అడ్మిన్‌.. తస్మాత్‌ జాగ్రత్త!

Serious Action Will Be Taken For Sharing Fake Corona News In Whatsapp - Sakshi

కరోనాపై వాట్సాప్‌లో తప్పుడు సమాచారమిస్తే వారిదే బాధ్యత

వదంతుల వ్యాప్తిపై విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు

సమాచార మాధ్యమాలకు మార్గదర్శకాలు జారీ చేసిన ఐటీ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని ఇతరులతో పంచుకో వడంలో బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ డిజిటల్‌ మీడియా విభాగం హెచ్చరించింది. సమాచార ప్రామాణికతను తెలుసుకోకుండా ఇతరులకు పంపవద్దని స్పష్టం చేసింది. వాట్సాప్‌ వేదికల్లో గ్రూపు సభ్యులు తప్పుడు సమాచారం పంపిస్తే అడ్మిన్‌ బాధ్యులవుతారని హెచ్చరించింది. ఈ మేరకు ఐటీ శాఖ డిజిటల్‌ మీడియా డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను సోమవారం విడుదల చేశారు. నిబంధనలు అతిక్రమించే వారు చట్టపరంగా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఆయా మాధ్యమాల దుర్వినియోగం వల్ల కలిగే పరిణామాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కలిగించాలన్నారు.

• కరోనాపై అవగాహన పెంచడంలో సంప్రదాయ స మాచార, వార్తా సంస్థలతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, వాట్సాప్, షేర్‌చాట్, టిక్‌టాక్‌ వంటి అనేక సామజిక మాధ్యమాలు, వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్స్‌ వంటి డిజిటల్‌ మాధ్యమాలు ఉపయోగపడుతున్నాయి. అయితే అవగాహన లోపం, ఆకతాయితనంతో కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారు. దీనిని ఇన్‌ఫోడెమిక్‌గా ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. 
• కరోనా బారిన పడిన వ్యక్తుల వి వరాల గోప్యతను ఉల్లంఘిస్తే శిక్షార్హులవుతారు. వారికి విపత్తు నిర్వహణ చట్టం–2005 లోని 54వ సెక్షన్‌ కింద ఏడాది జైలు శిక్ష, జరిమానా, ఐపీసీ సెక్షన్‌ 505 ప్రకారం కూడా శిక్ష పడుతుంది.
• కరోనా సమాచారాన్ని అధికారులతో ధుృవీకరించుకోకుండా సామాజిక మాధ్యమాలు, పత్రికల్లో వదంతులు వ్యాపింపజేస్తే అంటువ్యాధుల చట్టం–1897 కింద తెలంగాణ అంటువ్యాధులు (కోవిడ్‌–19) నిబంధనల్లోని 10వ సెక్షన్‌ ప్రకారం శిక్షార్హులవుతారు.
• కొన్ని యూట్యూబ్‌ చానెళ్లు  వార్తలను థంబ్‌ నెయిల్స్‌తో పోస్ట్‌ చేస్తున్నాయి. వార్తకు, సమాచారానికి సంబంధం లేని ఈ థంబ్‌ నెయిల్స్‌ వీక్షకుడిని తప్పుదోవ పట్టించడమే కాకుండా, సమాచారా న్నీ కలుషితం చేస్తున్నాయి. ఇటువంటి వాటిపై డిజి టల్‌ మీడియా విభాగం చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి వార్తలు, వీడియోలను పోస్టు చేస్తున్న ఆన్‌లైన్‌ న్యూస్‌ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానెళ్లకు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిలిపివేస్తారు. తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడే చానెళ్లను, సామాజిక మాధ్యమ సంస్థలను తొలగిస్తారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top