నిలకడగా చిన్నారుల ఆరోగ్యం 

Shine Hospital Children Health Is Good In Hyderabad - Sakshi

పరారీలో ఆస్పత్రి యాజమాన్యం 

కొనసాగుతున్న విచారణ 

సాక్షి, హైదరాబాద్‌: షైన్‌ ఆస్పత్రి అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయా ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. అగ్ని ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గాయపడిన చిన్నారుల వైద్య ఖర్చులు భరిస్తామని ప్రకటించిన షైన్‌ ఆస్పత్రి యాజమాన్యం ఇప్పుడు ముఖం చాటేసింది. ఆస్పతి ఘటనపై ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్‌ రవీంద్ర నాయక్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. పోలీసులకు సైతం ఆస్పత్రి యాజమాన్యం అందుబాటులోకి రానట్లు తెలుస్తోంది. ఆస్పత్రి ఎండీ సునీల్‌ కుమార్‌ రెడ్డి కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  

వివిధ ఆస్పత్రుల్లో చిన్నారులకు చికిత్స 
ప్రమాద సమయంలో వివిధ ఆస్పత్రిలకు తరలిం చిన చిన్నారులంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన గిరి, మమతల కుమారుడు అవినాష్‌ ఉప్పల్‌లోని శ్రీధ ఆస్పత్రికి తర లించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

బాలల హక్కుల కమిషన్‌ విచారణ 
అగ్నిప్రమాద ఘటనలో చిన్నారి మృతిచెందడాన్ని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. కమిషన్‌ సభ్యులు పొనుగోటి అంజన్‌రావ్,అపర్ణ, బృందాకర్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం మంగళవారం ఆస్పత్రిని సందర్శించి విచారించారు. అన్ని విభాగాల నుంచి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని సభ్యులు తెలిపారు.  

ఆస్పత్రిని సందర్శించిన అదనపు డైరెక్టర్‌  
వైద్య ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్‌ రవీంద్ర నాయక్‌ మంగళవారం షైన్‌ ఆస్పత్రిని సందర్శించారు. దుర్ఘటనపై ఆస్పత్రి వర్గాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షైన్‌ ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. తనతో పాటు రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మిని కమిటీలో ఉన్నారన్నారు. ఘటనా స్థలికి వచ్చి పరిశీలించి ప్రాథమికంగా ఒక రిపోర్టు అందజేయనున్నట్లు చెప్పారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top