నక్సలైట్ల దాడుల్లో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు రాష్ట్రంలో ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: నక్సలైట్ల దాడుల్లో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు రాష్ట్రంలో ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. నక్సలైట్ బాధిత కుటుంబాల పునరావాస చర్యలపై ఉపసంఘం సభ్యులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణ, పోలీసు ఉన్నతాధికారులు బుధవారం సచివాలయంలో సమావేశమై సమీక్షించారు. నక్సలైట్ దాడుల్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలుగా పాస్‌లను మంజూరు చేసేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నక్సల్స్ దాడుల్లో మృతి చెందిన పోలీసు కుటుంబంలోని ఒకరికి కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నారు.
అయితే ఆయా కుటుంబాల్లో ప్రభుత్వ ఉద్యోగానికి 18 సంవత్సరాలు దాటిన అర్హులు లేకపోతే ఆ కుటుంబ పోషణ కష్టంగా ఉంటుందనే నేపథ్యంలో అలాంటి కుటుంబాలకు ప్రతినెలా పెన్షన్ మంజూరు చేయాలని మరో నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా నక్సలైట్ దాడుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించిన భూమిని అనారోగ్యం పేరుతో విక్రయించుకోవడానికి అనుమతించరాదని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాంటి వారికి సీఎం సహాయ నిధినుంచి సాయమందించే ఏర్పాటు చేస్తారు. విశాఖ జిల్లా చింతపల్లిలో మంత్రి బాలరాజు ఇంటిని నక్సలైట్లు ధ్వంసం చేసిన నేపథ్యంలో విశాఖపట్టణంలో ఆయన భార్యకు 500 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న అటవీ రేంజ్ అధికారిని స్థానికులు హతమార్చడంతో ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.