దరఖాస్తుల వెల్లువ

SC Corporation Loans Online Date Extended Adilabad - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు అంతంత మాత్రంగానే జారీ కావడంతో స్వయం ఉపాధిపై యువత మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వివిధ కార్పొరేషన్ల రాయితీ రుణాల కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ రాయితీ రుణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొదటగా ఈ నెల 7 వరకు ముగిసిన గడువును రెండవసారి 10వ తేదీకి పెంచారు. అనంతరం నవంబర్‌ 2 వరకు ప్రభుత్వం గడువును పొడిగించింది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే జిల్లాలోని 18 మండలాలకు కేటాయించిన రుణ యూనిట్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. సమాజంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఎస్సీలకు రాయితీ రుణాలను అందించడానికి ప్రతి ఏటా ప్రభుత్వం రుణ ప్రణాళిక విడుదల చేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక విడుదల చేసి వాటికి కావాల్సిన బడ్జెట్‌ను కూడా తయారు చేసింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి అర్హత గల ఎస్సీ లబ్ధిదారుల నుంచి ఆగస్టులో దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.

జీవనోపాధికే ప్రాధాన్యం.. 
దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించడానికి రాయితీ యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. యూనిట్ల విలువలను బట్టీ రాయితీ కల్పిస్తోంది. రూ.50వేలు విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ, రూ.లక్ష విలువైన యూనిట్‌కు 80 శాతం, రూ.2లక్షలకు 70 శాతం, రూ.3లక్షలకు 60 శాతం, రూ.5 లక్షలకు 50 శాతం రాయితీని అందిస్తోంది. కిరాణం, మొబైల్‌ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, వీడియో, ఫొటోగ్రఫీ, చెప్పుల దుకాణం, ఫ్యాన్సీ, గాజుల వ్యాపారం, కొబ్బరి బోండాలు, చికెన్, మటన్‌ దుకాణం, సప్లయ్‌ సామగ్రి, పాన్‌షాప్, ఆటో మొబైల్, మెడికల్‌ షాపు, హోటల్, పాల వ్యాపారం, ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకం, పండ్ల వ్యాపారం, మెకానిక్‌ తదితర యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ రుణాలు ఇస్తోంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాటికి కూడా రాయితీలను అందిస్తారు
 
యూనిట్ల మార్పునకు అవకాశం
ముందుగా దరఖాస్తు చేసిన దానిలో నమోదు చేసిన యూనిట్‌ మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా ఎంపీడీవోల దగ్గర లాగిన్‌లో మార్చుకోవడానికి అవకాశం ఉండదు. దరఖాస్తు దారులు సమీపంలోని మీ సేవ కేంద్రాల ద్వారా మార్చుకోవచ్చు. ఈ అవకాశం కూడా వచ్చే నెల 2వ తేదీ ఉంది. 

యూనిట్లు.. బడ్జెట్‌
జిల్లాలోని 18 మండలాలకు స్వయం ఉపాధి రుణాల అందించేందుకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయా మండలాలకు 631 యూనిట్లను కేటాయించారు. వీటికి రూ.19 కోట్ల 40లక్షల 44వేలు అంచనా వేశారు. వీటిలో రూ.50వేలలోపు 276 యూనిట్లు కాగా వీటికి 3.80లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.లక్షలోపు 117 యూనిట్లు ఉండగా 11.70 లక్షలు, రూ.2లక్షల 86 యూనిట్లు ఉండగా దీనికి రూ.17.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.7లక్షల యూనిట్లు 34 ఉండగా రూ.23.80 లక్షలు కేటాయించారు.

రూ.12లక్షల యూనిట్లు 13 ఉండగా రూ.15.60 లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.25లక్షల యూనిట్లు 9 ఉండగా రూ.22.50 లక్షలు, రూ.50లక్షల యూనిట్లు 5 ఉండగా రూ. 25లక్షలు అందజేయనున్నారు. ఓనర్‌ కం డ్రైవర్‌ 28 యూనిట్లు ఉండగా రూ.22.40 లక్షలు ఖర్చు చేయనున్నారు. టూ విల్లర్‌ 18 యూనిట్లు ఉండగా రూ.18 లక్షలు ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ అనుబంధ యూనిట్లు 38 ఉండగా వీరికి రూ.15.20 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం 6,740 దరఖాస్తులు వచ్చిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
 
అర్హులు దరఖాస్తు     చేసుకోవాలి..
ఎస్సీ రాయితీ రుణాల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నాం. వారికి అనువుగా ఉన్న యూనిట్లను ఎంపిక చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది వరకే దరఖాస్తు చేసిన వారు తమ యూనిట్లను, ఇతర వాటిని మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశాన్ని ప్రభుత్వం అనుమతినిచ్చింది. – శంకర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, ఆదిలాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top