Naxalite attacks
-
శివ్వంపేట పేలుళ్లకు 20 ఏళ్లు
శివ్వంపేట(నర్సాపూర్)/తూప్రాన్ : నక్సలైట్ల ఘాతుకానికి పోలీసులు మృతిచెందిన సంఘటన చోటు చేసుకొని నేటికి ఇరవై ఏళ్లవుతోంది. అప్పటి సంఘటన నేటికి ఇక్కడి ప్రజల మనసుల్లో మెదులుతూనే ఉంది. ఇరవై ఏళ్ళ క్రితం శివ్వంపేట మండలంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉండేది. పోలీసులను మట్టుపెట్టాలన్న సంకల్పంతో నక్సలైట్లు భారీ వ్యూహాన్ని రచించారు. దాన్ని అమలు చేయడంతో డీఎస్పీ, సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు అసువులుబాసారు. 16 నవంబర్ 1997 సంవత్సరంలో మండల పరిధి పిల్లుట్ల గ్రామంలో అప్పటి సర్పంచ్ గోపాల్‌రెడ్డి ఇంటిని నక్సలైట్లు పేల్చివేశారు. సంఘటన స్థలానికి పోలీసులు ఎలాగైనా వస్తారనే ఉద్దేశంతో రోడ్డుపై నర్సాపూర్ దళం బాలన్న నేతృత్వంలో ప్యూహం పన్నింది. వారి వ్యూహం తెలియని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు శివ్వంపేట నుంచి పిల్లుట్లకు నడుస్తూ బయలుదేరారు. పిల్లుట్ల అటవీ ప్రాంతం నుంచి వారు నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో కల్వర్టు కింద అమర్చిన మందుపాతరలను దట్టమైన గుట్టపై కూర్చున్న నక్సల్స్ పేల్చివేశారు. 11బాంబులను అమర్చగా వాటిలో 8 బాంబులు పేలాయి. మిగతా మూడు పేలలేదు. ఈ సంఘటనలో అప్పటి తూప్రాన్ డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ వెంకటస్వామి, హెడ్‌కానిస్టేబుల్ పెంటయ్య, కానిస్టేబుళ్లు లక్ష్మణ్‌నాయక్, సుజాయత్ఆలీ, శ్రీనివాస్ మృతిచెందారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నక్సలైట్ల పన్నాగాన్ని ముందే పసిగట్టిన పోలీసులు వాహనాల్లో కాకుండా నడుస్తూ వెళ్లి కూడా బలైపోయారు. అప్పటి సంఘటనను నేటికీ మండల ప్రజలు మరిచిపోలేదు. తూప్రాన్‌లో డీఎస్పీ విగ్రహం.. డీఎస్సీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పోలీసులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన నాలుగేళ్లపాటు వారి స్మారకార్థం ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహించారు. కానీ తదనంతర కాలంలో పోలీసు ఉన్నతాధికారులు ఆ పోటీల నిర్వహణను విస్మరించారు. -
జన సేవలో..
హుస్నాబాద్:చట్టాన్ని పరిరక్షించడంలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించి జనం హృదయాల్లో గూడుకుట్టుకున్నాడు ఎస్సై జాన్ విల్సన్. పోలీస్ అధికారైనా సామాన్యుల గుండెల్లో ఆరాధ్యనీయుడిగా నిలిచాడు. నేటికీ ఆయనను స్మరించుకోని వారెవరూ లేరంటే అతియోశక్తి కాదు. నక్సలైట్ల మందుపాతరకు సీఐ యాదగిరి, ఎస్సై జాన్‌విల్సన్‌తోపాటు మరో 13 మంది అసువులుబాసి డిసెంబర్ 19కి 26 ఏళ్ళు నిండుతాయి. ఎస్సై జాన్ విల్సన్ తన పెళ్లి శుభలేఖలు ఇచ్చేందుకు వచ్చి 1991, డిసెంబర్ 19న రామవరంలో నక్సలైట్ల మందుపాతరకు బలయ్యాడు. ఆ రోజు ఏమైందంటే.. చల్లని సాయంత్రం, చుట్టూ పచ్చని చెట్లు.. గూటికి చేరిన పక్షుల సందడి.. ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ సమయంలో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్టింగ్ జరగడంతో ఆ ప్రాంతం నెత్తురోడింది. ఆ ప్రదేశం మాంసపు ముద్దలు, రక్తపు మరకలతో భయానకంగా తయారైంది. ఈ సంఘటనలో హుస్నాబాద్ సీఐ యాదగిరి, ఎస్సై జాన్ విల్సన్‌తోపాటు 13 మంది ప్రాణాలు వదిలారు. ఓ బస్సు దహనం కేసు దర్యాప్తునకు అక్కన్నపేట మండలం రామవరానికి తెల్లవారు జామున ఇన్చార్జి సీఐ యాదగిరి, ఎస్సై జాన్ విల్సన్, సీఆర్పీఎఫ్ ఎస్సై కాశ్మీరీలాల్, హుజూరాబాద్ ఆర్టీసీ డిపో కంట్రోలర్ వెంకట్‌రెడ్డి, స్టేషన్ మేనేజర్ రంగనాథస్వామి, డ్రైవర్ ఎల్లయ్య, కండక్టర్లు దుర్గారెడ్డి, దుర్గయ్య, కానిస్టేబుళ్లు తుక్కయ్య, శంకర్, రజాక్, దేవరాజ్, రామచంద్రం, ప్రభాకర్, సీఆర్పీఎఫ్ జవాన్లు అబ్రహం, హోషియార్ సింగ్, కె. రాజన్, కేజే జోసఫ్, ఎం.ఎం. మండల, జె. రంగయ్య, గౌరవెల్లి గ్రామ సేవకులు రాజయ్య, వెంకటమల్లు, మాజీ మిలిటెంట్లు పొన్నాల ఎల్లయ్య, చౌదరి రమేష్‌తో కలిసి ఆర్టీసీ బస్‌లో వెళ్లారు. ఆర్టీసీ బస్సు దహనం కేసుకు సంబంధించి పంచనామా చేసుకొని తిరిగి వస్తుండగా రామవరం శివార్ బోటి వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఇది దేశంలోనే మొదటి సారిగా అతిపెద్ద మందుపాతర ఈ ప్రాంతంలో పేల్చడం సంచలనం సృష్టించింది. మందుపాతర పేలుడు ధాటికి బస్సు ముక్కలు, ముక్కలైంది. అందులో ప్రయాణిస్తున్న పైన పేర్కొన్న 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనకు పాల్పడినట్లు పేర్కొంటూ అప్పటి పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శి ప్రసాద్, హుస్నాబాద్ దళ కమాండర్ భూపతి అలియాస్ కొడముంజ ఎల్లయ్య, దుస్స గౌరీశంకర్ అలియాస్ ప్రభాకర్, సుధాకర్‌తోపాటు మరో 38 మంది దళ సభ్యులు, మిలిటెంట్లపై కేసు నమోదు చేశారు. పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు వచ్చి మృత్యువాత పడిన విల్సన్.. హుస్నాబాద్‌లో పీపుల్స్‌వార్ ప్రాబల్యం కొనసాగుతున్న సమయంలో 1990లో జాన్ విల్సన్ హుస్నాబాద్ ఎస్సైగా బదిలీపై వచ్చాడు. వారం రోజుల్లో పెల్లి ఉండగా, సంఘటనకు ముందు రోజు నుంచే సెలవు పెట్టాడు. పెళ్లి కార్డులు ఇచ్చేందుకు హుస్నాబాద్‌కు వచ్చాడు. అదే రోజు రాత్రి రామవరంలో బస్సు దహనం సంఘటన చోటుచేసుకుంది. పంచనామా నిర్వహించేందుకు ఇన్చార్జి సీఐ యాదగిరితో కలిసి జాన్ విల్సన్ వెళ్లి తిరిగి వస్తుండగా మందుపాతర పెలడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. జనం మనసు దోచుకున్న జాన్ విల్సన్ ఏడాదిన్నరపాటు హుస్నాబాద్ ఎస్సైగా పని చేసిన జాన్ విల్సన్ అతి తక్కువ కాలంలోనే పేదల పక్షపాతిగా పేరు సంపాదించుకున్నాడు. పోలీసులంటే భయపడే రోజుల్లో సామాన్యుల సాదకబాధకాలను గ్రహించి ఎంతో మంది పేదలకు సహాయ సహకారాలు అందించాడు. న్యాయం కోసం సామాన్యుడు ఠాణా మెట్లు నిర్భయంగా ఎక్కవచ్చని నిరూపించాడు. అప్పటికే జనం జాన్ విల్సన్‌ను గుండెల్లో పెట్టుకొన్నారు. పెళ్లితో ఓ ఇంటివాడవబోతున్నాడని, కొత్త జంటను చూడాలని జనం ఎదురుచూశారు. చివరకు ఎస్సైని మృత్యువు మందుపాతర రూపంలో వచ్చి కానరాని లోకాలకు తీసుకెళ్లడంతో ఈ ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణ వార్త విని ఈ ప్రాంత ప్రజలు చలించిపోయారు. ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మరణించి ఇప్పటికి 26 ఏళ్లు గడిచినా పట్టణంలోని చిరువ్యాపారులు ఆయన ఫొటోను దుకాణాల్లో పెట్టుకొని కొలుస్తున్నారు. జాన్ విల్సన్ పేరిట ట్రస్టులు, బస్టాండ్లు, యూనియన్లు, స్మారక నిర్మాణాలు చేపట్టారు. జాన్ విల్సన్ పేరిట ట్రస్టు.. హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు మేలు చేసిన ఎస్సై జాన్‌విల్సన్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ప్రతి వర్ధంతి రోజున పోలీస్ స్టేషన్ ఆవరణలో పేదలకు దుస్తులు, రోగులకు పండ్లు పంపిణీ చేస్తూ, రక్తదానం చేస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. అలాగే సీఐ యాదగిరి, ఎస్సై జాన్ విల్సన్ స్మారక క్రీడా పోటీలను హుస్నాబాద్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. -
ఐపీఎస్ మరణిస్తే రూ.కోటి
♦ నక్సల్స్ దాడుల్లో మృతి చెందిన పోలీసులకు పరిహారం పెంపు ♦ ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు సాక్షి, హైదరాబాద్: నక్సలైట్ల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని భారీగా పెంచారు. మరణించిన వారికి, గాయపడిన వారికి, శాశ్వత వైకల్యానికి గురైన వారికి వేర్వేరుగా పరిహారాలు ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ జాబితాలో లేని హోంగార్డుల కుటుంబాలకు సైతం పరిహారాన్ని వర్తింపజేసింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి 2014 జూన్ 2 నుంచి పరిహారం పెంపు అమలవుతుందని ప్రకటించింది. పరిహారాన్ని మంజూరు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. బాధిత కుటుంబాల ఖాతాల్లో ఈ డబ్బును జమ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పరిహారం పెంపు విషయంలో నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, కె.తారకరామారావు ఆధ్వర్యంలోని మంత్రుల కమిటీ ఇచ్చిన సిఫారసులను ప్రభుత్వం యథాతథంగా ఆమోదించింది. పోలీసు అధికారులతో పాటు ఇతర విభాగాల్లోని ఉద్యోగులకు హోదాలను బట్టి గతంలో ఉన్న పరిహారం.. పెరిగిన పరిహారానికి సంబంధించిన వివరాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎస్పీ స్థాయి, ఐపీఎస్ అధికారులు చనిపోతే ప్రస్తుతం రూ.30 లక్షల పరిహారం అమల్లో ఉంది. దీన్ని రూ.కోటికి పెంచారు. శాశ్వత వైకల్యానికి గురైతే రూ.50 లక్షలు, తీవ్రంగా గాయపడితే 6 లక్షలు చెల్లించాలని నిర్ణయించింది. సీఐలు, డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, సమాన హోదా ఉన్నటువంటి ఇతర శాఖల్లోని అధికారులు మరణిస్తే రూ.50 లక్షలు, శాశ్వత వైకల్యం పొందితే రూ.30 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.5 లక్షలు చెల్లిస్తారు. హెడ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐలు, సమాన హోదా ఉన్న ఇతర విభాగాల్లోని ఉద్యోగులు చనిపోతే రూ.45 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తారు. శాశ్వత వైకల్యానికి గురైతే రూ.25 లక్షలు, గాయపడితే రూ.5 లక్షలు అందిస్తారు. పోలీస్ కానిస్టేబుళ్లకు సంబంధించిన పరిహారం పెంపుపై ప్రభుత్వం గత ఏప్రిల్‌లోనే ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కానిస్టేబుళ్లు చనిపోతే రూ.40 లక్షల పరిహారం అమల్లో ఉంది. ఇది యథాతథంగా కొనసాగనుంది. శాశ్వత వైకల్యానికి గురైనా, తీవ్రంగా గాయపడినా హెడ్ కానిస్టేబుళ్ల స్థాయికిచ్చే పరిహారం వర్తిస్తుందని ఈ జీవోలో స్పష్టం చేసింది. హోంగార్డులు చనిపోతే రూ.30 లక్షలు, వైకల్యానికి గురైతే రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షలు అందిస్తారు. తీవ్రవాద దాడుల్లో సాధారణ పౌరులు చనిపోతే సంబంధిత కుటుంబాలకు రూ.25 లక్షలు చెల్లిస్తారు. వైకల్యానికి గురైతే రూ.20 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.3 లక్షల పరిహారం ఇస్తారు. -
నక్సల్ బాధిత పోలీసు కుటుంబాలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: నక్సలైట్ల దాడుల్లో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు రాష్ట్రంలో ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నక్సలైట్ బాధిత కుటుంబాల పునరావాస చర్యలపై ఉపసంఘం సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, పోలీసు ఉన్నతాధికారులు బుధవారం సచివాలయంలో సమావేశమై సమీక్షించారు. నక్సలైట్ దాడుల్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలుగా పాస్‌లను మంజూరు చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నక్సల్స్ దాడుల్లో మృతి చెందిన పోలీసు కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు. అయితే ఆయా కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగానికి 18 సంవత్సరాలు దాటిన అర్హులు లేకపోతే ఆ కుటుంబ పోషణ కష్టంగా ఉంటుందనే నేపథ్యంలో అలాంటి కుటుంబాలకు ప్రతినెలా పెన్షన్ మంజూరు చేయాలని మరో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా నక్సలైట్ దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అనారోగ్యం పేరుతో విక్రయించుకోవడానికి అనుమతించరాదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాంటి వారికి సీఎం సహాయ నిధినుంచి సాయమందించే ఏర్పాటు చేస్తారు. విశాఖ జిల్లా చింతపల్లిలో మంత్రి బాలరాజు ఇంటిని నక్సలైట్లు ధ్వంసం చేసిన నేపథ్యంలో విశాఖపట్టణంలో ఆయన భార్యకు 500 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న అటవీ రేంజ్ అధికారిని స్థానికులు హతమార్చడంతో ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.