breaking news
Loans Corporation
-
దరఖాస్తుల వెల్లువ
ఆదిలాబాద్‌రూరల్: వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు అంతంత మాత్రంగానే జారీ కావడంతో స్వయం ఉపాధిపై యువత మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా వివిధ కార్పొరేషన్ల రాయితీ రుణాల కోసం భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎస్సీ కార్పొరేషన్ రాయితీ రుణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొదటగా ఈ నెల 7 వరకు ముగిసిన గడువును రెండవసారి 10వ తేదీకి పెంచారు. అనంతరం నవంబర్ 2 వరకు ప్రభుత్వం గడువును పొడిగించింది. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని 18 మండలాలకు కేటాయించిన రుణ యూనిట్లకు వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. సమాజంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న ఎస్సీలకు రాయితీ రుణాలను అందించడానికి ప్రతి ఏటా ప్రభుత్వం రుణ ప్రణాళిక విడుదల చేస్తోంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రుణ ప్రణాళిక విడుదల చేసి వాటికి కావాల్సిన బడ్జెట్‌ను కూడా తయారు చేసింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి అర్హత గల ఎస్సీ లబ్ధిదారుల నుంచి ఆగస్టులో దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. జీవనోపాధికే ప్రాధాన్యం.. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించడానికి రాయితీ యూనిట్లను ప్రభుత్వం అందిస్తోంది. యూనిట్ల విలువలను బట్టీ రాయితీ కల్పిస్తోంది. రూ.50వేలు విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ, రూ.లక్ష విలువైన యూనిట్‌కు 80 శాతం, రూ.2లక్షలకు 70 శాతం, రూ.3లక్షలకు 60 శాతం, రూ.5 లక్షలకు 50 శాతం రాయితీని అందిస్తోంది. కిరాణం, మొబైల్ దుకాణాలు, కూరగాయల వ్యాపారం, వీడియో, ఫొటోగ్రఫీ, చెప్పుల దుకాణం, ఫ్యాన్సీ, గాజుల వ్యాపారం, కొబ్బరి బోండాలు, చికెన్, మటన్ దుకాణం, సప్లయ్ సామగ్రి, పాన్‌షాప్, ఆటో మొబైల్, మెడికల్ షాపు, హోటల్, పాల వ్యాపారం, ఆవులు, గేదెలు, గొర్రెలు, కోళ్లు, చేపల పెంపకం, పండ్ల వ్యాపారం, మెకానిక్ తదితర యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీ రుణాలు ఇస్తోంది. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు, తదితర వాటికి కూడా రాయితీలను అందిస్తారు యూనిట్ల మార్పునకు అవకాశం ముందుగా దరఖాస్తు చేసిన దానిలో నమోదు చేసిన యూనిట్ మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఎన్నికల దృష్ట్యా ఎంపీడీవోల దగ్గర లాగిన్‌లో మార్చుకోవడానికి అవకాశం ఉండదు. దరఖాస్తు దారులు సమీపంలోని మీ సేవ కేంద్రాల ద్వారా మార్చుకోవచ్చు. ఈ అవకాశం కూడా వచ్చే నెల 2వ తేదీ ఉంది. యూనిట్లు.. బడ్జెట్ జిల్లాలోని 18 మండలాలకు స్వయం ఉపాధి రుణాల అందించేందుకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆయా మండలాలకు 631 యూనిట్లను కేటాయించారు. వీటికి రూ.19 కోట్ల 40లక్షల 44వేలు అంచనా వేశారు. వీటిలో రూ.50వేలలోపు 276 యూనిట్లు కాగా వీటికి 3.80లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.లక్షలోపు 117 యూనిట్లు ఉండగా 11.70 లక్షలు, రూ.2లక్షల 86 యూనిట్లు ఉండగా దీనికి రూ.17.20 లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.7లక్షల యూనిట్లు 34 ఉండగా రూ.23.80 లక్షలు కేటాయించారు. రూ.12లక్షల యూనిట్లు 13 ఉండగా రూ.15.60 లక్షలు ఖర్చు చేయనున్నారు. రూ.25లక్షల యూనిట్లు 9 ఉండగా రూ.22.50 లక్షలు, రూ.50లక్షల యూనిట్లు 5 ఉండగా రూ. 25లక్షలు అందజేయనున్నారు. ఓనర్ కం డ్రైవర్ 28 యూనిట్లు ఉండగా రూ.22.40 లక్షలు ఖర్చు చేయనున్నారు. టూ విల్లర్ 18 యూనిట్లు ఉండగా రూ.18 లక్షలు ఖర్చు చేయనున్నారు. వ్యవసాయ అనుబంధ యూనిట్లు 38 ఉండగా వీరికి రూ.15.20 లక్షలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. కానీ ఇప్పటి వరకు వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం 6,740 దరఖాస్తులు వచ్చిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అర్హులు దరఖాస్తు చేసుకోవాలి.. ఎస్సీ రాయితీ రుణాల కోసం అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తున్నాం. వారికి అనువుగా ఉన్న యూనిట్లను ఎంపిక చేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇది వరకే దరఖాస్తు చేసిన వారు తమ యూనిట్లను, ఇతర వాటిని మార్పులు, చేర్పులు చేసుకోవడానికి అవకాశాన్ని ప్రభుత్వం అనుమతినిచ్చింది. – శంకర్, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, ఆదిలాబాద్ -
నయవంచన
కాపులకు బాబు ‘మార్క్’ మోసం కాపు సంక్షేమ నిధి కింద జిల్లాకు రూ.7.38 కోట్లు మాత్రమే విడుదల దరఖాస్తుదారులందరికీ రుణాలిస్తామని ప్రభుత్వం హామీ ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల దాకా ఇస్తామని ప్రకటన ఇప్పుడిస్తోంది రూ.30 వేలు మాత్రమే మండిపడుతున్న కాపు సంక్షేమ సంఘాలు (సాక్షి ప్రతినిధి, అనంతపురం) రాయల్ మురళీ కాపు సంక్షేమ కార్పొరేషన్ డెరైక్టర్. ఈయన పంచాయతీ అనంతపురం రూరల్ మండలంలోని నారాయణపురం. కార్పొరేషన్ రుణాల కోసం ఇక్కడొచ్చిన దరఖాస్తులు 379. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.500 వసూలు చేశారు. అంటే 379 మంది నుంచి రూ.1,89,500 రాబట్టారు. ఇక్కడ ఆరుగురికి రూ.30 వేల చొప్పున రుణాలు మంజూరయ్యాయి. అంటే ఆరుగురికి కలిసి ప్రభుత్వమిచ్చేది రూ.1.80 లక్షలు. ఈ ఒక్క ఉదాహరణ చాలు దరఖాస్తు ఫీజు కింద వసూలు చేసిన మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి. ‘నోరు ఒకటి చెబుతుంది...చెయ్యి మరొకటి చేస్తుంది.. దేనిదోవ దానిదే’ అన్నట్లుంది ప్రభుత్వ తీరు. కాపులను బీసీల్లో చేరుస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజర్వేషన్ అంశాన్ని పక్కనపెట్టి.. కాపు సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. దీని ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ రుణాలు ఇస్తామని ప్రకటించింది. దీనిపై సంతృప్తి చెందని కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష చేశారు. ఈ దీక్ష సమయంలో కాపు సంక్షేమ నిధికి ఏటా రూ.500 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు మాత్రం చిల్లర విదిల్చి చే తులు దులిపేసుకుంది. ఇదీ ‘అనంత’ లెక్క జిల్లా వ్యాప్తంగా 17,749 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 2,462 మందికి రుణాలు ఇస్తున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతపురం కార్పొరేషన్ పరిధిలో 117 మందికి మాత్రమే రుణాలు మంజూరు చేశారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.30 వేలు మాత్రమే సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అంటే రూ.30వేలు సబ్సిడీ ఇస్తే..మరో రూ.30 వేలు బ్యాంకు రుణం లభిస్తుంది. ఈ డబ్బు ఇచ్చేందుకు ప్రతి లబ్ధిదారుడు మొదటగా బ్యాంకులో రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల దాకా డిపాజిట్ చేయాలి. అలాంటి వారికే బ్యాంకర్లు రుణాలు ఇస్తారు. అంటే ప్రభుత్వం ఇచ్చే రూ.30 వేల కోసం రూ.1.50లక్షలు ముందస్తుగా డిపాజిట్ చేయాలన్నమాట. లబ్ధిదారుడు వాయిదాల పద్ధతిలో 18 నెలల్లో రూ.30వేలు తిరిగి చెల్లించాలి. ఈ 18 నెలలకు రూ.1.50 లక్షలకు రూ.2 ప్రకారం వడ్డీ వేసుకున్నా రూ.54 వేలు అవుతుంది. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం కాపుల సంక్షేమంపై ఏమేరకు చిత్తశుద్ధి ప్రదర్శిస్తోందో, ఇచ్చే రుణాలు ఏమాత్రం వారి ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తాయో ఇట్టే తెలుస్తోంది. బుధవారం కాపు రుణాలపై ప్రకటన రాగానే ఆ వర్గం ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని మండిపడుతున్నారు. రైతుల లాగే మమ్మల్ని మోసగించారు - బళ్లారి వెంకట్రాముడు, రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షుడుప్రభుత్వం రైతులను ఎలా మోసం చేసిందో కాపు, బలిజ, తెలగ, ఒంటరికులాలను కూడా అదేస్థాయిలో వంచించింది. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు అతితక్కువ మందికి మాత్రమే మంజూరు చేస్తున్నారు. దరఖాస్తుల కోసం వసూలు చేసిన డబ్బుకు సరిపడ రుణాలు కూడా ఇవ్వలేదు. చిల్లర విదిల్చినట్లు రూ.30 వేలు మాత్రమే ఇస్తోంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తాం.