వాటర్‌షెడ్ పనులు పూర్తిచేయాలి


చేవెళ్ల: వాటర్‌షెడ్ ద్వారా 2013-14 సంవత్సరానికి నిర్దేశించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని చేవెళ్ల క్లస్టర్ వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి ప్రజ్ఞ సూచించారు. మండల కేంద్రంలోని నీటియాజమాన్య సంస్థ కార్యాలయంలో సోమవారం చేవెళ్ల, షాబాద్, పూడూరు మండలాల పరిధిలోని వాటర్‌షెడ్ టెక్నికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.



వాటర్‌షెడ్ పనుల పురోగతిపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా  ప్రజ్ఞ మాట్లాడుతూ చేవెళ్ల క్లస్టర్‌లోని ఐదు వాటర్‌షెడ్ గ్రామాలలో 250 ఎకరాలలో పండ్లతోటలను పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినా ఇప్పటికి కేవలం 40 ఎకరాలలో మాత్రమే పూర్తిచేయగలిగామని తెలిపారు. కూలీల కొరత, రైతులు ముందుకు రాకపోవడం తదితర కారణాలతో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ఆమె ఆదేశించారు.  గత 2013-14 వాటర్‌షెడ్ ద్వారా చేయాల్సిన పనుల సమయం ఈ నెలాఖరు వరకే ఉన్నదని, వచ్చే నెల కొత్త సంవత్సరం, కొత్త లక్ష్యాలు ఉంటాయని వివరించారు.



వాటర్‌షెడ్ గ్రామాలలో సోలార్ వీధి దీపాలు, వాటర్‌ప్ల్లాంటు ఏర్పాటు, పాఠశాలల్లో బెంచీల సౌకర్యం, మినీవాటర్ ట్యాంకుల నిర్మాణానికి ప్రభుత్వం 80శాతం నిధులను సమకూరుస్తుందని, మిగతా 20 శాతం నిధులను గ్రామస్తులు కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లిలో సోలార్ వీధిదీపాల ఏర్పాటు పూర్తి కావచ్చిందని, త్వరలోనే వీటిని ప్రారంభిస్తామని చెప్పారు. వాటర్‌షెడ్ పనులు చేయడానికి  కూలీల కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయని టెక్నికల్ అసిస్టెంట్లు పీఓ దృష్టికి తీసుకువచ్చారు.  కార్యక్రమంలో క్లస్టర్ జేఈలు వెంకటేశ్వర్‌రెడ్డి, రాంచంద్రన్, పలు మండలాల టెక్నికల్ అధికారులు, అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top