుచూశారు. చివరకు ఎస్సైని  మృత్యువు మందుపాతర రూపంలో వచ్చి కానరాని లోకాలకు తీసుకెళ్లడంతో ఈ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త విని ఈ ప్రాంత ప్రజలు చలించిపోయారు. ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణించి ఇప్పటికి 26 ఏళ్లు గడిచినా పట్టణంలోని చిరువ్యాపారులు ఆయన ఫొటోను దుకాణాల్లో పెట్టుకొని కొలుస్తున్నారు. జాన్‌ విల్సన్‌ పేరిట ట్రస్టులు, బస్టాండ్లు, యూనియన్లు, స్మారక నిర్మాణాలు చేపట్టారు.  

జాన్‌ విల్సన్‌ పేరిట ట్రస్టు..
హుస్నాబాద్‌ ప్రాంత ప్రజలకు మేలు చేసిన ఎస్సై జాన్‌విల్సన్‌ పేరిట ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. ప్రతి వర్ధంతి రోజున పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంపిణీ చేస్తూ, రక్తదానం చేస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అలాగే సీఐ యాదగిరి, ఎస్సై జాన్‌ విల్సన్‌ స్మారక క్రీడా పోటీలను హుస్నాబాద్‌ యూత్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top