
నక్సలైట్లు మందుపాతరను పేల్చింది ఈ గుట్ట పైనుంచే!
శివ్వంపేట(నర్సాపూర్)/తూప్రాన్ : నక్సలైట్ల ఘాతుకానికి పోలీసులు మృతిచెందిన సంఘటన చోటు చేసుకొని నేటికి ఇరవై ఏళ్లవుతోంది. అప్పటి సంఘటన నేటికి ఇక్కడి ప్రజల మనసుల్లో మెదులుతూనే ఉంది. ఇరవై ఏళ్ళ క్రితం శివ్వంపేట మండలంలో నక్సలైట్ల ప్రభావం అధికంగా ఉండేది. పోలీసులను మట్టుపెట్టాలన్న సంకల్పంతో నక్సలైట్లు భారీ వ్యూహాన్ని రచించారు. దాన్ని అమలు చేయడంతో డీఎస్పీ, సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లు అసువులుబాసారు. 16 నవంబర్ 1997 సంవత్సరంలో మండల పరిధి పిల్లుట్ల గ్రామంలో అప్పటి సర్పంచ్ గోపాల్‌రెడ్డి ఇంటిని నక్సలైట్లు పేల్చివేశారు. సంఘటన స్థలానికి పోలీసులు ఎలాగైనా వస్తారనే ఉద్దేశంతో రోడ్డుపై నర్సాపూర్ దళం బాలన్న నేతృత్వంలో ప్యూహం పన్నింది. వారి వ్యూహం తెలియని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు శివ్వంపేట నుంచి పిల్లుట్లకు నడుస్తూ బయలుదేరారు.
పిల్లుట్ల అటవీ ప్రాంతం నుంచి వారు నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో కల్వర్టు కింద అమర్చిన మందుపాతరలను దట్టమైన గుట్టపై కూర్చున్న నక్సల్స్ పేల్చివేశారు. 11బాంబులను అమర్చగా వాటిలో 8 బాంబులు పేలాయి. మిగతా మూడు పేలలేదు. ఈ సంఘటనలో అప్పటి తూప్రాన్ డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ వెంకటస్వామి, హెడ్‌కానిస్టేబుల్ పెంటయ్య, కానిస్టేబుళ్లు లక్ష్మణ్‌నాయక్, సుజాయత్‌ఆలీ, శ్రీనివాస్ మృతిచెందారు. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. నక్సలైట్ల పన్నాగాన్ని ముందే పసిగట్టిన పోలీసులు వాహనాల్లో కాకుండా నడుస్తూ వెళ్లి కూడా బలైపోయారు. అప్పటి సంఘటనను నేటికీ మండల ప్రజలు మరిచిపోలేదు.
తూప్రాన్‌లో డీఎస్పీ విగ్రహం..
డీఎస్సీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పోలీసులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటన జరిగిన నాలుగేళ్లపాటు వారి స్మారకార్థం ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహించారు. కానీ తదనంతర కాలంలో పోలీసు ఉన్నతాధికారులు ఆ పోటీల నిర్వహణను విస్మరించారు.