నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత

Shortage Of Engineers In Irrigation Department Nizamabad - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): చిన్న తరహా నీటిపారుదల శాఖ లో ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. ఖాళీ అయిన పోస్టులలో ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఇన్‌చార్జులతోనే శాఖలోని పనులను అధికారులు నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్‌ కాకతీయ పథకం పనులకు తీరని ఆటంకం కలుగుతోంది. క్షేత్ర స్థాయిలో పని చేయడానికి ఒక్కో మండలానికి ఒక ఏఈ ఖచ్చితంగా అవసరం. కొత్త మండలాల వారీగా కాకపోయినా పాత మండలాల వారిగానైనా ఏఈలు ఉండాల్సి ఉంది. అయితే పోస్టులు భర్తీ కాలేక పోయాయి. పదవీ విరమణ చేసిన అధికారుల స్థానంలో కొత్తగా ఉద్యోగులను నియమించకపోవడంతో ఖాళీలు పేరుకు పోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నీటిపారుదల శాఖను పాలించే ఎస్‌ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఎస్‌ఈగా పని చేసిన దామోదర్‌ మాల్‌ ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. దీంతో నిర్మల్‌ జిల్లా ఎస్‌ఈగా పని చేస్తున్న మురళీధర్‌కు ఇక్కడ పదవీ బాధ్యతలను అదనంగా అప్పగించారు.

రెండు జిల్లాల బాధ్యతలను ఒక్క అధికారే పర్యవేక్షించాల్సి ఉంది. బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి రెగ్యులర్‌ ఏఈ ఒక్క కమ్మర్‌పల్లి మండలానికి మాత్రమే ఉన్నారు. మోర్తాడ్‌లో పదవీ విరమణ పొందిన ఏఈ గంగాధర్‌ను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఏర్గట్ల, భీమ్‌గల్, బాల్కొండ మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండల బాధ్యతలను మోర్తాడ్‌ బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారే పరిశీలించాల్సి వస్తోంది. ఆర్మూర్‌ నియోజకవర్గంలో మాక్లూర్, ఆర్మూర్‌లకు మాత్రమే ఏఈలు ఉన్నారు. నందిపేట్‌ మండలంలోని పోస్టు ఖాళీగానే ఉంది. ఆర్మూర్‌ ఏఈ నందిపేట్‌ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

నందిపేట్‌ మండలం భౌగోళికంగా చాలా పెద్దదిగా ఉండగా ఒకే అధికారి రెండు మండలాల బాధ్యతలను నిర్వహించడం కష్టంగానే ఉంది. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలో డిచ్‌పల్లి, సిరికొండ మండలాల్లోనే ఏఈలు ఉన్నారు. ధర్పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్‌ రూరల్, మోపాల్‌ మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న ఇద్దరు ఏఈలకు అదనపు బాధ్యతలను అప్పగించారు. నిజామాబాద్‌ అర్బన్‌కు సంబంధించి ఒక్కరే ఏఈ ఉన్నారు. ఇక్కడ సౌత్, నార్త్, సెంట్రల్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కరే అధికారి అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోంది. ఒక్క బోధన్‌ డివిజన్‌లో మాత్రం ఏఈ పోస్టుల్లో రెగ్యులర్‌ ఇంజినీర్లు ఉన్నారు. మిషన్‌ కాకతీయకు కీలకమైన నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత ఉండటంతో చెరువుల పునరుద్ధరణ పనులు అటకెక్కాయి. రెండు, మూడు విడతల పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఖాళీ పోస్టుల కారణంగా చెరువుల పునరుద్ధరణ ఆశించినంత మేర వేగంగా సాగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.

ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. మిషన్‌ కాకతీయ పథకం పనులు పూర్తి కావాలంటే ఏఈలు ఎంతో అవసరం. ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటు గ్రామాల్లో చెరువులు అభివృద్ధి చెందుతాయి. జిల్లా పరిషత్‌ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యను విన్నవిస్తాం. ఖాళీ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఉద్యమిస్తాం. – గుల్లె రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు, ఏర్గట్ల 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top