గిరిజన యూనివర్సిటీకి మోక్షం

Salvation to the Tribal University  - Sakshi

2019–20 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం 

తొలి ఏడాది ఆరు యూజీ, పీజీ కోర్సులు 

గిరిజనులకు 30 శాతం కేటాయింపు 

ప్రస్తుతం జాకారం వైటీసీలో కార్యకలాపాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు గిరిజన యూనివర్సిటీకి ముందడుగు పడింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్ర అవతరణ సమయంలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది. భూపాలపల్లి జిల్లా జాకారం సమీపంలో 483 ఎకరాల విస్తీర్ణంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. పార్లమెంటులో గిరిజన యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం లభించాకే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటులో బిల్లుకు జాప్యం జరుగుతున్నందున విభజన చట్టం ప్రకారం పనులు మొదలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ మంజూరు, నిధుల కేటాయింపులు, నిర్వహణ అంతా కేంద్రం ఆధ్వర్యంలోనే ఉంటుంది. 

173 ఎకరాలు అప్పగింత..: జాకారంలో 483 ఎకరాల స్థలాన్ని గిరిజన యూనివర్సిటీకి ప్రతిపాదించారు. ఇందులో 173 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో ఆ మేరకు రెవెన్యూ శాఖ.. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది. మరో వంద ఎకరాలు అసైన్డ్‌ భూమి కావడంతో రైతులకు పరిహారం చెల్లించాక అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే సేకరణ ప్రక్రియ మొదలైంది. మరో 213 ఎకరాలు అటవీ శాఖ పరిధిలో ఉంది. ఈ భూమి అప్పగింతకు సంబంధించి అటవీ శాఖతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే అటవీ శాఖ భూమిలో ఉన్న పచ్చదనానికి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దని, ప్రహరీ మాత్రమే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. 

రూ.500 కోట్లతో నిర్మాణాలు 
గిరిజన వర్సిటీ కార్యకలాపాలు మరో 6 నెలల్లో ప్రారంభం కానుండగా అప్పట్లోగా కొత్త భవనాలు నిర్మించడం సాధ్యంకానందున మౌలిక వసతుల కల్పనకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. జాకారంలో ఉన్న వైటీసీ(యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్‌)ను పరిపాలన విభాగం, తరగతుల నిర్వహణకు వాడుకోనున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్‌తో పాటు 300 మంది విద్యార్థులకు సరిపడా సదుపాయాలున్నా యి. రెండేళ్లలో నిర్మాణ పనులు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ పనులకు రూ.500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.

తొలుత యూజీ, పీజీ కోర్సులు
2019–20 విద్యా సంవత్సరంలో గిరిజన యూనివర్సిటీలో 6 కోర్సులను అందుబాటులోకి తేనున్నారు. ఇందులో డిగ్రీ, పీజీ కోర్సులున్నాయి. డిగ్రీలో బీఏ(హోటల్‌ మేనేజ్‌మెంట్‌), బీసీఏ, బీబీఏ, ఎంసీఏ, ఎంబీఏ (మార్కెటింగ్, ప్యాకేజింగ్‌), ఎంఏ (గిరిజన సంస్కృతి, జానపద కళలు) కోర్సులను ప్రారంభిస్తారు. మరిన్ని పీజీ, పీహెచ్‌డీ కోర్సులను దశల వారీగా అందుబాటులోకి తేనున్నారు. తొలి ఏడాది వివిధ కోర్సుల్లో 180 మందికి ప్రవేశాలు కల్పిస్తారు. ఏడేళ్ల తర్వాతికి ఈ యూనివర్సిటీలో 7 వేల మంది విద్యార్థులుంటారు. గిరిజనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావడంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రవేశాల్లో 30శాతం సీట్లు వారికి కేటాయించనుంది.

పరిహారానికి రూ.10 కోట్లు: ఎస్‌కే జోషి
గిరిజన వర్సిటీ భూసేకరణ వేగవంతం చేయాలని సీఎస్‌ ఎస్‌కే జోషి అధికారులను ఆదేశించారు. దీని కోసం రూ.10 కోట్లను భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు విడుదల చేయాలని గిరిజన సంక్షేమ శాఖను ఆదేశించారు. గిరిజన వర్సిటీపై సచివాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ వర్సిటీ కమిటీలో ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా నియమించాలన్నారు. తరగతుల నిర్వహణకు అవసరమైన పనులను ప్రారంభించాలన్నారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌ దత్‌ ఎక్కా, కమిషనర్‌ క్రిస్టినా జెడ్‌ చోంగ్తూ, భూపాలపల్లి కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top