ప్రతిభకు పట్టం.. సేవకు సలాం!

Sakshi Excellence Awards Event At Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తమ సేవ, అత్యుత్తమ ప్రతిభ, విశేష కృషి ద్వారా తమ రంగాల్లో సమాజాభివృద్ధికి దోహదపడుతున్న వారికి ప్రతి ఏటా అందించే ‘సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డు’ల ప్రధానోత్సవం శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. జేఆర్సీ కన్వెన్షన్‌ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. పలువురు ఇతర ముఖ్యులు అతిథులుగా పాల్గొనే ఈ వేడుకలో 2018 సంవత్సరం సాక్షి ఎక్సలెన్స్‌ అవార్డులను విజేతలకు ప్రదానం చేస్తారు. కొందరి అసాధారణ ప్రతిభ, ఇంకొందరి అవిరళ సేవ, మరికొందరి విశేష కృషి.. తగు రీతిన గుర్తింపు పొందడమే కాకుండా సమకాలికులకు, తర్వాతి తరాల వారికి స్ఫూర్తి కావాలనేదే సాక్షి తలంపు.

ఇదే యోచనతో, సమాజంలోని వేర్వేర రంగాల్లో విశేషంగా శ్రమిస్తున్న వారిని గుర్తించి, అభిమానించి, అభినందించి, అవార్డులతో సత్కరించే కార్యక్రమాన్ని సాక్షి మీడియా సంస్థ గత నాలుగేళ్లుగా నిర్వహిస్తోంది. వరుసగా ఇది ఐదో సంవత్సరం. విద్య, వైద్య, వాణిజ్య, వ్యవసాయ, సామాజిక సేవ తదితర రంగాలతో పాటు వివిధ విభాగాల్లో ఈ అవార్డులున్నాయి. సినిమా రంగానికి చెందిన పాపులర్‌ అవార్డులతో పాటు జ్యూరీ ప్రత్యేక అవార్డులను కూడా ఈ సందర్భంగా అందజేయనున్నారు. సమా జ ఉన్నతికి తోడ్పడే కృషి ఏదైనా, అది.. వినూత్నంగా చేయడం, ప్రభావవంతంగా ఉండటం, సుస్థిరమై నిలవడం అన్న మూడంశాల ప్రాతిపదికన ఈ విజేతల్ని ఎంపిక చేశారు. అసాధారణ సేవ, కృషి, ప్రతిభ కలిగిన వ్యక్తులు, సంస్థల గురించి పలువురి ద్వారా అందిన ఎంట్రీలను లోతుగా పరిశీలించి, ప్రత్యేకంగా ఏర్పాటైన న్యాయనిర్ణేతలు అంతిమంగా విజేతల్ని ఖరారు చేశారు. శనివారం జరిగే ఈ అవార్డు ప్రదానోత్స కార్యక్రమ విశేషాలను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న సాక్షి టీవీ ప్రసారం చేయనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top