
'విద్యుత్ ఛార్జీలు ప్రజలు భరించలేరు'
తెలంగాణ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేయడం తగదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం వేయడం తగదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... యూపీఏ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి రూ. 7800 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని సీఎం కేసీఆర్ ఎందుకు మోపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎందుకు దివాళ తీస్తుందో వివరించాలన్నారు.
గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒకే సారి విద్యుత్ ఛార్జీలు పెరిగాయని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోని వచ్చిన 8 నెలలకే విద్యుత్ ఛార్జీలు పెంచడంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును ప్రజలు భరించలేరన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని షబ్బీర్ అలీ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తమ పార్టీ ఉద్యమం చేస్తుందని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు.