ఏకరీతిగా విత్తన నాణ్యత 

Seed quality as uniform - Sakshi

అంతర్జాతీయ విత్తన సదస్సు కార్యక్రమాలు ఖరారు 

జర్మనీలో ‘ఇస్టా’ కార్యనిర్వాహక కమిటీ సమావేశం 

హాజరైన తెలంగాణ విత్తన ధ్రువీకరణ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు 

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ విత్తన నాణ్యత ప్రమాణాలపై జర్మనీలో ఇంటర్నేషనల్‌ సీడ్‌ టెస్టింగ్‌ అసోసియేషన్‌ (ఇస్టా) కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. ఫిబ్రవరి 8 నుంచి 16 వరకు జర్మనీలోని ప్రీసింగ్‌లో జరిగిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో ఇస్టా గవర్నింగ్‌ బోర్డ్‌ మెంబర్, తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు హాజరయ్యారు. ఈ సమావేశంలో విత్తన పరీక్ష పద్ధతులు, ప్రమాణాలపై చర్చించారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన విత్తన నాణ్యత ప్రమాణాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. దీనివల్ల అంతర్జాతీయ స్థాయిలో విత్తన ఎగుమతులకు అవకాశం ఉం టుందని సమావేశం అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో జూన్‌లో జరగబోయే అంతర్జాతీయ విత్తన సదస్సు కార్యక్రమాలను కార్యనిర్వాహక కమిటీ ఖరారు చేసింది.

ఈ సదస్సు నిర్వహణకు సంబంధించి జూన్‌ 20న ఇస్టా కార్యనిర్వాహక కమిటీ రానుంది. జూన్‌ 23న ముఖ్యమంత్రి కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రిని ఈ కమిటీ సభ్యులు కలవనున్నారు. జూలై 3 వరకు పలు సమావేశాలను నిర్వ హించాలని కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. జూన్‌ 22 నుంచి 25 వరకు హైదరాబాద్‌లో ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేశవులు తెలిపారు. ఆసియా ఖండంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఈ సదస్సు జరగనున్నందున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించినట్లు కేశవులు తెలిపారు. ఐరాసకు చెందిన ఎఫ్‌ఏవో విత్తన ప్రముఖులతో సమావేశం, ఆసియా–ఆఫ్రికా దేశాల మధ్య సౌత్‌–సౌత్‌ కోఆపరేషన్‌ కింద పరస్పర విత్తన సాంకేతిక పరిజ్ఞాన సహకారం, విత్తన ఎగుమతులు, దిగుమతులు, మార్కెటింగ్‌ అనుసంధానం కోసం వర్క్‌షాప్‌ నిర్వహించనున్నారు.

కార్యనిర్వాహక సమావేశంలో 2019–25 సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళికతో పాటు దేశాల మధ్య విత్తన ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించి, విత్తన వాణిజ్యాన్ని పెంపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఒకేరకమైన విత్తన నాణ్యత ప్రమాణాలు ఉండాలని నిర్ణయించారు. విత్తన ఎగుమతులు చేసేటప్పుడు లేబిలింగ్‌ సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలి? విత్తన పాకెట్‌పై ఉండే లేబుల్‌పై బార్‌కోడెడ్‌ పద్ధతి ద్వారా ఏయే విత్తన ప్రమాణాలు అందులో ఉంచాలనే అంశంపై కూడా చర్చ జరిపారు. సమావేశంలో ఇస్టా అధ్యక్షుడు క్రేగ్‌ మెక్‌గిల్‌ (న్యూజిలాండ్‌), ఉపాధ్యక్షుడు స్టీవ్‌ జోన్స్‌ (కెనడా), జోయెల్‌ లెచపే (ఫ్రాన్స్‌), ఇగ్నాషియో అరన్‌సింగా(అర్జెంటీనా), కున్సోత్‌ కేశవులు (ఇండియా) తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top